10th Class Exams: పదిలో ఆరు పరీక్షలే

పదో తరగతిలో ఈసారి ఆరు పరీక్షలే ఉంటాయి. ఇప్పటివరకు ఆరు సబ్జెక్టులకు 11 పరీక్షలు జరుపుతుండగా కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరానికి వాటిని ఆరింటికి కుదించారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Updated : 12 Oct 2021 11:24 IST

సైన్స్‌లో భౌతికశాస్త్రం, జీవశాస్త్రాలకు వేర్వేరు జవాబుపత్రాలు
సిలబస్‌ కూడా 70 శాతమే
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఈనాడు, హైదరాబాద్‌: పదో తరగతిలో ఈసారి ఆరు పరీక్షలే ఉంటాయి. ఇప్పటివరకు ఆరు సబ్జెక్టులకు 11 పరీక్షలు జరుపుతుండగా కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరానికి వాటిని ఆరింటికి కుదించారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి గత విద్యా సంవత్సరానికీ (2020-21) ఆరు పేపర్లే ఉంటాయని ప్రభుత్వం ఆదేశాలిచ్చినా కొవిడ్‌ కారణంగా పరీక్షలు జరగలేదు. అంతర్గత పరీక్షల ఆధారంగా విద్యార్థులకు మార్కులు కేటాయించారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది కూడా ఆలస్యంగా సెప్టెంబరు 1 నుంచి ప్రత్యక్ష తరగతులు మొదలయ్యాయి. ఈ క్రమంలో గత ఏడాది విధానాన్నే అమలు చేయాలని ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అంతేకాకుండా 1-10 తరగతుల పరీక్షలకు గతేడాది మాదిరిగానే 70 శాతం సిలబస్సే ఉంటుందని కూడా మరో ఉత్తర్వు జారీ చేశారు. పాఠశాల విద్యాశాఖ నుంచి సిలబస్‌ తగ్గింపుపై ఆగస్టు 24న ప్రతిపాదనలు పంపగా...నెలన్నర తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రాష్ట్రంలో 5 లక్షల మందికిపైగా పదో తరగతి విద్యార్థులున్నారు.

80 మార్కులకు రాత పరీక్షలు
ఇప్పటివరకు హిందీకి ఒక పరీక్ష ఉండగా...మిగిలిన అయిదు సబ్జెక్టులకు ఒక్కో దానికి రెండు పరీక్షలు ఉండేవి. ఈసారి వార్షిక పరీక్షల్లో ఒక్కో సబ్జెక్టుకు ఒక పరీక్ష...ఒక ప్రశ్నపత్రం మాత్రమే ఉంటుంది. గతంలో ఒక్కో పరీక్ష 40 మార్కులకు నిర్వహించగా ఈసారి 80 మార్కులకు పరీక్ష జరుపుతారు. ఇక అంతర్గత మార్కులు యథాతథంగా ఒక్కో సబ్జెక్టుకు 20 కేటాయిస్తారు. గతంలో నాలుగు అంతర్గత పరీక్షలు (ఎఫ్‌ఏ)లు జరపగా ఈసారి వాటిని రెండుకు తగ్గించారు. ఆ రెండింటి సగటు మార్కులను రాత పరీక్షలో వచ్చిన మార్కులకు కలుపుతారు. అంటే రాత పరీక్షకు 480, అంతర్గత పరీక్షలకు 120.. ఇలా మొత్తం 600 మార్కులకు పరీక్షలుంటాయి.
* సైన్స్‌లో గతేడాదివరకు భౌతిక, జీవశాస్త్రాలకు వేర్వేరుగా పరీక్షలు జరిపేవారు. ఈసారి ఒకటే పరీక్ష ఉంటుంది. అయితే రెండు జవాబుపత్రాలు ఇస్తారు. భౌతికశాస్త్రం ప్రశ్నలకు సమాధానాలను ఒకదాంట్లో, జీవశాస్త్రం జవాబులను మరోదాంట్లో రాయాలి. వాటిని ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులు మూల్యాంకనం చేసేందుకు వీలుగా మార్పు చేశారు.

సమయం అరగంట పెంపు
ఇప్పటివరకు ఒక్కో పరీక్ష సమయం 2.45 గంటలు. ఈసారి 80 మార్కులకు నిర్వహిస్తుండటంతో పరీక్ష సమయాన్ని 3.15 గంటలకు పెంచుతారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని