Telangana Budget: సంక్షేమమే మంత్రం

తెలంగాణ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తూ భారీ బడ్జెట్‌కు రంగం సిద్ధం చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ. 2.30 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఈసారి రూ. 2.65 లక్షల కోట్ల నుంచి రూ. 2.70 లక్షల కోట్ల మేర బడ్జెట్‌ను ప్రతిపాదిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కరోనా పరిస్థితుల నుంచి బయటపడి రాష్ట్ర వృద్ధిరేటు బాగా పెరగడంతో గత ఏడాది కంటే రూ. 35,000 కోట్ల మేర బడ్జెట్‌ పరిమాణాన్ని పెంచనుంది. సొంత పన్నుల రాబడిలో వృద్ధిరేటును 20 శాతంగా అంచనా

Updated : 07 Mar 2022 05:10 IST

నేడేే రాష్ట్ర బడ్జెట్‌
రూ. 2.70 లక్షల కోట్ల పద్దు?
దళితబంధుకు రూ. 20,000 కోట్లు!
సొంత రాబడులపైనే ధీమా
వృద్ధిరేటు ఆలంబనగా ముందుకు
ఈనాడు - హైదరాబాద్‌

తెలంగాణ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తూ భారీ బడ్జెట్‌కు రంగం సిద్ధం చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ. 2.30 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఈసారి రూ. 2.65 లక్షల కోట్ల నుంచి రూ. 2.70 లక్షల కోట్ల మేర బడ్జెట్‌ను ప్రతిపాదిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కరోనా పరిస్థితుల నుంచి బయటపడి రాష్ట్ర వృద్ధిరేటు బాగా పెరగడంతో గత ఏడాది కంటే రూ. 35,000 కోట్ల మేర బడ్జెట్‌ పరిమాణాన్ని పెంచనుంది. సొంత పన్నుల రాబడిలో వృద్ధిరేటును 20 శాతంగా అంచనా వేస్తున్న సర్కారు పన్నేతర రాబడి, రుణాలపై ధీమాతో భారీ అంచనాలను రూపొందించింది. భారీగా ఉద్యోగాల భర్తీకి అవసరమైన కార్యాచరణను ప్రభుత్వం స్పష్టం చేయనుంది. వచ్చే ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్నందున ఇదే పూర్తిస్థాయి బడ్జెట్‌ కావడంతో ఎన్నికల బడ్జెట్‌గానే భావించి కసరత్తు చేసినట్లు సమాచారం.. సంక్షేమం, వ్యవసాయానికి పెద్దపీట దక్కనుంది. దళితబంధుకు రూ. 20,000 కోట్లు, రైతుబంధుకు రూ. 15,000 కోట్ల మేర కేటాయించనున్నట్లు తెలిసింది. ఆసరాకు గతం కంటే రూ. 3000 కోట్లు పెరిగినట్లు సమాచారం. పథకాల వ్యయం రూ. 1.5 లక్షల కోట్లను దాటనుండగా నిర్వహణ వ్యయం రూ. 1.10 లక్షల కోట్లు ఉండవచ్చని అంచనా.

ప్రాధాన్య పథకాలకు పెద్దపీట

రైతుబంధు, రుణమాఫీ, రైతు బీమా, విద్యుత్‌ సబ్సిడీ, ఆసరా పింఛన్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు పెరగనున్నాయి. హైదరాబాద్‌ అభివృద్ధికి, జలమండలికి నిధులను పెంచనున్నారు. పరిశ్రమలకు, ఆర్టీసీకి తోడ్పాటు కొనసాగనుంది. కొత్త ఉద్యోగాలపై ప్రభుత్వం పూర్తి స్పష్టత ఇవ్వనుంది. ఆసరాకు రూ. 14,000 కోట్ల మేర కేటాయింపులు దక్కనున్నాయి. విద్యుత్‌ సబ్సిడీలకు 11,000 కోట్లకు పైగా కేటాయించనుండగా రైతు రుణమాఫీ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలకు నిధులు పెరగనున్నాయి. వెనుకబడిన తరగతుల ఫెడరేషన్‌లకు ప్రత్యేక కేటాయింపులపై ప్రభుత్వం ఈసారి ప్రత్యేక దృష్టి సారించింది.

సొంత రాబడుల దన్ను

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సొంత పన్నుల రాబడి దాదాపు అంచనాల మేరకు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఆ అంచనాలను గణనీయంగా పెంచింది. ప్రస్తుతం రూ. 1.06 లక్షల కోట్లు ఉన్న పన్నుల రాబడి అంచనాలను వచ్చే ఏడాది 20 శాతం పెంచినట్లు సమాచారం. జీఎస్టీ, అమ్మకం పన్ను, రిజిస్ట్రేషన్ల రాబడి పైనా ప్రభుత్వం విశ్వాసంతో ఉంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) వృద్ధిరేటు ఈసారి 19.10 శాతంగా నమోదు కావడంతో ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో రుణాలను పెంచుకోనుంది. కేంద్ర పన్నుల వాటా, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ నిధులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంచనాల కంటే తగ్గాయి.. భూముల అమ్మకం ద్వారా రాబడిని లక్ష్యంగా చేసుకుని పన్నేతర రాబడి అంచనాలు ఈసారి కూడా రూ. 30,000 కోట్ల కంటే ఎక్కువగా ఉండనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని