Telangana Budget 2022: ‘సాగు’తోంది ఉరవడి!

సాగునీటి రంగానికి బడ్జెట్‌లో ప్రభుత్వం మరోసారి పెద్దపీట వేసింది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల వేగం పెంచడం, ఇప్పటికే ఆయకట్టుకు నీళ్లివ్వడం ప్రారంభించిన వాటిని పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.22,675 కోట్లు ఇవ్వనున్నట్లు

Updated : 08 Mar 2022 05:37 IST

2021-22లో ఇచ్చింది రూ.16,919 కోట్లు

ఇప్పటికే ఖర్చుచేసింది రూ. 21,000 కోట్లు

2022-23 కేటాయింపులు రూ.22,675 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: సాగునీటి రంగానికి బడ్జెట్‌లో ప్రభుత్వం మరోసారి పెద్దపీట వేసింది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల వేగం పెంచడం, ఇప్పటికే ఆయకట్టుకు నీళ్లివ్వడం ప్రారంభించిన వాటిని పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.22,675 కోట్లు ఇవ్వనున్నట్లు చెప్పింది. 2021-22లో రూ.16,919 కోట్లు కేటాయించి ఇప్పటికే రూ.21వేల కోట్లు ఖర్చుచేసిన సర్కారు, వచ్చే ఏడాది బడ్జెట్‌ పెంచింది. రాష్ట్ర పద్దు నుంచి రూ.9,959 కోట్లు కాగా, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణంగా 12,716 కోట్లు సమకూర్చనుంది.

* కేటాయింపుల్లో 50 శాతానికి పైగా నిధులను కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కిందనే ఖర్చుచేయనుంది. దీని తర్వాత పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతలకు ప్రాధాన్యమిచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు వెచ్చించిన రూ.21వేల కోట్లలో కాళేశ్వరం వాటా రూ.10,500 కోట్లు. ఇందులో రూ.8,500 కోట్లు బ్యాంకులు, ఆర్థిక సంస్థల ద్వారా తీసుకొన్న రుణం. మరోవైపు కాళేశ్వరం ఎత్తిపోతల కార్పొరేషన్‌కు రూ.12,240 కోట్ల రుణాన్ని ఇంజినీర్లు ప్రతిపాదించగా సర్కారు కొంత తగ్గించినట్లు తెలిసింది.

* పాలమూరు-రంగారెడ్డి పథకానికి వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.రెండువేల కోట్లు కేటాయించగా, ఇందులో రూ.600 కోట్లు రుణం. ఇది కూడా కాళేశ్వరం కార్పొరేషన్‌ ద్వారానే. సీతారామ ఎత్తిపోతల, దేవాదుల, కంతనపల్లి, శ్రీరామసాగర్‌ వరద కాలువ ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన రుణం కోసం ఏర్పాటైన కార్పొరేషన్‌ ద్వారా రూ.2,489 కోట్లు తీసుకోనుంది. అత్యధికంగా సీతారామ ఎత్తిపోతలకు రూ.940 కోట్లు కేటాయించగా దేవాదులకు ఇచ్చింది రూ.350 కోట్లు. ఈ నాలుగు ప్రాజెక్టులను వచ్చే ఏడాదిలోగా పూర్తి చేయడానికి వీలుగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.7,737 కోట్లు రుణం తీసుకోవడానికి ఇంజినీర్లు ప్రతిపాదించగా ప్రభుత్వం దాన్ని కొంత తగ్గించినట్లు సమాచారం. 

* చిన్ననీటి వనరులకు కూడా అధిక ప్రాధాన్యమిచ్చి రూ.1,245 కోట్లు, మధ్యతరహా ప్రాజెక్టులకు రూ.283 కోట్లు కేటాయించింది. ఇందులో కోయిల్‌సాగర్‌, మూసీ, లంకసాగర్‌, పెద్దవాగు జగన్నాథపూర్‌, మోదికుంటవాగు, సుద్దవాగు, గొల్లవాగు, కుమురం భీం ప్రాజెక్టులకు కేటాయింపులు ఎక్కువగా ఉన్నాయి.

* కృష్ణా నదీ యాజమాన్యబోర్డుకు రూ.11.16 కోట్లు, గోదావరి బోర్డుకు రూ.8.75 కోట్లు కేటాయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని