PM Modi: అవమానకరంగా ఆంధ్రా విభజన

కేంద్రంలో అధికారంలో కూర్చోవడానికి ప్రధాన కారణమైన ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్‌ పార్టీ అవమానకర రీతిలో విభజించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ధ్వజమెత్తారు. అహంకారంతో కూడిన అధికార మత్తులో చేసిన రాష్ట్రవిభజన ఇప్పటికీ రెండు రాష్ట్రాలకు నష్టం చేకూరుస్తూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు బదులిస్తూ మంగళవారం ఉదయం రాజ్యసభలో ఆయన గంటన్నరపాటు ప్రసంగించారు. ఇందులో ప్రధాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పలుసార్లు గుర్తు చేసుకున్నారు. అంజయ్యకు జరిగిన అవమానం, ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి జరిగిన ప్రయత్నం,....

Updated : 09 Feb 2022 05:49 IST

పెప్పర్‌ స్ప్రేకొట్టి, మైకులు ఆపి చర్చలు లేకుండా చేశారు

అప్పటి స్పర్థలు ఇప్పటికీ ఏపీ, తెలంగాణలకు నష్టం చేస్తున్నాయి

అంజయ్యను అవమానించారు.. ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని కూలదోశారు

రాజ్యసభలో కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ

ఈనాడు, దిల్లీ: కేంద్రంలో అధికారంలో కూర్చోవడానికి ప్రధాన కారణమైన ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్‌ పార్టీ అవమానకర రీతిలో విభజించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ధ్వజమెత్తారు. అహంకారంతో కూడిన అధికార మత్తులో చేసిన రాష్ట్రవిభజన ఇప్పటికీ రెండు రాష్ట్రాలకు నష్టం చేకూరుస్తూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు బదులిస్తూ మంగళవారం ఉదయం రాజ్యసభలో ఆయన గంటన్నరపాటు ప్రసంగించారు. ఇందులో ప్రధాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పలుసార్లు గుర్తు చేసుకున్నారు. అంజయ్యకు జరిగిన అవమానం, ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి జరిగిన ప్రయత్నం, రాష్ట్ర విభజన సమయంలో జరిగిన పరిణామాలను గుర్తు చేస్తూ వీటన్నింటికీ కాంగ్రెసే కారణమని నిప్పులు చెరిగారు. ‘‘కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్‌ కీలక పాత్ర పోషించింది. ఇక్కడ అధికారంలో కూర్చోబెట్టిన ఆంధ్రప్రదేశ్‌ను అవమానకరంగా విభజించారు. మైకులు బంద్‌ చేసి, పెప్పర్‌ స్ప్రే చేసి ఎలాంటి చర్చ లేకుండా రాష్ట్ర విభజన చేశారు. ఇది మంచి పద్ధతా? ఇదేనా ప్రజాస్వామ్యం. వాజపేయీ హయాంలోనూ మూడు రాష్ట్రాలను విభజించి ఛత్తీస్‌గడ్‌, ఝార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. వాజపేయీ రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడు ఎలాంటి తుపానూ రాలేదు. అందరూ కూర్చొని శాంతియుతంగా నిర్ణయం తీసుకున్నారు. ఏపీ, తెలంగాణ విషయంలోనూ అలా జరిగి ఉండొచ్చు.  మేం తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదు. కలిసి కూర్చొని నిర్ణయాలు తీసుకొని ఉండొచ్చు. కానీ మీ అహంకారం, అధికార మత్తు దేశంలో స్పర్థలను సృష్టించింది. ఆ స్పర్థ ఇప్పటికీ ఏపీ, తెలంగాణలకు నష్టం చేస్తోంది. మీక్కూడా ఎలాంటి రాజకీయ ప్రయోజనం దక్కడం లేదు...’’ అని ప్రధాని మోదీ దుయ్యబట్టారు.

అంజయ్యకు చేసిన అవమానాన్ని మరిచిపోయారా?

ఇదివరకు రాజీవ్‌గాంధీ చేతుల్లో ముఖ్యమంత్రి అంజయ్యకు అవమానం జరిగినట్లు ప్రచారంలో ఉన్న సంఘటననూ ప్రధాని మోదీ గుర్తు చేశారు. ‘‘సమాఖ్య వ్యవస్థ గురించి పెద్దపెద్ద ప్రసంగాలు చేసేవారు ఎయిర్‌పోర్టులో చిన్న విషయం కోసం ముఖ్యమంత్రిని తొలగించడాన్ని మరిచిపోయినట్టున్నారు. ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి టి.అంజయ్య విషయంలో ఏ జరిగిందో ఈ సభలోని వారందరికీ బాగా తెలుసు. ప్రధానమంత్రి కుమారుడికి ఎయిర్‌పోర్టులో చెప్పిన స్వాగతం నచ్చకపోవడంతో ముఖ్యమంత్రిని పదవి నుంచి తొలగించారు. తద్వారా కోట్ల మంది ఆంధ్రప్రదేశ్‌ ప్రజల మనోభావాలను దెబ్బతీశారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వీరేంద్రపాటిల్‌ను అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు అవమానకరరీతిలో పదవీచ్యుతుడ్ని చేశారు...’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
్య ప్రస్తుతం ఏపీ, తెలంగాణల నుంచి పసుపు ఎగుమతులు పెరగడం తమ ప్రభుత్వ కృషి ఫలితమేనన్నారు. కరోనా సమయంలో ఆయుష్‌ మంత్రిత్వశాఖ ద్వారా భారతీయ వైద్య పద్ధతులకు ప్రచారం కల్పించడంతో ప్రజల్లో దానిపట్ల ఆసక్తి పెరిగి పసుపు వాడకం పెరిగిందని, దాని వల్ల పసుపు ఎగుమతులు వృద్ధి చెందాయని చెప్పారు.


ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని అస్థిరపరిచింది ఎవరు?

ఎన్టీఆర్‌ తొలిసారి అధికారంలోకి వచ్చిన కొన్నిరోజులకే ఆయన ప్రభుత్వాన్ని కూలదోసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అంశాన్నీ ప్రధాని మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ‘‘మొదట అవిశ్వాసం కల్పించడం, తర్వాత అస్థిరపరచడం, తర్వాత డిస్మిస్‌ చేయడం అన్న మూడు సూత్రాల ఆధారంగా కాంగ్రెస్‌ హైకమాండ్‌ వ్యవహరించింది. ఫరూక్‌ అబ్దుల్లా, చౌదరీ దేవీలాల్‌, చరణ్‌సింగ్‌, సర్దార్‌ బాదల్‌ ప్రభుత్వాలను ఎవరు అస్థిర పరిచారు? మహారాష్ట్రలో బాల్‌ఠాక్రేని అవమానించడానికి ఎవరు కుటిల ప్రయత్నాలు చేశారు? కర్ణాటకలో రామకృష్ణహెగ్డే, ఎస్‌ఆర్‌ బొమ్మై ప్రభుత్వాలను ఎవరు కూలదోశారు? 50వ దశకంలో కేరళలో ఎన్నికైన కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఎవరు పడగొట్టారు? తమిళనాడులో ఎమర్జెన్సీ సమయంలో కరుణానిధి ప్రభుత్వం, 1980లో ఎంజీఆర్‌ ప్రభుత్వాలను ఎవరు పతనం చేశారు? ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్‌ అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఎవరు ప్రయత్నించారు? కేంద్ర ప్రభుత్వం మాట వినడం లేదని ములాయంసింగ్‌ను ఇబ్బంది పెట్టింది ఎవరు?’’ అని ప్రధాని మోదీ ప్రశ్నిస్తూ కాంగ్రెస్‌ వైపు వేలెత్తి చూపారు.


 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని