Huzurabad By Election: ఈటలకే జీ హుజూర్‌

ఉత్కంఠభరితంగా సాగిన హుజూరాబాద్‌ ఉపఎన్నికలో మాజీ మంత్రి, భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ విజయకేతనం ఎగురవేశారు. రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా... తెరాస, భాజపాల మధ్య నువ్వానేనా అన్నట్లు జరిగిన హోరాహోరీ పోరులో ఈటల ఘన విజయం సాధించారు.

Updated : 03 Nov 2021 04:32 IST

హోరాహోరీ పోరులో తెరాసపై భాజపా విజయకేతనం
హుజూరాబాద్‌లో 23,855 ఓట్ల ఆధిక్యంతో రాజేందర్‌ గెలుపు
 ధరావతు గల్లంతైన కాంగ్రెస్‌

మంగళవారం రాత్రి ఫలితం వెలువడిన అనంతరం కరీంనగర్‌లో నిర్వహించిన విజయోత్సవంలో కార్యకర్తలకు అభివాదం చేస్తున్న ఈటల రాజేందర్‌, బండి సంజయ్‌

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌: ఉత్కంఠభరితంగా సాగిన హుజూరాబాద్‌ ఉపఎన్నికలో మాజీ మంత్రి, భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ విజయకేతనం ఎగురవేశారు. రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా... తెరాస, భాజపాల మధ్య నువ్వానేనా అన్నట్లు జరిగిన హోరాహోరీ పోరులో ఈటల ఘన విజయం సాధించారు. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌పై  23,855 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. నాలుగు నెలలుగా సాగిన ఈ పోరుపై రాజకీయ వర్గాలతోపాటు సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మొదటినుంచీ ఈటలదే ఆధిపత్యం
మంగళవారం ఉదయం ఓట్ల లెక్కింపు ఆరంభమైనప్పటి నుంచి ఈటల ఆధిపత్యం ప్రదర్శించారు. రెండు రౌండ్లు (8, 11) మినహా అన్నింటిలో భాజపా ఆధిక్యాన్ని కొనసాగించింది. తెరాస అభ్యర్థి సొంత గ్రామంలో కూడా భాజపా ఎక్కువ ఓట్లను దక్కించుకుంది. కాంగ్రెస్‌ డిపాజిట్‌ కోల్పోవడమే కాకుండా కేవలం 3,014 ఓట్లకే పరిమితమైంది. ఈటల రాజీనామాతో వచ్చిన హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో విజయానికి తెరాస తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ రాజేందర్‌ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. హుజూరాబాద్‌, జమ్మికుంట పురపాలక సంఘాల్లోనూ పట్టును నిరూపించుకొన్నారు. సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా, మంత్రిగా నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు, గ్రామాలవారీగా ఉన్న వ్యక్తిగత సంబంధాలు ఈ ప్రతిష్ఠాత్మక పోరులో ఆయనకు విజయాన్ని చేకూర్చి పెట్టాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2004 నుంచి నియోజకవర్గం నుంచి వరుసగా గెలుస్తూ వచ్చిన ఈటలకు ఇది ఏడో విజయం. గతంలో రెండుసార్లు రాజీనామా చేసి గెలుపొందగా, ఇప్పుడు మూడోసారి రాజీనామా చేసి విజయం సాధించారు. ఆరుసార్లు కారు గుర్తుపై గెలిచిన రాజేందర్‌ ఈ ఉపఎన్నికలో కమలం గుర్తుపై పోటీచేసి గెలుపొందారు. 

విజయచిహ్నం చూపుతున్న ఈటల దంపతులు, భాజపా నేతలు ధర్మారావు, వివేక్‌

తెరాస ఆవిర్భవించిన కొంతకాలానికే ఆ పార్టీలో చేరిన ఈటల అప్పటి నుంచి కీలకనేతగా పని చేశారు. తెరాస శాసనసభ పక్ష నేతగా, తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వంలో ఆర్థిక, పౌరసరఫరాలు, ఆరోగ్య శాఖల మంత్రిగా పని చేశారు. ఈ ఏడాది ఆరంభంలో ఎసైన్డ్‌ భూములు ఆక్రమించుకొన్నారని ఆయనపై విచారణకు ఆదేశించడంతోపాటు మంత్రివర్గం నుంచి తొలగించారు. దీంతో శాసనసభ స్థానానికి రాజీనామా చేసి భాజపాలో చేరి ఉప ఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. రాజీనామా చేసిన తర్వాత నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించారు. సుదీర్ఘకాలం నియోజకవర్గంలో ఉన్న సంబంధాలను పటిష్ఠం చేసుకొనే ప్రయత్నం చేశారు.

తెరాస, భాజపాతో చెదిరిన కాంగ్రెస్‌
ఈ ఎన్నికల్లో అభ్యర్థి ఖరారు నుంచి ప్రచారం వరకూ కాంగ్రెస్‌ పార్టీ బాగా వెనుకబడింది. దీన్ని తెరాస, భాజపాలు అవకాశంగా మలచుకుని పలువురు కాంగ్రెస్‌ నేతల్ని చేర్చుకున్నాయి. కాంగ్రెస్‌ స్థానిక నేతల్లో కీలకమైనవారు చాలామంది తెరాసలోనో, భాజపాలోనో చేరిపోవడంతో కాంగ్రెస్‌కు నియోజవర్గం నుంచి అభ్యర్థిని ఎంపిక చేసుకోవడం సమస్యగా మారింది. నాయకులతో పాటు కాంగ్రెస్‌ ఓట్లపైనా రెండు పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలోనే 2018 ఎన్నికల్లో 69,737 ఓట్లను పొందిన కాంగ్రెస్‌ పార్టీ ఈ సారి కేవలం 3014 ఓట్లకే పరిమితమైంది.

సుదీర్ఘ ప్రచారం...అలుపెరుగని నేతలు
జూన్‌ 12న శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఈటల రెండు రోజుల అనంతరం 14న భాజపాలో చేరారు. అప్పటినుంచి హుజూరాబాద్‌లో ఎన్నికల సందడి మొదలైంది. నోటిఫికేషన్‌తో సంబంధం లేకుండా అధికార తెరాస, భాజపాలు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. సుదీర్ఘకాలం  ప్రచారం జరిగిన ఎన్నికగా రికార్డు సృష్టించింది. నేతలు అలుపెరగకుండా ప్రచారం చేశారు. ఆగస్టు 11న తెరాస అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను పార్టీ ప్రకటించింది. అంతకుముందు నుంచే తెరాస, భాజపాలు ప్రచారాన్ని చేపట్టాయి. అభ్యర్థుల ఖరారు అనంతరం ప్రచారం తారస్థాయికి చేరుకుంది. కాగా హుజూరాబాద్‌ ఎన్నిక సందర్భంగా ‘దళితబంధు’ పథకం చర్చనీయాంశమైంది. ఫిర్యాదులు వెల్లువెత్తడంతో దీనిని నిలుపుదల చేయాలని  ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. పెద్ద ఎత్తున ఓటర్లకు డబ్బుల పంపిణీతో పాటు అధికార దుర్వినియోగం జరుగుతోందని కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసింది.

కరీంనగర్‌ ఎస్సారార్‌ కళాశాలలో ఓట్లను లెక్కిస్తున్న ఎన్నికల సిబ్బంది

పోస్టల్‌ ఓట్లతో తెరాసదే పైచేయి
హుజూరాబాద్‌ ఎన్నికల్లో పోస్టల్‌ ఓట్లలో తెరాస ఎక్కువ దక్కించుకుంది. తెరాసకు 455 ఓట్లు రాగా, భాజపాకు 242 ఓట్లు, కాంగ్రెస్‌కు రెండు ఓట్లు వచ్చాయి.

రాత్రి 7 గంటల వరకు లెక్కింపు
కరీంనగర్‌లోని ఎస్సారార్‌ డిగ్రీ కళాశాలలో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన లెక్కింపు రాత్రి 7 గంటల వరకు కొనసాగింది. మొత్తం 14 టేబుళ్లపై ఈ ప్రక్రియను 22 రౌండ్లుగా చేపట్టారు. 306 పోలింగ్‌ బూత్‌లలో ఉన్న ఓట్లను లెక్కించేందుకు ప్రతి రౌండ్‌కు అరగంట నుంచి ముప్పావుగంట సమయం పట్టింది. 30 మంది అభ్యర్థులుండటం వల్ల ప్రతి పోలింగ్‌ కేంద్రంలో రెండేసి ఈవీఎంలలో ఉన్న అభ్యర్థుల ఓట్లను లెక్కించాల్సి వచ్చింది. దీంతో అనుకున్న సమయానికన్నా ఆలస్యంగా ఫలితాలు బయటకు వచ్చాయి.
* కౌంటింగ్‌ కేంద్రానికి ఉదయం కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ వచ్చి ఓట్ల సరళిని చూసి వెళ్లిపోయారు. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ ఇక్కడికి రాలేదు. భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఫలితం వెలువడిన తర్వాత లెక్కింపు కేంద్రానికి వచ్చి ఎన్నికల అధికారి నుంచి ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు.  


27 మందికి 11,726 ఓట్లు
నోటాకు 1036 ఓట్లు

ఈనాడు, హైదరాబాద్‌: భాజపా, తెరాస, కాంగ్రెస్‌ అభ్యర్థులు కాకుండా మిగిలిన 27 మందికి 11,726 ఓట్లు పోలయ్యాయి. లెక్కించిన 2,05,965 ఓట్లలో భాజపా, తెరాస, కాంగ్రెస్‌లకు 1,93,203 ఓట్లు రాగా నోటాకు 1036 ఓట్లు పోలయ్యాయి. ప్రజా ఏక్తా పార్టీ నుంచి పోటీ చేసిన సిలివేరు శ్రీకాంత్‌, స్వతంత్ర అభ్యర్థి సాయన్నలు పలు రౌండ్లలో కాంగ్రెస్‌ కన్నా ఎక్కువ ఓట్లు సాధించారు. మొదటి రౌండ్లో కాంగ్రెస్‌కు 119 ఓట్లు రాగా శ్రీకాంత్‌కు 122 వచ్చాయి. ఏడో రౌండ్లో కాంగ్రెస్‌కు 94 రాగా.. ఆయనకు 98 ఓట్లు లభించాయి. ఎనిమిదో రౌండ్లో కాంగ్రెస్‌కు 89 ఓట్లు పోలవగా సాయన్నకు 118, శ్రీకాంత్‌కు 92 ఓట్లు వచ్చాయి. 18వ రౌండ్లోనూ కాంగ్రెస్‌ కన్నా వారు ముందు నిలిచారు. 19, 20 రౌండ్లలో సాయన్న కాంగ్రెస్‌ కంటే ఎక్కువే సాధించారు. సాయన్న 1,942 ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచారు.



 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని