Covaxin: కొవాగ్జిన్‌కు ప్రపంచ గుర్తింపు

భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ అభివృద్ధి చేసిన కొవిడ్‌-19 టీకా ‘కొవాగ్జిన్‌’కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గుర్తింపు లభించింది. ఇటువంటి ఘనతను సొంతం చేసుకున్న తొలి భారతీయ కొవిడ్‌ టీకా ఇదే. దీంతో భారతీయులకు విదేశీ ప్రయాణాలు సులభతరం కానున్నాయి. డబ్ల్యూహెచ్‌వో లోని సాంకేతిక సలహా బృందం (టీఏజీ), ‘కొవాగ్జిన్‌’కు ఎమర్జెన్సీ యూజ్‌ లిస్టింగ్‌ (ఈయూఎల్‌) కోసం డబ్ల్యూహెచ్‌వోకు సిఫారసు చేసింది. దీనికి అనుగుణంగా అత్యవసర

Updated : 04 Nov 2021 11:55 IST

‘అత్యవసర గుర్తింపు’ ఇచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
వివిధ దేశాల్లో పంపిణీకి వీలు
విదేశీ ప్రయాణాలు ఇక  సులువు

ఈనాడు బిజినెస్‌ బ్యూరో, హైదరాబాద్‌: భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ అభివృద్ధి చేసిన కొవిడ్‌-19 టీకా ‘కొవాగ్జిన్‌’కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గుర్తింపు లభించింది. ఇటువంటి ఘనతను సొంతం చేసుకున్న తొలి భారతీయ కొవిడ్‌ టీకా ఇదే. దీంతో భారతీయులకు విదేశీ ప్రయాణాలు సులభతరం కానున్నాయి. డబ్ల్యూహెచ్‌వో లోని సాంకేతిక సలహా బృందం (టీఏజీ), ‘కొవాగ్జిన్‌’కు ఎమర్జెన్సీ యూజ్‌ లిస్టింగ్‌ (ఈయూఎల్‌) కోసం డబ్ల్యూహెచ్‌వోకు సిఫారసు చేసింది. దీనికి అనుగుణంగా అత్యవసర గుర్తింపు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ‘కొవాగ్జిన్‌కు అత్యవసర వినియోగ గుర్తింపు ఇస్తున్నాం’ అని బుధవారం సాయంత్రం డబ్ల్యూహెచ్‌వో ట్వీట్‌ చేసింది. ఈ టీకా రెండో డోసు తీసుకున్న 14 రోజుల తర్వాత 78 శాతం ప్రభావశీలత కనబరచినట్లు వివరించింది.దీన్ని నిల్వ చేయడం సులువు కాబట్టి మధ్య-అల్పాదాయ దేశాలకు అనువైనదని పేర్కొంది. డెల్టావేరియంట్‌ పైనా 65.2 శాతం ప్రభావశీలత కనబరచడం కొవాగ్జిన్‌ ప్రత్యేకత.

ఇవీ ప్రయోజనాలు

‘కొవాగ్జిన్‌’ టీకాకు డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి..
ఈ టీకా తీసుకున్న భారతీయులు ఇతర దేశాలకు వెళ్లినప్పుడు ఇకపై ‘క్వారంటైన్‌’లో ఉండాల్సిన పనిలేదు.  గుర్తింపు ఉన్న టీకా వేసుకోలేదనే కారణంతో కొన్ని దేశాలు ఇప్పటికీ మనదేశం నుంచి ప్రయాణికులను అనుమతించటం లేదు. అనుమతించినా ‘క్వారంటైన్‌’ చేస్తున్నాయి. ఇకపై ఇటువంటి సమస్యలు ఎదురుకాకపోవచ్చు.

ఈ టీకాను మనదేశం నుంచి పెద్దఎత్తున ఇతర దేశాలకు ఎగుమతి చేయవచ్చు. ఈ సంవత్సరాంతం నుంచి టీకాను పలు దేశాలకు అధికంగా ఎగుమతి చేయాలని కేంద్రం యోచిస్తోంది.

ఇతర దేశాలు ఈ టీకాను గుర్తించి తమ దేశాల్లో వినియోగించటానికి ముందుకు రావచ్చు.

అమెరికా, కెనడా, ఐరోపాలలోని ఔషధ నియంత్రణ సంస్థలైన యూఎస్‌ఎఫ్‌డీఏ, హెల్త్‌ కెనడా,  యూరోపియన్‌ మెడిసిన్స్‌ ఏజెన్సీ.. తదితర సంస్థల నుంచి ‘కొవాగ్జిన్‌’కు త్వరితంగా అనుమతి లభించవచ్చు.

యునిసెఫ్‌, పాహో (పాన్‌ అమెరికన్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌), గావి కొవాక్స్‌.. వంటి అంతర్జాతీయ సంస్థలు చేపట్టే టీకా పంపిణీ కార్యక్రమాలకు ‘కొవాగ్జిన్‌’ను అందించవచ్చు.

ఎవరేమన్నారు?

‘సమర్థ నాయకత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్టుదలకు, ప్రజల విశ్వాసానికి ఇది ప్రబల తార్కాణం. స్వశక్తి సంపన్న భారతావనికి ఇదే నిజమైన దీపావళి.’

-కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ  


‘కొవాగ్జిన్‌ టీకాకు ‘ఈయూఎల్‌’ లభించటం సంతోషదాయకం. కొవిడ్‌పై పోరాటానికి ఎన్ని ఆయుధాలు అందుబాటులోకి వస్తే, అంత మంచిది. రిస్కు అధికంగా ఉన్న దేశాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వడంపై దృష్టి సారించాలి.’

-డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనామ్‌


‘ఈ గుర్తింపు వల్ల ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌-19 టీకాల లభ్యత పెరిగే అవకాశం ఏర్పడింది.’ 

-డబ్ల్యూహెచ్‌వో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ మనంగేల సిమావ్‌ 


‘డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు వల్ల కొవాగ్జిన్‌ టీకాను ప్రపంచ వ్యాప్తంగా అందించగలుగుతాం. నాణ్యత, భద్రత, శాస్త్రీయ ప్రమాణాలపై మేం ఎన్నడూ రాజీపడబోం. అందువల్ల భారత్‌ బయోటెక్‌ ఉత్పత్తి చేసే ఎన్నో టీకాలకు డబ్ల్యూహెచ్‌ఓ నుంచి ‘ప్రీ-క్వాలిఫికేషన్‌’ లభించింది. కరోనా మహమ్మారి సృష్టించిన ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో ‘కొవాగ్జిన్‌’ టీకాను ఎన్నో దేశాల్లోని ప్రజలకు అందించేందుకు డబ్ల్యూహెచ్‌ఓ గుర్తింపు వీలు కల్పిస్తుంది.’

-భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్ల


‘భారత్‌ బయోటెక్‌ సిబ్బంది, భాగస్వాములు పడిన శ్రమ ఫలితమే ఈ ఘనత. టీకా రూపంలో మా సత్తా చాటుకోడానికి మాకు ఒక అవకాశం లభించింది. విజయవంతమైన ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యానికి కొవాగ్జిన్‌ టీకా ఒక మంచి ఉదాహరణ.’

- భారత్‌ బయోటెక్‌ జాయింట్‌ ఎండీ సుచిత్ర ఎల్ల


‘కొవాగ్జిన్‌’ టీకా వినియోగ గడువు 12 నెలలకు పెంపు

ఈనాడు, హైదరాబాద్‌: ‘కొవాగ్జిన్‌’ టీకాను ఉత్పత్తి చేసిన నాటి నుంచి 12 నెలల వరకు వినియోగించవచ్చని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ బుధవారం వెల్లడించింది. అదనంగా టీకా స్థిరత్వ సమాచారాన్ని (స్టెబిలిటీ డేటా)ను సెంట్రల్‌ డ్రగ్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎస్‌సీఓ)కు అందజేశామని, ఈ సమాచారం ఆధారంగా టీకా వినియోగ సమయాన్ని (షెల్ఫ్‌ లైఫ్‌) పొడిగించినట్లు భారత్‌ బయోటెక్‌ పేర్కొంది.  ప్రస్తుతం ‘కొవాగ్జిన్‌’ టీకాను ఉత్పత్తి చేసిన నాటి నుంచి 6 నెలల్లోగా వినియోగించాల్సి వస్తోంది. కొవాగ్జిన్‌ను ఇప్పటికే ఇరాన్‌, మారిషస్‌, మెక్సికో, నేపాల్‌, పరాగ్వే, ఫిలిప్పీన్స్‌, జింబాబ్వే, ఒమన్‌, శ్రీలంక, ఈస్టోనియా, గ్రీస్‌ దేశాలు గుర్తించాయి.


మీ సాంకేతికతను పంచుకోండి
డబ్ల్యూహెచ్‌వో సంప్రదింపులు

జెనీవా: తమ ‘టెక్నాలజీ యాక్సెస్‌ పూల్‌’లో చేరాలని కోరుతూ భారత్‌ బయోటెక్‌తో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సంప్రదింపులు జరుపుతోంది. ‘కొవాగ్జిన్‌’కు అత్యవసర వినియోగ అనుమతులు మంజూరుచేసిన క్రమంలో ఈ మేరకు కోరుతున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ‘‘కొవిడ్‌ టెక్నాలజీ యాక్సెస్‌ పూల్‌లో చేరాలని భారత్‌ బయోటెక్‌ను కోరుతున్నాం. తద్వారా వ్యాక్సిన్‌, చికిత్సలకు సంబంధించిన సాంకేతికతలను ఇతర దేశాలతో పంచుకుని, మహమ్మారిపై మరింత సమర్థంగా, విస్తృతంగా పోరాడేందుకు అవకాశం ఉంటుంది’’ అని డబ్ల్యూహెచ్‌వో ఔషధ-ఆరోగ్య ఉత్పత్తుల వినియోగ విభాగం అసిస్టెంట్‌-డైరెక్టర్‌ జనరల్‌ డా.మారియెంగ్లా సిమావో బుధవారం తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని