CM KCR: ముందస్తుకు వెళ్లంగాక వెళ్లం

‘ఆరునూరైనా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదు. ప్రభుత్వం పూర్తికాలం కొనసాగుతుంది’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో 95 నుంచి 105 శాసనసభ స్థానాలు గెలుస్తాం. మూడు సంస్థలు 30 స్థానాల్లో సర్వే

Updated : 22 Mar 2022 04:17 IST

  ప్రశాంత్‌ కిశోర్‌ నాకు స్నేహితుడు

  ఓట్ల కోసమే ‘కశ్మీర్‌ ఫైల్స్‌’

  ఈడీ దాడులకు భయపడేది లేదు

  సీఎం కేసీఆర్‌ వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: ‘ఆరునూరైనా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదు. ప్రభుత్వం పూర్తికాలం కొనసాగుతుంది’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో 95 నుంచి 105 శాసనసభ స్థానాలు గెలుస్తాం. మూడు సంస్థలు 30 స్థానాల్లో సర్వే చేసి నివేదిక ఇచ్చాయి. 30 స్థానాలకు గాను 29 స్థానాల్లో తెరాస గెలుస్తుందని ఆ నివేదిక వెల్లడించింది. 0.3 శాతం తేడాతో ఒక స్థానం కోల్పోతున్నట్లు తేలింది. అంటే 119 స్థానాలకు గాను 4 స్థానాలే కోల్పోతామని తెలుస్తోంది. తొలిసారి 63 సీట్లు, రెండోసారి 88 సీట్లు, ఈసారి కచ్చితంగా 95-105 సీట్ల మధ్య గెలుస్తాం. అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల పరిస్థితిపై మరో 25 రోజుల్లో నివేదిక బహిర్గతం చేస్తాం. బజార్లో అరిచే వ్యక్తుల గురించి మాట్లాడను.  

డబ్బుల కోసం పీకే పనిచేయరు 

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ మాతో కలిసి పని చేస్తున్నారు.. అది రహస్యం కాదు. ఎనిమిదేళ్లుగా ఆయన నాకు మంచి స్నేహితుడు. ఎప్పుడూ డబ్బులు తీసుకుని పనులు చేయరు. దేశం పట్ల ఆయనకున్న నిబద్ధత నాకు తెలుసు. పార్టీల అవసరాల మేరకు 12 రాష్ట్రాల్లో పనిచేశారు. భాజపాతో కూడా కొంతకాలం ఉన్నారు. దేశ రాజకీయాలపై ఆయనకు మంచి అవగాహన ఉంది. జాతీయ రాజకీయాలు ప్రభావితం చేయడానికి నిర్ణయం తీసుకున్నందున నా ఆహ్వానం మేరకు వచ్చి పనిచేస్తున్నారు. దేశం, తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై ఆయన సర్వే చేస్తున్నారు.  

మరో 10,000 ఉపాధ్యాయ పోస్టులు..

కచ్చితంగా 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఏటా ఉద్యోగ క్యాలెండర్‌ విడుదల చేస్తాం. హేతుబద్ధీకరణ పేరిట పాఠశాలలు మూసేస్తారని అపోహలు సృష్టిస్తున్నారు. అదంతా తప్పు. ఆంగ్ల మాధ్యమం నేపథ్యంలో ప్రతి పాఠశాలలో ఆంగ్లం సహా అన్ని సబ్జెక్టులకు. ఉపాధ్యాయులుండాలి. మరో 10 వేల ఉపాధ్యాయుల పోస్టులు ఇచ్చి, నియామకాలు చేపడతాం. ఇవికాక తొమ్మిదో, పదో షెడ్యూల్డు సంస్థలలోనూ మరో 5,000 నుంచి 10,000 ఉద్యోగాలు వస్తాయి.

భాజపా లబ్ధి కోసమే ఫైల్స్‌

భాజపా ‘కశ్మీర్‌ ఫైల్స్‌’తో లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోంది. సమాజానికి చేటుచేసే ఇలాంటి సినిమాలను ఆహ్వానించకూడదు. దేశంలో.. నీటిపారుదల, ఆర్థిక, పారిశ్రామికీకరణ పురోభివృద్ధి మీద సినిమాలు రావాలి కానీ ఈ కశ్మీర్‌ ఫైల్స్‌ ఏంటో.. దిక్కుమాలిన వ్యవహారం. తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె అన్నాం కానీ.. హిందూ, ముస్లిం, క్రిస్టియన్‌, సిక్కుల సమ్మె అనలేదు. భాజపా పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులిచ్చి మరీ కశ్మీర్‌ ఫైల్స్‌ చూడమంటున్నారు. విద్వేష, విభజన రాజకీయాలతో జరిగే పరిణామాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే దిల్లీలోని కశ్మీరీ పండిట్లకు న్యాయం చేయాలి. తెలంగాణలోని బోధన్‌లో శివాజీ విగ్రహం పేరిట భాజపా రాజకీయం చేస్తోంది.

 భయపడితే ఉద్యమం చేయగలమా!

ఈడీ, ఐటీ పన్ను దాడులు చేస్తారని యూట్యూబ్‌లో ప్రచారం చేస్తున్నారు. ఈడీ కాకపోతే బోడీ దాడులు చేయమను. కేసీఆర్‌ ఈ బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలకు భయపడతాడా? ఇలా భయపడితే 15 ఏండ్లు తెలంగాణ ఉద్యమం చేద్దుమా? భయంకరంగా కుంభకోణాలు చేసేవాళ్లకు భయం ఉంటుంది. ఈ పిట్ట బెదిరింపులు నా వద్ద పనిచేయవు.

చినజీయర్‌తో విభేదాల్లేవు

చినజీయర్‌స్వామితో నాకు ఎలాంటి విభేదాలు లేవు. దూరం పెరిగిందని ఎవరన్నారు? ఇలాంటి అపోహలు సృష్టించేందుకు ప్రయత్నించవద్దు’’ అని కేసీఆర్‌ అన్నారు.

జాతీయ రాజకీయాల్లో శూన్యత..

కేసీఆర్‌ అవసరం ఎక్కడుంటే అక్కడికి వెళ్లి పనిచేస్తాను. ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో చాలా శూన్యత ఉంది. దేశంలో కొత్త జాతీయ పార్టీ వచ్చే అవకాశం ఉంది. భాజపా నాయకులు బుల్‌డోజర్లు తెస్తున్నామంటున్నారు. వారు ఇక్కడ కూలీ పనులు చేసుకుంటారు. ఆప్‌ అధ్యక్షుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలంగాణ లో పాదయాత్ర చేస్తామంటే స్వాగతిస్తాం. ఇప్పటికే చాలామంది పాదయాత్ర చేస్తున్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని