Telangana News: తెలంగాణలో రైతు వ్యతిరేక ప్రభుత్వం

తెలంగాణలో రైతువ్యతిరేక ప్రభుత్వం ఉందని, తప్పుడు మాటలతో రైతులను భ్రమల్లోకి నెడుతూ తప్పుదారి పట్టిస్తోందని, కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ, వినియోగ వ్యవహారాలశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ విమర్శించారు. బియ్యం సేకరణ

Updated : 25 Mar 2022 12:53 IST

  అన్నదాతలను తప్పుదోవ పట్టిస్తోంది

  రబీ సీజన్‌లో ఎంత బియ్యం ఇస్తారో చెప్పడంలేదు

ఇచ్చిన లిఖితపూర్వక హామీకి ఆ ప్రభుత్వం కట్టుబడి ఉండాలి

పంజాబ్‌, తెలంగాణల విషయంలో భేదభావం లేదు

ముడిబియ్యం ఎంత ఇచ్చినా తీసుకుంటాం:  కేంద్రమంత్రి గోయల్‌

ఈనాడు, దిల్లీ: తెలంగాణలో రైతువ్యతిరేక ప్రభుత్వం ఉందని, తప్పుడు మాటలతో రైతులను భ్రమల్లోకి నెడుతూ తప్పుదారి పట్టిస్తోందని, కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ, వినియోగ వ్యవహారాలశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ విమర్శించారు. బియ్యం సేకరణ అంశంపై గురువారం తెలంగాణ మంత్రులు, పార్లమెంటు సభ్యులతో సుమారు గంటపాటు పార్లమెంటులోని తన కార్యాలయంలో చర్చించిన అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై నిప్పులు చెరిగారు. తాము దేశమంతటా ఒకే బియ్యం సేకరణ విధానాన్ని అనుసరిస్తున్నామని, పంజాబ్‌, తెలంగాణలకు వేర్వేరు విధానాలు, భేదభావం లేవని స్పష్టంచేశారు. ముడిబియ్యం ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ఆరునెలల క్రితమే లిఖితపూర్వకంగా చెప్పిందని, దానికి కట్టుబడి ఉండాలన్నారు. ముడిబియ్యం ఎంత ఇస్తే అంత తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.‘‘గత కొన్నేళ్లుగా తెలంగాణ నుంచి ఎంఎస్‌పీ కింద కొనుగోలుచేస్తూ వస్తున్న బియ్యం పరిమాణం భారీగా పెరిగింది. దీని కింద రైతులకు చెల్లించిన కనీస మద్దతు ధర 2014-15 నుంచి 2020-21 మధ్యకాలంలో రూ.3,391 కోట్ల నుంచి రూ.26,610 కోట్లకు చేరింది. ఆరేళ్లలో 700% పెరుగుదల నమోదైంది. రాష్ట్రప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంలోని 18వ నిబంధన ప్రకారం రాష్ట్రాల వద్ద ఉన్న బియ్యం నిల్వల్లో అక్కడ ప్రజాపంపిణీ వ్యవస్థ కేటాయింపులు, ఇతర సంక్షేమ పథకాలకు పోగా మిగిలినవాటిని ఎఫ్‌సీఐకి అప్పగించాలి.  తెలంగాణ గురించి ఒక విషయం చెప్పడానికి చాలా బాధపడుతున్నా. రబీమార్కెట్‌ సీజన్‌లో రాష్ట్రాలు ఎంత బియ్యం ఇస్తాయో అంచనావేయడానికి కేంద్ర ఆహారశాఖ కార్యదర్శి ఫిబ్రవరి 25న ఏర్పాటుచేసిన సమావేశానికి హాజరైన రాష్ట్ర అధికారులు తాము ఎంత బియ్యం ఇస్తామన్నది చెప్పలేదు. ఈనెల 8న నిర్వహించిన మరో సమావేశంలో ఫోర్టిఫైడ్‌ రైస్‌, రబీ రైస్‌ సేకరణ గురించి అడిగినా స్పందించలేదు. ఇప్పటివరకు అన్ని రాష్ట్రాలు చెప్పినా తెలంగాణ నుంచి మాత్రం లెక్కలు రాలేదు. అక్కడ రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉంది. అందుకే రైతులను భ్రమల్లోకి నెడుతోంది’’ అనిగోయల్‌ ఆరోపించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు