National Politics: దిల్లీయే లక్ష్యం..!

ఆ ముగ్గురు ముఖ్యమంత్రులు మూడు వేర్వేరు పార్టీలకు చెందినవారు. ఇప్పుడు వారందరి నోట వినిపిస్తున్న మాట కేంద్రంలో ‘ప్రత్యామ్నాయం’. తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు, పశ్చిమ బెంగాల్‌ సీఎం

Updated : 03 Feb 2022 06:11 IST

ముగ్గురు ముఖ్యమంత్రుల సరికొత్త రాజకీయం

కేంద్రంపై గళమెత్తుతున్న కేసీఆర్‌, స్టాలిన్‌, మమత

సామాజిక న్యాయ సమాఖ్యలో చేరాలని తమిళనాడు సీఎం ఆహ్వానం

మోదీ సర్కారును కలిసికట్టుగా ఓడిద్దామంటున్న బెంగాల్‌ సీఎం

భాజపాయేతర, కాంగ్రెసేతర ప్రత్యామ్నాయంపై కేసీఆర్‌ దృష్టి

దిల్లీ, చెన్నై-న్యూస్‌టుడే

ఆ ముగ్గురు ముఖ్యమంత్రులు మూడు వేర్వేరు పార్టీలకు చెందినవారు. ఇప్పుడు వారందరి నోట వినిపిస్తున్న మాట కేంద్రంలో ‘ప్రత్యామ్నాయం’. తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రస్తుతానికి విడివిడిగానే సాగిస్తున్న రాజకీయం ఇది. ఎవరికి వారు తమదైన శైలిలో కేంద్రంపై విరుచుకుపడుతున్నారు. సరికొత్త వ్యూహాలకు పదునుపెడుతున్నారు. మున్ముందు ఇది ఎలాంటి మలుపు తిరగనుంది? 2024 నాటికి జాతీయ స్థాయిలో సరికొత్త రాజకీయ సమీకరణాలకు దారితీస్తుందా? కేంద్రంలోని మోదీ- అమిత్‌ షా ద్వయానికి ప్రాంతీయ నేతల కూటమి ధీటుగా నిలుస్తుందా? 2019 సార్వత్రిక ఎన్నికల నాటి లోపాల్ని అధిగమిస్తూ.. ఈసారి గేరు మార్చి గమ్యస్థానం చేరగలుగుతుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ అంతకంతకూ ప్రాబల్యం కోల్పోతున్న నేపథ్యంలో వీరి వ్యాఖ్యలు, ఎత్తుగడలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి.

కలిసిరావాలని నేతలకు స్టాలిన్‌ పిలుపు

దేశంలో సామాజిక న్యాయ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేస్తున్న ‘అఖిల భారత సామాజిక న్యాయ సమాఖ్య’లో చేరాలంటూ పలు పార్ట్టీల నేతలకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆహ్వానం పలికారు. సోనియాగాంధీ, కేసీఆర్‌, వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, కేజ్రీవాల్‌, చంద్రబాబునాయుడు, పవన్‌ కల్యాణ్‌, లాలూ ప్రసాద్‌ యాదవ్‌, సీతారాం ఏచూరి, అసదుద్దీన్‌ ఒవైసీ సహా 37 మందికి లేఖలు రాశారు. ‘అందరికీ సమాన అవకాశాలు కల్పించడం ద్వారా మాత్రమే రాజ్యాంగ నిర్మాతలు చూడాలనుకున్న సమ సమాజాన్ని నిర్మించగలం. సామాజిక న్యాయానికి రిజర్వేషన్‌ ఒక్కటే సరిపోదు. ప్రతి అడుగులోనూ కొన్ని ప్రత్యేక అధికారాలు ఉండాలి. మండల్‌ కమిషన్‌ ఏర్పాటుకు చూపిన అదే సంకల్పం, ఉద్దేశాన్ని ప్రస్తుతం కూడా చూపించాలి...’ అని దానిలో పేర్కొన్నారు. ఆయా పార్టీల నుంచి అర్హులైన వ్యక్తులను సమాఖ్యలో ప్రతినిధులుగా నియమించాలని కోరారు.

హామీ ఇస్తే బెంగాల్‌ దాటి వస్తా: మమత

‘పార్టీని జాగ్రత్తగా చూసుకుంటామని నాకు మీరు హామీ ఇస్తే.. నేను రాష్ట్రం వెలుపల నా పనిపై ఎక్కువ దృష్టి సారించగలను. దేశవ్యాప్తంగా తృణమూల్‌ కాంగ్రెస్‌ను విస్తరించగలను’ అని మమత బుధవారం పార్టీ అధ్యక్షురాలిగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా కోల్‌కతాలో కార్యకర్తలకు చెప్పారు. ప్రాంతీయ పార్టీలంతా ఓ తాటిపైకి వచ్చి 2024 లోక్‌సభ ఎన్నికల్లో భాజపాని ఓడించాలని పిలుపునిచ్చారు. ‘మా లక్ష్యం.. భాజపా పరాజయమే. పశ్చిమ బెంగాల్‌లో సీపీఎంను ఓడించినట్లే జాతీయ స్థాయిలో భాజపాను మట్టి కరిపించగలం’ అని చెప్పారు. భాజపాపై వ్యతిరేక పోరాటంలో ఏ పార్టీ అయినా అందరితో కలవకుండా అహంకారం ప్రదర్శిస్తూ కూర్చుంటే చేసేదేమీ లేదన్నారు. తమ పార్టీ ఒంటరిగానైనా కమలంతో అమీతుమీ తేల్చుకుంటుందని స్పష్టం చేశారు. తన మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, సీనియర్‌ నేత సుబ్రతా బక్షి జాతీయ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతారని చెప్పారు.

త్వరలో దిల్లీకి కేసీఆర్‌

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశిస్తున్న సీఎం కేసీఆర్‌ కాంగ్రెసేతర, భాజపాయేతర కూటమి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు నేతలను కలిసిన ఆయన.. తన ప్రయత్నాల్ని మరింత ముమ్మరం చేయబోతున్నారు. ఇందుకోసం త్వరలో దిల్లీకి వెళ్లనున్నారు. ఇలాంటి కూటమి కోసం 2019 ఎన్నికల నుంచే ఆయన ప్రయత్నిస్తున్నారు. స్టాలిన్‌తో సమావేశమైనప్పుడు, కేరళ సీఎం పినరయి విజయన్‌ సహా వామపక్ష నేతలు హైదరాబాద్‌ వచ్చినప్పుడూ కూటమి ఆవశ్యకతను వివరించినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని