చితికి చోటేది!

నానాటికీ పెరిగిపోతున్న కొవిడ్‌ మృతులకు అంత్యక్రియలు నిర్వహించడానికి ఇప్పుడున్న శ్మశాన వాటికలు సరిపోవడంలేదు. దీంతో ఇక్కడి మున్సిపల్‌ కార్పొరేషన్లు శ్మశానాలకు ఆనుకొని ఉన్న పార్కులు, పార్కింగ్‌ స్థలాలు, రోడ్డు పక్కనున్న ఖాళీ స్థలాల్లోనూ చితులు ఏర్పాటు చేస్తున్నాయి. ప్రతి శ్మశానవాటికలోనూ

Updated : 27 Apr 2021 07:51 IST

ఖాళీ లేని దిల్లీ శ్మశాన వాటికలు
అంతిమ సంస్కారాల కోసం మృతదేహాలతో నిరీక్షణ
దేశవ్యాప్తంగా ఒకేరోజు 2,812 మంది మృతి

ఈనాడు, దిల్లీ: మహమ్మారి స్వైర విహారంతో దేశంలోని ఆసుపత్రులు, శ్మశానవాటికలు కిటకిటలాడుతున్నాయి. ప్రాణాధారమైన ఆక్సిజన్‌, ఔషధాల కొరత నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు కొనసాగుతుండగా మరోవైపు పార్థివ దేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు శ్మశానాల్లో స్థలం దొరకడంలేదు. దేశంలో సోమవారం ఉదయం 8 గంటలతో ముగిసిన గత 24 గంటల్లో 2,812 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. కొత్తగా 3,52,991 మందికి వైరస్‌ సోకింది. ఈ నెలలో ఇప్పటి వరకు 50 లక్షలకుపైగా కేసులు, 32 వేల మరణాలు నమోదయ్యాయి. గత ఏడాది ఇన్నే కేసులకు 230 రోజులు, మరణాలకు 178 రోజులు పట్టింది. ఈ నెలలో ఇప్పటి వరకు సగటున రోజుకు 1.98 లక్షల కేసులు, 1,252 మరణాలు చోటుచేసుకున్నాయి. రోజురోజుకీ ఉద్ధృతమవుతున్న ప్రమాదాన్ని తలుచుకొని పరిస్థితులు ఎంతవరకు పోతాయోనన్న భయాందోళనలు ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన హిందీ సాహితీవేత్త, పద్మశ్రీ అవార్డుగ్రహీత మంజూర్‌ ఎహతేషమ్‌(73) కరోనాతో మృతి చెందారు.

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం
గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌లోని ఆయుష్‌ ఆసుపత్రిలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకోగా 16 మంది కొవిడ్‌ రోగులను ఇతర ఆసుపత్రులకు తరలించారు. వీరిలో వ్యాధి తీవ్రంగా ఉన్న నలుగురు చనిపోయారు.

ఖాళీ జాగాల్లో చితులు

దిల్లీలో నానాటికీ పెరిగిపోతున్న కొవిడ్‌ మృతులకు అంత్యక్రియలు నిర్వహించడానికి ఇప్పుడున్న శ్మశాన వాటికలు సరిపోవడంలేదు. దీంతో ఇక్కడి మున్సిపల్‌ కార్పొరేషన్లు శ్మశానాలకు ఆనుకొని ఉన్న పార్కులు, పార్కింగ్‌ స్థలాలు, రోడ్డు పక్కనున్న ఖాళీ స్థలాల్లోనూ చితులు ఏర్పాటు చేస్తున్నాయి. ప్రతి శ్మశానవాటికలోనూ అన్ని చితులూ నిరంతరం కాలుతుండటం, అంత్యక్రియల కోసం శవాలతో బంధువులు నిరీక్షిస్తున్న దృష్ట్యా దిల్లీలోని మూడు మున్సిపల్‌ కార్పొరేషన్లు అదనపు స్థలాల అన్వేషణలో పడ్డాయి. సారాయ్‌కాలేఖాన్‌ శ్మశాన వాటికకు నిరంతరం మృతదేహాలు వస్తుండటంతో కొత్తగా 50 చితిమంటల వేదికలు నిర్మిస్తున్నారు.

ఆగమేఘాలపై ట్యాంకర్ల తరలింపు
కరోనా రోగుల ప్రాణాలు కాపాడేందుకు ఆక్సిజన్‌ ట్యాంకర్ల, సిలిండర్ల తరలింపు శరవేగంగా కొనసాగుతోంది. ఎయిరిండియా విమాన సంస్థ సోమవారం న్యూయార్క్‌ నుంచి 318 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ను దిల్లీకి తరలించింది. భారత వైమానిక దళానికి చెందిన భారీ రవాణా విమానం సి-17 దుబాయ్‌ నుంచి ఏడు ఖాళీ క్రయోజెనిక్‌ ఆక్సిజన్‌ కంటైనర్లను పశ్చిమబెంగాల్‌లోని పనాగఢ్‌కు చేర్చింది. దిల్లీలోని సర్‌ గంగారామ్‌ ఆసుపత్రికి సోమవారం 10 టన్నుల ద్రవీకృత ఆక్సిజన్‌ను, ఆక్సిజన్‌ నింపిన 64 సిలిండర్లను అధికారులు చేర్చారు.
* దిల్లీలో 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ కొవిడ్‌ టీకా ఉచితంగా ఇస్తామని సీఎం కేజ్రీవాల్‌ వెల్లడించారు. 1.34 కోట్ల డోసుల టీకా కొనుగోలుకు ఆమోదం లభించిందని తెలిపారు.

కొవిడ్‌కు వ్యతిరేకంగా భారత్‌ చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలుపుతూ.. దుబాయ్‌లోని ఖలీఫా వర్సిటీ, స్టేడియం భవనాలపై ‘స్టే స్ట్రాంగ్‌ ఇండియా’ పేరిట భారత జాతీయ జెండాల ప్రదర్శన.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు