Telangana Budget 2022: సేద్యం.. వైద్యం సకలజన సంక్షేమం

సంపన్నులు మరింత సంపన్నులైతే ఆ సంపద వారి నుంచి పేదలవైపు ప్రవహిస్తుందని చెప్పే ట్రికిల్‌ డౌన్‌ థియరీ బడ్జెట్‌ కాదు మాది. బడా కార్పొరేట్ల ప్రయోజనాలు కాపాడే బడ్జెట్‌ అంతకంటే కాదు.. బడుగుల జీవితాలు మార్చే బడ్జెట్‌ ఇది. ముమ్మాటికీ కేసీఆర్‌ మార్కు బడ్జెట్‌.

Updated : 08 Mar 2022 04:47 IST

బడ్జెట్‌లో సంక్షేమ రంగానికి పెద్ద పీట 

బలహీనవర్గాలకు బాసటే ధ్యేయంగా కేటాయింపులు

  దళితబంధుకే అత్యధిక నిధులు  

  విద్యకు అండ.. వైద్యానికి తోడ్పాటు

  కొత్త పథకాలు.. సరికొత్త కార్యక్రమాలు

  స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణానికి రూ. 3 లక్షలు  

  ఉద్యోగాల భర్తీకి వీలుగా నిధులు

  లక్ష మంది భవన నిర్మాణ కార్మికులకు మోటార్‌ సైకిళ్లు

  దేశానికి ఆదర్శవంతమైన బడ్జెట్‌: సీఎం కేసీఆర్‌

ఈనాడు - హైదరాబాద్‌

సంపన్నులు మరింత సంపన్నులైతే ఆ సంపద వారి నుంచి పేదలవైపు ప్రవహిస్తుందని చెప్పే ట్రికిల్‌ డౌన్‌ థియరీ బడ్జెట్‌ కాదు మాది. బడా కార్పొరేట్ల ప్రయోజనాలు కాపాడే బడ్జెట్‌ అంతకంటే కాదు.. బడుగుల జీవితాలు మార్చే బడ్జెట్‌ ఇది. ముమ్మాటికీ కేసీఆర్‌ మార్కు బడ్జెట్‌.

- ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు

ళితుల అభ్యున్నతికి తొలి ప్రాధాన్యమిస్తూనే బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసింది. వ్యవసాయానికి తోడ్పాటును కొనసాగిస్తూనే అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు అండగా నిలిచింది. అత్యధిక కుటుంబాలకు పథకాల ద్వారా చేరువయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌కు రూపకల్పన చేసింది. వైద్య, ఆరోగ్య రంగానికి నిధుల కేటాయింపులో ప్రాధాన్యం ఇచ్చింది. కొత్త పథకాలు.. సరికొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. కొత్త ఉద్యోగాల భర్తీ లక్ష్యాన్ని కొనసాగించింది. ఇందుకోసం రూ. 4,000 కోట్లు కేటాయించింది. ప్రాధాన్య పథకాలకు పెద్ద పీట వేస్తూ.. ఇప్పటి వరకు చేపట్టిన అన్ని కార్యక్రమాలనూ కొనసాగించేలా బడ్జెట్‌ రూపొందించింది. సొంత రాబడులే ఆలంబనగా రూ. 2.56 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 1.77 లక్షల కుటుంబాలకు దళితబంధు అమలుకు వీలుగా రూ. 17,700 కోట్లు కేటాయించింది. 57 ఏళ్లకే ఆసరా పింఛను అమలుకు నిధులను కేటాయించింది. రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణాన్ని కొనసాగిస్తూనే ఇంటి స్థలమున్న పేద కుటుంబాలు ఇళ్లను నిర్మించుకునేందుకు చేయూత ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 4 లక్షల ఇళ్ల నిర్మాణానికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక తోడ్పాటును అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రతి నియోజకవర్గంలో మూడేసి వేల ఇళ్ల నిర్మాణానికి తోడ్పాటును అందించనుంది. మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు నిధులను కేటాయించింది. పాఠశాలల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చింది. అటవీ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో మరో 8 వైద్య కళాశాలల ఏర్పాటుకు రూ. 1,000 కోట్లను ప్రతిపాదించింది. రూ. 75,000 లోపు వ్యవసాయ రుణాల మాఫీకి నిర్ణయించింది. గిరిజన ఆవాస ప్రాంతాలకు రోడ్ల వసతికి రూ. 1,000 కోట్లు కేటాయించింది. గొర్రెల పంపిణీ పథకాన్ని కొనసాగించేలా నిధులను ప్రతిపాదించింది. తొలిసారిగా చేనేత కార్మికులకు రూ. 5 లక్షల బీమా పథకాన్ని ప్రకటించింది. అలాగే గీత కార్మికుల కోసం రూ. 100 కోట్లతో ప్రత్యేక పథకాన్ని ప్రారంభించనుంది. భవన నిర్మాణ కార్మికులకు మొదటివిడతగా లక్షమందికి మోటార్‌ సైకిళ్లను అందజేయనుంది. 

బాలింతలకు, విద్యార్థినులకు కిట్లు 

బాలింతల పౌష్టికాహార సమస్యకు, రక్తహీనత సమస్యకు పరిష్కారం అందించేలా కేసీఆర్‌ న్యూట్రిషియన్‌ కిట్‌ పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఏడు నుంచి 12వ తరగతి చదువుతున్న ఏడు లక్షల మంది విద్యార్థినులకు ప్రయోజనం కల్పించే పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. వారికి ఉచితంగా హెల్త్‌ అండ్‌ హైజెనిక్‌ కిట్‌లను పంపిణీ చేయనుంది. శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డు చుట్టూ ఉన్న గ్రామాల్లో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి నిధులు అందించనుంది. రోడ్ల మరమ్మతులు, నిర్వహణ, మెట్రోరైలు ప్రాజెక్ట్‌తో హైదరాబాద్‌ పాతనగరం అనుసంధానం, శంషాబాద్‌ విమానాశ్రయానికి మెట్రో రైలు వంటి మౌలిక సదుపాయాలకు బడ్జెట్‌ కేటాయించింది. మిషన్‌ భగీరథ, పరిశ్రమలకు ప్రోత్సాహం, జలమండలికి ఉచిత నీటి సరఫరాకు, ఆర్టీసీ బలోపేతానికి, పామాయిల్‌ సాగు పోత్సాహకానికి నిధులు దక్కాయి. కేసీఆర్‌ కిట్‌, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, ఉపకార వేతనాలు, పల్లెప్రగతి, పట్టణ ప్రగతికి ప్రత్యేక నిధులు, పరిశ్రమలకు ప్రోత్సాహం, రోడ్ల వసతితో పాటు వైద్యఆరోగ్య రంగానికి, వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌కు నిధులను పెంచింది.

నీతి ఆయోగ్‌ సిఫారసులపై విశ్వాసం

గ్రాంట్‌ ఇన్‌ఎయిడ్‌ రూపంలో కేంద్రం నుంచి అందుతున్న మొత్తం పరిమితంగా ఉంటున్నా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఆశావహంతో బడ్జెట్‌లో గ్రాంట్‌ ఇన్‌ఎయిడ్‌ను రూ. 41,000 కోట్లుగా ప్రతిపాదించింది. కేంద్రం నుంచి పన్నుల వాటా రూ. 18,394 కోట్లుగా అంచనా వేసింది. కేంద్ర పథకాలు, విపత్తు నిర్వహణ నిధితో పాటు జీఎస్టీ పరిహారంగా రూ. 15,446 కోట్లు వస్తుందని పేర్కొంది. తెలంగాణ రాష్ట్రానికి గతంలో నీతి ఆయోగ్‌ సిఫారసు చేసిన మేరకు కేంద్రం నుంచి రూ. 25,555 కోట్లు అందుతుందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 49,350 కోట్ల మార్కెట్‌ రుణాలను తీసుకుంటున్న ప్రభుత్వం వచ్చే ఏడాది మరో రూ. 10,000 కోట్లను అదనంగా తీసుకునేలా రూ. 59,632 కోట్లను ప్రతిపాదించింది.


సొంత రాబడులపైనే ధీమా.. 

రాష్ట్ర ప్రభుత్వం సొంత రాబడులపై పూర్తి విశ్వాసం కనబరచింది. సవరించిన అంచనాలపై 23 శాతం పెంచి రూ. 2.56 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. సొంత పన్నుల రాబడి అంచనాలను 16 శాతం పెంచింది. పన్ను రాబడుల అంచనా తొలిసారిగా రూ. లక్ష కోట్ల మార్క్‌ దాటింది. రూ. 1.08 లక్షల కోట్ల పన్ను రాబడులను అంచనా వేసింది. అమ్మకం పన్ను, జీఎస్టీ రాబడి అంచనాలను 20 శాతం దాకా పెంచింది. ఎక్సైజ్‌ రాబడి అంచనాలను రూ. 500 కోట్లు పెంచగా రిజిస్ట్రేషన్‌ శాఖ రాబడిని 17 శాతం దాకా పెంచింది. పన్నేతర రాబడిలో భూముల అమ్మకం ద్వారా రూ. 15,500 కోట్లను సమకూర్చుకోనుంది. గనులశాఖ ద్వారా రాబడి అంచనాలను 59 శాతం దాకా పెంచింది.


కొత్త పథకాలు.. కార్యక్రమాలు..

ఇంటికి: స్థలం ఉంటే రెండు పడక గదుల ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలు

మోటార్‌ సైకిళ్లు: మొదటి విడతలో లక్ష మంది భవన నిర్మాణ కార్మికులకు..

ఆసరా: 57 ఏళ్లకే పింఛను అమలు

బీమా: నేతన్నలకు 5 లక్షల బీమా సాయం: గీత కార్మికులకు రూ.100 కోట్లతో ప్రత్యేక పథకం

విద్య: రాష్ట్రంలో తొలి మహిళా విశ్వవిద్యాలయం.. అటవీ వర్సిటీ ఏర్పాటు

కేసీఆర్‌ పోషకాల కిట్‌: బాలింతల్లో రక్తహీనత సమస్య పరిష్కారానికి

ఆరోగ్య సంరక్షణ కిట్‌: 7 నుంచి 12వ తరగతి చదివే 7 లక్షల మంది విద్యార్థినులకు పంపిణీ


* కరవు కాటకాల నుంచి నేడు తెలంగాణ సాగునీటి సమృద్ధిని సాధించింది. కరెంటు కోతల నుంచి 24 గంటల విద్యుత్తు కాంతుల్లోకి పయనించింది. సంక్షోభ కాలం నుంచి సంక్షేమ యుగంలోకి ప్రవేశించింది. అవమాన పరంపర నుంచి ఆత్మగౌరవ చైతన్యంలోకి అప్రతిహతంగా దూసుకుపోతోంది. ప్రజాస్వామ్య భారత చరిత్రలో తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానం ఒక అద్భుతం.


* ‘నేడు తెలంగాణ ఆచరించింది.. రేపు దేశం అనుసరిస్తుంది’ ఈ మాట అక్షర సత్యం. ఏడున్నర సంవత్సరాల చరిత్రే దానికి సాక్ష్యం. ఈ ప్రగతి యాత్రకు కొనసాగింపే నేటి బడ్జెట్‌.


* నాయకుడు దక్షత ఉన్నవాడైతే లక్షలకైనా, కోట్లకైనా సార్థకత చేకూరుతుంది. ఖజానాకు ఎంత ధనం వచ్చి చేరిందన్నది కాదు.. ఆ ధనం ప్రజల జీవితాల్లో ప్రతిఫలించిందా? లేదా? అన్నది ముఖ్యం.


* దళితబంధు కేవలం ఒక పథకం మాత్రమే కాదు.. దళితులకు ఉపాధిని, ఆత్మగౌరవాన్ని, అభివృద్ధిని, వికాసాన్ని చేకూర్చే ఒక దృక్పథం. దళిత జాతి ఆర్థిక ప్రగతి సాధించిననాడు సామాజిక అంతరాలు క్రమక్రమంగా అంతరిస్తాయి. మానవ సంబంధాలు సమానత్వంతో పరిమళిస్తాయి.


* ఎవరూ కల కననిది.. ఎవరి ఊహకూ అందనిది.. ఎవరూ దరఖాస్తు పెట్టి అడగనిది.. ధర్నాలు చేసి డిమాండ్‌ చేయనిది.. ఏ ఎన్నికల మేనిఫెస్టోలోనూ చెప్పనిది.. కేసీఆర్‌ తానే ఓ రైతుగా, రైతుబిడ్డగా ఆలోచించి ప్రవేశపెట్టిన మహత్తర పథకమే రైతుబంధు. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, ఝార్ఖండ్‌ తదితర రాష్ట్రాలు ఈ పథకాన్ని ఆదర్శంగా  తీసుకుంటున్నాయి. కేంద్రం కూడా అనుసరించింది.


* మట్టికైనా, మానుకైనా, మనిషికైనా జీవం పోసేది నీళ్లే. ఏడున్నరేళ్లలో ఎవరూ ఊహించని అద్భుతాలను కేసీఆర్‌ ఆవిష్కరించారు. సాగునీటి రంగ చరిత్రలో అద్భుతాల్ని సాకారం చేశారు.


* రాష్ట్రంలో ఊహకందని రీతిలో వ్యవసాయోత్పత్తి పెరిగింది. దిగుబడులను మోసేందుకు హమాలీలు చాలడం లేదు.   జోకేందుకు కాంటాలు సరిపోవడం లేదు.


* తెలంగాణలో 2014లో 20 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటి సౌకర్యం ఉండేది. 2021 నాటికి రాష్ట్ర ప్రభుత్వం 85.89 లక్షల ఎకరాలకు ఆ సౌకర్యం కల్పించింది.


* పేదల జీవితాలు మెరుగుపడినప్పుడే ఆర్థికవృద్ధికి సార్థకత అని నమ్మిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. అభివృద్ధితో సంక్షేమాన్ని అనుసంధానించారు.


* ఈ దేశంలో అత్యధిక గురుకుల విద్యాలయాలు కలిగిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. అంతర్జాతీయ విద్యాసంస్థలకు సమానంగా నేడు తెలంగాణ గురుకులాలు విద్యను అందిస్తున్నాయి.


* శాంతి భద్రతల విషయంలో ముఖ్యమంత్రి నమ్మే సిద్ధాంతం ఒక్కటే. ఆర్తులను రక్షించాలి.. ధూర్తులను శిక్షించాలి.. పట్టుదల కలిగిన నాయకుడు ఉంటే రాష్ట్రంలో గుడుంబా ఉండదు.. పేకాట క్లబ్బులకు ఆస్కారం ఉండదు.. గ్యాంబ్లింగ్‌ జబ్బుండదు.. మాదక ద్రవ్యాలుండవు.. మత ఘర్షణలు ఉండవని కేసీఆర్‌ నిరూపించారు. అరాచక శక్తులపై ఉక్కుపాదం మోపడంలో తెలంగాణ ప్రభుత్వం రాజీలేని వైఖరిని అవలంబిస్తోంది.


* మహాభారతంలోని అనుశాసనిక పర్వంలో చెప్పినట్లు ‘ప్రజల పనియే పాలకుని పని.. ప్రజల సుఖమే పాలకుని సుఖం. ప్రజల ప్రియమే పాలకుని ప్రియం.. ప్రజల హితమే పాలకుని హితం’

- బడ్జెట్‌ ప్రసంగంలో మంత్రి హరీశ్‌రావు


అద్భుత బడ్జెట్‌
-  కేంద్రానికి ఇది కనువిప్పు: కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర బడ్జెట్‌ అద్భుతంగా ఉందని, అన్ని వర్గాల ఆశలకు ప్రతిరూపమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. ప్రజల సంపూర్ణ అభ్యున్నతికి దోహదం చేస్తుందని, వారి ఆకాంక్షలను నెరవేరుస్తామన్నారు. మరోసారి తెలంగాణ బడ్జెట్‌ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. పాలనలో అన్నింటా విఫలమవుతూ, ప్రజాప్రయోజనాలను పూర్తిగా విస్మరించిన కేంద్ర ప్రభుత్వానికి ఇది కనువిప్పు కలిగిస్తుందన్నారు. తెలంగాణను చూసి నేర్చుకోవాలనే హితబోధ చేస్తుందన్నారు. సోమవారం బడ్జెట్‌ ప్రసంగాలు ముగిసిన తర్వాత మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి సీఎంను ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని అభినందించారు. బడ్జెట్‌పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందన్నారు. అనంతరం ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎంను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. బడ్జెట్‌పై విమర్శలకు తావు లేదని, ప్రతి ఒక్కరూ మెచ్చుకోవాల్సిందేనని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని