Telangana Budget 2022: ఇది కేసీఆర్‌ మార్కు బడ్జెట్‌

‘ఇది బడుగుల జీవితాలు మార్చే.. కేసీఆర్‌ మార్కు బడ్జెట్‌’ అని ఆర్థికమంత్రి టి.హరీశ్‌రావు అభివర్ణించారు. సోమవారం శాసనసభలో ఆయన రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం 90 పేజీల ప్రసంగ పాఠాన్ని రెండు గంటల పాటు చదివారు

Updated : 08 Mar 2022 05:45 IST

 బడుగుల సంక్షేమమే మా లక్ష్యం

రాష్ట్రాల అధికారాలను కేంద్రం కబళిస్తోంది

సెస్‌ల పేరుతో దొడ్డిదోవన దండుకుంటోంది  

తెలంగాణకు ఒక్క పథకానికీ నిధులివ్వలేదు

బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థికమంత్రి హరీశ్‌రావు

ఈనాడు - హైదరాబాద్‌

‘ఇది బడుగుల జీవితాలు మార్చే.. కేసీఆర్‌ మార్కు బడ్జెట్‌’ అని ఆర్థికమంత్రి టి.హరీశ్‌రావు అభివర్ణించారు. సోమవారం శాసనసభలో ఆయన రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం 90 పేజీల ప్రసంగ పాఠాన్ని రెండు గంటల పాటు చదివారు. ఇందులో దాదాపు ఆరు పేజీల వరకు కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడానికే కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల గురించి హరీశ్‌ విపులంగా వివరించారు. తెలంగాణ అవతరించిన అనతికాలంలోనే దేశంలోకెల్లా అగ్రగామి రాష్ట్రంగా రూపుదాల్చిందంటూ ప్రసంగం మొదలుపెట్టిన ఆర్థికమంత్రి చివరగా మహాభారతంలోని ఒక వాక్యంతో ముగించారు. సీఎం కేసీఆర్‌కు తెలంగాణ అభ్యున్నతి గురించి తపనే తప్ప వేరే చింతన లేదని చెప్పారు. ప్రగతినిరోధక శక్తులు అవరోధాలను సృష్టిస్తున్నా వాటిని ఎదుర్కోగల సత్తా తెలంగాణ ప్రభుత్వానికి ఉందని, ప్రజల శ్రేయస్సు కోసమే కృషి చేస్తామంటూ ప్రసంగాన్ని ముగించారు. ఆయన ప్రసంగంలో ముఖ్యాంశాలు..

రాష్ట్రాల ఆదాయానికి గండి 

కేంద్ర పన్నుల నుంచి న్యాయబద్ధంగా 41% రాష్ట్రాలకు రావాలి. కానీ సెస్‌ల పేరుతో దాన్ని కుదిస్తోంది. రాష్ట్రాలకు రావాల్సిన ఆదాయంలో 11.4% మేర నిధులకు గండికొడుతోంది. ఆర్థిక సంఘం సిఫారసులను కేంద్రం ఆమోదించలేదు. నీతి ఆయోగ్‌ సిఫారసు చేసిన నిధులనూ ఇవ్వలేదు. వాటి కోసం ప్రయత్నిస్తాం. ఆ నిధులనూ బడ్జెట్‌లో పేర్కొన్నాం. ఈసారి 35 కొత్త కార్యక్రమాలకు నిధులను కేటాయించాం.

బడ్జెట్‌ అంటే అంకెలే కాదు

‘‘బడ్జెట్‌ అంటే అంకెల సముదాయం కాదు. ప్రజల ఆశలు, ఆకాంక్షల వ్యక్తీకరణ. కేంద్ర ప్రభుత్వం ‘కాళ్లలో కట్టె పెట్టినట్టు’ వివక్ష చూపుతోంది. ప్రగతిశీల రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహం లేకపోగా నిరుత్సాహం కలిగించేలా వ్యవహరిస్తోంది. తెలంగాణ పురుటిదశలో ఉన్నప్పటి నుంచే దాడి ప్రారంభమైంది. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు కట్టబెట్టింది. దీంతో దిగువ సీలేరు విద్యుత్‌ ప్రాజెక్టును తెలంగాణ కోల్పోయింది. ఐదేళ్ల పాటు హైకోర్టును విభజించకుండా తాత్సారం చేసింది. విభజన హామీలను ఇప్పటికీ అమలు చేయడం లేదు. ఇవి చాలవన్నట్టు పార్లమెంటులో తెలంగాణ ఆవిర్భావం గురించి చర్చ జరిగిన ప్రతిసారి ‘తల్లిని చంపి బిడ్డను బతికించారు’ అని వ్యాఖ్యానిస్తూ కేంద్ర పెద్దలు రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. రాష్ట్రంలో ఐటీఐఆర్‌ను అమలు చేయకుండా కేంద్రం తీరని అన్యాయం చేసింది. కొత్త రాష్ట్రానికి అదనపు నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధానమంత్రికి విన్నవించారు. కాని చెప్పుకోదగ్గ ప్రోత్సాహకాలేవీ ఇవ్వలేదు.

రూ. 495 కోట్లు ఏపీ ఖాతాలో వేసింది

కేంద్ర ప్రాయోజిత పథకాల కింద తెలంగాణకు విడుదల చేయాల్సిన రూ. 495 కోట్లను పొరపాటుగా ఏపీ ఖాతాలో వేసింది. ఏడేళ్ల నుంచి అడుగుతున్నా తిరిగి ఇవ్వలేదు. జహీరాబాద్‌లోని నిమ్జ్‌కు రూ. 500 కోట్ల కేంద్ర వాటానూ ఇవ్వలేదు. తెలంగాణకు ప్రత్యేక గ్రాంటుగా రూ.723 కోట్లు ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం చెప్పినా ఇవ్వలేదు. మొత్తం అన్ని రకాల గ్రాంట్లు కలిపి రూ. 5,386 కోట్లు తొక్కిపెట్టింది. కరోనా సమయంలోనూ రాష్ట్రాలకు ఒక్క రూపాయి అదనంగా ఇవ్వలేదు. పైగా న్యాయంగా దక్కాల్సిన నిధులలోనూ కోతలు పెట్టింది.

విద్యుత్‌ సంస్కరణలకు ఒప్పుకోం

విద్యుత్‌ సంస్కరణలకు లంకె పెట్టి రాష్ట్రాల మెడ మీద కత్తిపెట్టింది. రైతు వ్యతిరేకమైన ఆ సంస్కరణలు అమలు చేయకపోవడం వల్ల ఐదేళ్లలో రూ.25,000 కోట్లు సమకూర్చుకునే అవకాశాన్ని తెలంగాణ కోల్పోయింది. రైతుల మీద ఛార్జీల భారం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. కంఠంలో ప్రాణముండగా విద్యుత్‌ సంస్కరణలకు ఒప్పుకోమని సీఎం కేసీఆర్‌ తెగేసి చెప్పారు. 4 కోట్లమంది ప్రజల శ్రేయస్సు కోసం రూ. 25,000 కోట్లు వదులుకోడానికి సిద్ధపడ్డారు. రాష్ట్రంలోని ఒక్క ప్రాజెక్టుకూ కేంద్రం జాతీయ హోదా ఇవ్వలేదు. ఒక్క పథకానికీ డబ్బులివ్వలేదు. రుణం తెచ్చుకునైనా అభివృద్ధి చేసుకుందామనుకుంటే దానికీ మోకాలడ్డుతోంది’’ అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.

మండలిలో...

శాసనమండలిలో సోమవారం బడ్జెట్‌ను రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రవేశపెట్టారు. ఉదయం 11.35 గంటలకు ప్రారంభమైన బడ్జెట్‌ ప్రసంగం దాదాపు రెండు గంటల పాటు కొనసాగింది. బడ్జెట్‌ ప్రసంగం అనంతరం మండలిని ప్రొటెం ఛైర్మన్‌ జాఫ్రీ గురువారానికి వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని