Padma Awards: వేడుకగా ‘పద్మాల’ ప్రదానం

దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన 141 మంది ప్రముఖులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 2020 ఏడాదికి సంబంధించిన పద్మ పురస్కారాలను సోమవారం ప్రదానం చేశారు. వాస్తవానికి గతేడాదే...

Updated : 09 Nov 2021 13:56 IST

141 మందికి పురస్కారాలు అందజేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌
పద్మభూషణ్‌ అందుకున్న బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు, ముంతాజ్‌అలీ
పద్మశ్రీలు స్వీకరించిన నలుగురు తెలుగువారు

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా పద్మభూషణ్‌ అవార్డు అందుకుంటున్న పీవీ సింధు

దిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన 141 మంది ప్రముఖులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 2020 ఏడాదికి సంబంధించిన పద్మ పురస్కారాలను సోమవారం ప్రదానం చేశారు. వాస్తవానికి గతేడాదే ఈ అవార్డులను అందజేయాల్సి ఉన్నా.. కరోనా మహమ్మారి ఉద్ధృతి కారణంగా వీలు కాలేదు. మరోవైపు, మరణానంతరం కొందరు అవార్డుకు ఎంపికవగా, వారి తరఫున కుటుంబసభ్యులు పురస్కారాలు అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు, ముంతాజ్‌అలీ పద్మభూషణ్‌ అవార్డు అందుకున్నారు. మరో నలుగురు పద్మశ్రీలు స్వీకరించారు. రాష్ట్రపతి భవన్‌లో సోమవారం జరిగిన ఈ కార్యక్రమానికి  ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా తదితరులు హాజరయ్యారు. 141 మందిలో ఏడుగురు పద్మ విభూషణ్‌, 16 మంది పద్మ భూషణ్‌, 118 మంది పద్మశ్రీ అందుకున్నారు.

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకుంటున్న చింతల వెంకట్‌రెడ్డి

*  కేంద్ర మాజీ మంత్రులు అరుణ్‌ జైట్లీ, సుష్మాస్వరాజ్‌, జార్జ్‌ ఫెర్నాండెజ్‌లకు మరణానంతరం పద్మవిభూషణ్‌ లభించిన సంగతి తెలిసిందే. అరుణ్‌ జైట్లీ తరఫున ఆయన సతీమణి సంగీత జైట్లీ, సుష్మాస్వరాజ్‌ తరఫున ఆమె కుమార్తె బన్సూరీ స్వరాజ్‌, జార్జ్‌ ఫెర్నాండెజ్‌ తరఫున ఆయన భార్య లీలా కబీర్‌లు ప్రథమ పౌరుడి నుంచి పురస్కారాలు స్వీకరించారు.

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకుంటున్న శ్రీభాష్యం విజయసారథి

*  ఆధ్యాత్మిక రంగంలో సేవలందించినందుకు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన సత్సంగ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు ముంతాజ్‌ అలీ పద్మభూషణ్‌ పురస్కారం అందుకున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం నిమ్మలకుంటకు చెందిన తోలుబొమ్మలాట కళాకారుడు దళవాయి చలపతిరావు (78) పద్మశ్రీ స్వీకరించారు. ఏపీకే చెందిన యడ్ల గోపాలరావు (కళలు), తెలంగాణకు చెందిన రైతు చింతల వెంకట్‌రెడ్డి, సంస్కృత కవి శ్రీభాష్యం విజయసారథిలు పద్మశ్రీ అందుకున్నారు.


స్ఫూర్తి పొందండి: నరేంద్ర మోదీ

ద్మ పురస్కార గ్రహీతల్లో సామాన్యులూ ఉండడం సంతోషం కలిగించిందని ప్రధాని మోదీ అన్నారు. ‘‘పర్యావరణం నుంచి వ్యాపార రంగం వరకు, వ్యవసాయం నుంచి కళల వరకు, శాస్త్ర సాంకేతిక రంగాల నుంచి సామాజిక సేవ వరకు,  ప్రభుత్వ పాలన నుంచి సినిమా రంగం వరకు.. ఇలా విభిన్న రంగాలకు చెందినవారు పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. వారి గురించి తెలుసుకుని స్ఫూర్తి పొందండి’’ అని సోమవారం ఆయన ట్వీట్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని