Telangana Budget 2022: ప్రభుత్వం.. దళిత బంధుత్వం!

దళితబంధు పథకం అమలుకు ప్రభుత్వం బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు చేసింది. ఏకంగా రూ.17,700 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో హుజూరాబాద్‌ మినహా ఇతర నియోజకవర్గాల్లో ఒక్కోచోట 1500 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 1.77 లక్షల దళిత కుటుంబాలకు లబ్ధి జరగనుంది.

Updated : 08 Mar 2022 05:23 IST

 బడ్జెట్‌లో దళితబంధుకు భారీగా నిధులు

1.77 లక్షల కుటుంబాలకు పథకం అమలు

నియోజకవర్గానికి 1,500 మంది చొప్పున అవకాశం

ఈనాడు - హైదరాబాద్‌

దళితబంధు పథకం అమలుకు ప్రభుత్వం బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు చేసింది. ఏకంగా రూ.17,700 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో హుజూరాబాద్‌ మినహా ఇతర నియోజకవర్గాల్లో ఒక్కోచోట 1500 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 1.77 లక్షల దళిత కుటుంబాలకు లబ్ధి జరగనుంది. పథకం కింద.. ఎలాంటి పూచీకత్తు అవసరం లేకుండా,  ఇష్టమైన పని ఎంపిక చేసుకుని ఉపాధి పొందేందుకు ప్రభుత్వం గ్రాంటు రూపంలో రూ.10 లక్షలు ఇస్తోంది. వచ్చే ఏడాదికి 2 లక్షల మందికి లబ్ధిచేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించింది. హుజూరాబాద్‌ నియోజకవర్గం, వాసాలమర్రి గ్రామం, నాలుగు ప్రయోగాత్మక మండలాలు, రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గానికి వంద మంది చొప్పున ఇప్పటికే దాదాపు 35 వేల దళిత కుటుంబాలు ఎంపికయ్యాయి. హుజూరాబాద్‌, వాసాలమర్రి లబ్ధిదారులకు యూనిట్లు మంజూరవుతున్నాయి. తాజా బడ్జెట్‌లో మరో 1.77 లక్షల కుటుంబాలకు పథకం అమలయ్యేలా నిధులు కేటాయించారు. ఇప్పటివరకు లబ్ధిపొందని కుటుంబాలకు ముందు ప్రాధాన్యమివ్వాలని పథకం ప్రకటించిన సమయంలో భావించినప్పటికీ, ఎలాంటి పరిమితులు లేకుండా దళిత కుటుంబాలందరికీ అవకాశమివ్వాలని నిర్ణయించారు.

సంక్షేమ శాఖలకు రెట్టింపు

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు 2022-23 బడ్జెట్‌లో ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. ఈ శాఖల బడ్జెట్‌ గత ఏడాదితో పోల్చితే దాదాపు రెట్టింపైంది. ఇందులో సింహభాగం రూ.17,700 కోట్లను దళిత బంధు పథకానికి ఇచ్చింది. ఎస్సీ సంక్షేమానికి భారీగా పెంచగా, మిగతా సంక్షేమశాఖల బడ్జెట్‌ కేటాయింపుల్లో పెద్దగా మార్పుల్లేవు. గురుకులాలకు కేటాయింపులు పెద్దగా పెరగలేదు.

* 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు కలిపి ప్రభుత్వం రూ.31,466.53 కోట్లు కేటాయించింది.

* కార్మిక, ఉపాధి కల్పన శాఖకు బడ్జెట్‌లో రూ.511.36 కోట్లు కేటాయించింది. ఐటీఐల ఉన్నతీకరణ, కొత్త ఐటీఐల అభివృద్ధికి స్వల్పంగా రూ.4.5 కోట్లు ఇచ్చింది. నైపుణ్య శిక్షణ కోసం రూ.2.6 కోట్లు ప్రకటించింది.

గురుకులాలకు..

బడ్జెట్‌లో ఎస్సీ గురుకులాలకు రూ.1063.79 కోట్లు, గిరిజన గురుకులాలకు రూ.492.74 కోట్లు కేటాయించింది. సంక్షేమ శాఖల్లో అత్యధికంగా 281 గురుకుల విద్యాలయాలున్న బీసీ సొసైటీకి నిధులు స్వల్పంగా పెంచి రూ.330 కోట్లు కేటాయించింది. మైనార్టీ సొసైటీలో 204 గురుకుల పాఠశాలలు జూనియర్‌ కళాశాలలుగా మారాయి. అయినా, ఈ సొసైటీకి గత ఏడాదితో సమానంగా రూ.222.92 కోట్లు కేటాయించింది.

బోధనానికి 2,539.33 కోట్లు

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులకు బోధన ఫీజులు, ఉపకారవేతనాల కోసం ప్రభుత్వం రూ.2,539.33 కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద ఏటా 13.5 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. బీసీ సంక్షేమ శాఖ నుంచి డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో బడ్జెట్‌లో నిధులు పెంచారు.

* కల్యాణలక్ష్మికి గత ఏడాదితో సమానంగా ఈ సారి రూ.2,750 కోట్లు ఇచ్చింది.

* విదేశీవిద్య పథకం అమల్లో మైనార్టీ సంక్షేమశాఖకు ప్రాధాన్యం లభించింది. ఈ పథకం కింద మైనార్టీలకు రూ.100 కోట్లు, బీసీలకు రూ.66 కోట్లు, ఎస్సీలకు రూ.45 కోట్లు, ఎస్టీలకు రూ.10 కోట్లు కేటాయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని