
PM Modi: వారిపై వేటెందుకు?
ట్విటర్ గొడవే ప్రసాద్‌ను ముంచిందా?
పార్టీ బాధ్యతల కోసమేనంటున్న నేతలు
ఈనాడు, దిల్లీ: కేంద్ర మంత్రివర్గం నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ 12 మందికి ఉద్వాసన పలికినా.... ఇద్దరిపై వేటు మాత్రం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. వారు- న్యాయ, కమ్యూనికేషన్లు, ఐటీ శాఖలు నిర్వహిస్తున్న రవిశంకర్ ప్రసాద్; సమాచార, ప్రసార, పర్యావరణ, అటవీ, భారీ పరిశ్రమల శాఖలు చూసిన ప్రకాశ్ జావ్డేకర్లు! ఎన్డీయే తొలి, మలి దఫా ప్రభుత్వాల్లో ఇప్పటిదాకా కీలక బాధ్యతలు పోషిస్తూ వచ్చిన వీరిని తప్పించడానికి ప్రధాన కారణం మళ్లీ అధికార ప్రతినిధులుగా పంపటానికా, లేదంటే వారి పనితీరులో కనిపించిన లోపమా అన్నది చర్చనీయాంశంగా మారింది.
వాక్చాతుర్యమున్నా...
రవిశంకర్ ప్రసాద్‌కు ఉద్వాసన పలకడానికి ఇటీవల తలెత్తిన ట్విటర్ వివాదమే ప్రధాన కారణమన్నది ఒక వాదన! ట్విటర్‌తోపాటు, ఇతర సామాజిక మాధ్యమాల నియంత్రణలో ప్రభుత్వ అసలు ఉద్దేశం ఏంటన్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పకుండా, తన వ్యక్తిగత మేధోసంపత్తిని ప్రదర్శించేలా మాట్లాడి అంతర్జాతీయంగా భారత్‌కు నష్టం చేసేలా వ్యవహరించారన్నది ఆయనపై ఉన్న విమర్శ! ట్విటర్, ప్రభుత్వం మధ్య జరుగుతున్న ఘర్షణ కారణంగా భారత ప్రభుత్వం మీడియాను నియంత్రిస్తోందన్న ప్రచారం అంతర్జాతీయ సమాజంలో జరుగుతోంది. వాక్చాతుర్యం ఉన్నప్పటికీ మంత్రిగా పనితీరు ప్రదర్శించడంలో అనుకున్నంత స్థాయిలో ఆయన వ్యవహరించలేదని భాజపా వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే... వచ్చే ఏడాది ఏడు ముఖ్యమైన రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పార్టీ వ్యవహారాలు చూసే బాధ్యతలు, పార్టీ వాదనను బలంగా వినిపించే పనిని ప్రసాద్‌కు అప్పగించాలనే ఉద్దేశం కూడా మంత్రివర్గం నుంచి తప్పించటానికి ఓ కారణమని కూడా భాజపా నేతలు విశ్లేషిస్తున్నారు.
కొవిడ్ కారణంగానే...
* వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ను తప్పించడానికి ప్రధాన కారణం దేశంలో కొవిడ్ వ్యవహారంలో పూర్తిగా విఫలం కావడమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయన క్రియాశీలకంగా లేకపోవడం వల్లే సమస్య చేయిదాటే పరిస్థితి వచ్చిందని, ముఖ్యంగా దిల్లీలో తలెత్తిన ఆక్సిజన్ కొరత పార్టీని దెబ్బతీసిందని, అందుకు ఆయన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందంటున్నారు. మరోవైపు ఆయన నేతృత్వంలో రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లినా భాజపా గెలవలేకపోయింది. అందుకే కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకోవడంలో భాగంగానే మహిళనేత మీనాక్షీ లేఖిని తెచ్చారు.
* విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్‌ను ఇంటికి పంపడానికి ఒకవైపు అనారోగ్యం, మరోవైపు పేలవమైన పనితీరే ప్రధాన కారణాలు. కీలకమైన విద్యాశాఖ మంత్రిగా ఆయన పనితీరు ఏ మాత్రం సరిగా లేదని ఆర్ఎస్ఎస్ నేతలుసైతం విమర్శించినట్లు సమాచారం.
* సదానంద గౌడదీ ఇదే తీరు. మోదీ ప్రభుత్వంలో ఆయనకు ఇది వరకు రైల్వేశాఖ, న్యాయశాఖలిచ్చినా సరిగా పనిచేయలేక పోవడంతో చివరకు గణాంకాలు, ఎరువులు రసాయనాల శాఖలు అప్పగించారు. అయితే ఇందులో కూడా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారన్న భావన ఉంది. ప్రభుత్వ విధానాల గురించి బలంగా మాట్లాడలేకపోవడం, సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా లేకపోవడంతోపాటు, కర్ణాటక రాజకీయాలు ఆయన్ను బయటికి పంపడానికి దోహదపడ్డాయి.
* సంతోష్‌కుమార్ గంగ్వార్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓబీసీ వర్గానికి చెందిన ఈయన వయస్సు 72 ఏళ్లు దాటిపోయింది. కార్మికశాఖను స్వతంత్ర హోదాలో నిర్వహిస్తున్న ఈయన ఎక్కడా క్రియాశీలకంగా కనిపించిన దాఖలా లేదు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నా ఆ వాదనలను బలంగా తిప్పికొట్టే ప్రయత్నం ఏనాడూ చేయలేదు. ఏడోసారి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనకు రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉన్నప్పటికీ ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టు ముందుకుపోలేకపోతున్నారు. ఇదే ఆయన ఉద్వాసనకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
* పశ్చిమబెంగాల్‌కు చెందిన బాబుల్ సుప్రియో, దేబశ్రీ చౌధురిల ఉద్వాసనకు గత అసెంబ్లీ ఎన్నికల్లో వారు పార్టీని సరిగా నడిపించలేకపోవడమే కారణంగా తెలుస్తోంది. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సహాయమంత్రిగా ఉన్న బాబుల్‌సుప్రియో అక్కడ ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. మహిళా శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి దేబశ్రీచౌధురి సొంత జిల్లాలోనూ భాజపా ఏమాత్రం ఫలితాలు చూపకపోవడంవల్లే ఆమెనూ బయటికి పంపినట్లు తెలుస్తోంది. పనితీరు ఆధారంగానే... ఒడిశాకు చెందిన ప్రతాప్‌చంద్ర సారంగి, మహారాష్ట్రకు చెందిన ధోత్రే సంజయ్ శ్యాంరావ్ ధోత్రేలనూ సాగనంపారు.
మహారాష్ట్ర సమీకరణాల్లో...
ఇక ప్రకాశ్ జావ్డేకర్ విషయానికొస్తే... మహారాష్ట్ర నుంచి ఎక్కువ మందికి ప్రాతినిధ్యం లభించటం వల్లే ఆయన్ను తప్పించాల్సి వచ్చినట్లు చెబుతున్నారు. మిగతా మంత్రుల్లా ఈయన ఎక్కడా వివాదాస్పదం కాలేదు. కానీ మహారాష్ట్ర సామాజిక వర్గాల సమీకరణలో ఈయనను కొనసాగించడం సాధ్యం కాకపోవడంవల్లే తప్పించి ఉంటారన్న భావన పార్టీలో వ్యక్తమవుతోంది. వయస్సు 70 ఏళ్లకు పైబడటం కూడా ఆయనకు మైనస్ అయి ఉండొచ్చని అంచనా! ఈయనకు మళ్లీ పార్టీ బాధ్యతలు అప్పగించడంకానీ, లేదంటే ఏదైనా రాష్ట్రానికి గవర్నర్‌గా పంపడంకానీ జరగొచ్చని పార్టీవర్గాలంటున్నాయి. ఇదివరకు అరుణ్‌జైట్లీ, సుష్మాస్వరాజ్, వెంకయ్యనాయుడు, ప్రమోద్మహాజన్లాంటి వారు పార్టీ అధికార ప్రతినిధులుగా మీడియాపై విస్తృత ప్రభావం చూపగలిగారని, ఇప్పుడున్న పార్టీ అధికార ప్రతినిధులకు ఆ స్థాయి లేకపోవడం పార్టీకి నష్టం చేస్తోందన్న ఉద్దేశంతోనే సీనియర్లకు ఆ బాధ్యతలు అప్పగించడానికి వీలుగా ఈ చర్య తీసుకున్నట్లు కూడా చెబుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
KTR: పెరిగే గ్యాస్ ధరతో.. ప్రజలకు గుండె దడ: కేటీఆర్
-
Movies News
Sammathame: ఓటీటీలోకి ‘సమ్మతమే’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
Technology News
WhatsApp: వాట్సాప్‌లో ఐదు కొత్త ఫీచర్లు.. ఏమేం రానున్నాయంటే?
-
Sports News
HBD DHONI:‘ధోనీ’కి శుభాకాంక్షల వెల్లువ
-
India News
ఉద్ధవ్ ఠాక్రేకు చుక్కెదురు.. 66మంది కార్పొరేటర్లు శిందే క్యాంపులోకి జంప్
-
General News
Telangana News: హైదరాబాద్‌లో ఏరోస్పేస్ యూనివర్సిటీ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Venu: అందుకే సినిమాలకు దూరంగా ఉన్నా: వేణు తొట్టెంపూడి
- Naga Chaitanya: నువ్వే నాకు ప్రేమించడం నేర్పించావ్.. చై ఎమోషనల్ పోస్ట్
- ప్రసవం తర్వాత.. ఆ భాగం బిగుతుగా మారాలంటే..
- Elon Musk: ఉద్యోగితో మరో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన మస్క్?
- Nagababu: భీమవరం సభలో చిరంజీవి తప్ప మిగిలిన వారి నటన అద్భుతం: నాగబాబు ట్వీట్
- IND vs ENG : ధనాధన్ వేళాయె..
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- పాఠాలు చెప్పలేదని.. రూ.24లక్షల జీతం తిరిగిచ్చేసిన ప్రొఫెసర్
- Rahul Dravid : బజ్‌బాల్ అంటే ఏమిటీ?
- అలుపు లేదు... గెలుపే!