Supreme Court: తరచూ అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ సరికాదు: సుప్రీంకోర్టు

అక్రమ లేఅవుట్లను తరచూ క్రమబద్ధీకరించే అవకాశాలను ప్రభుత్వాలు కల్పించడం సరైంది కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ అంశం చట్టబద్ధతను నిర్ణయించేందుకే అన్ని రాష్ట్రాలను ప్రతివాదులుగా చేర్చి విచారణ చేపడుతున్నామని....

Updated : 15 Mar 2022 04:30 IST

ఈనాడు, దిల్లీ: అక్రమ లేఅవుట్లను తరచూ క్రమబద్ధీకరించే అవకాశాలను ప్రభుత్వాలు కల్పించడం సరైంది కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ అంశం చట్టబద్ధతను నిర్ణయించేందుకే అన్ని రాష్ట్రాలను ప్రతివాదులుగా చేర్చి విచారణ చేపడుతున్నామని తెలియజేసింది. అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణపై జువ్వాడి సాగర్‌రావు అనే వ్యక్తి గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. తెలంగాణలో అక్రమ లేఅవుట్లలోని స్థలాల రిజిస్ట్రేషన్‌కు అనుమతిస్తున్నారని, అటువంటి ప్లాట్ల క్రమబద్ధీకరణకు వేల మంది మంది దరఖాస్తు చేసుకున్నారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది శ్రవణ్‌ కుమార్‌ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. సుప్రీంకోర్టులో పిటిషన్‌ విచారణ దశలో ఉండగానే ఆంధ్రప్రదేశ్‌లో 46 వేల ప్లాట్లను క్రమబద్ధీకరించారని ధర్మాసనానికి తెలియజేశారు. ఈ దశలో జోక్యం చేసుకున్న జస్టిస్‌ లావు నాగేశ్వరరావు అక్రమ లేఅవుట్ల పరిధిలో స్థలాల క్రయవిక్రయాలను ఎందుకు అనుమతిస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాల తరఫు న్యాయవాదులను ప్రశ్నించారు. అక్రమ లేఅవుట్లను తరచూ క్రమబద్ధీకరించే అవకాశాలను ప్రభుత్వాలు కల్పించడం సరైంది కాదన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే ప్రభుత్వాలు స్థలాలను క్రమబద్ధీకరిస్తున్నాయని రెండు రాష్ట్ర ప్రభుత్వాల తరఫు సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి తెలియజేశారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మాసనం ఈ అంశంపై సమగ్ర విచారణ జరపాల్సి ఉందని అభిప్రాయపడింది. పిటిషన్‌ విచారణకు సంబంధించి ప్రతివాదులుగా ఉన్న సీబీఐ సహా మరికొన్ని రాష్ట్రాలు వెంటనే కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఏప్రిల్‌ 26వ తేదీకి వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని