Updated : 10 Oct 2021 10:06 IST

Lakhimpur Kheri Violence: ఎట్టకేలకు ఆశిష్‌ మిశ్ర అరెస్ట్‌

లఖింపుర్‌ ఖేరి కేసులో సిట్‌ విచారణకు హాజరు

లఖింపుర్‌ ఖేరి, దిల్లీ, ఈనాడు-లఖ్‌నవూ: కేంద్ర సహాయమంత్రి అజయ్‌ మిశ్ర కుమారుడు ఆశిష్‌ మిశ్రను ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఎనిమిది మంది మృతికి కారణమైన లఖింపుర్‌ ఖేరి హింసాత్మక ఘటనలో విచారణ నిమిత్తం శనివారం ఉదయం ఆయన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఎదుట హాజరయ్యారు. లఖింపుర్‌లోని క్రైం బ్రాంచ్‌ కార్యాలయంలో విచారణ ప్రారంభమైంది. ఆ సమయంలో పరిసర ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇంటర్నెట్‌ సేవలను నిలిపేశారు. ఘటన అనంతరం కనిపించకుండా పోయిన ఆశిష్‌, మళ్లీ బయటకు రావడం ఇదే తొలిసారి! ఉదయం ప్రారంభమైన విచారణ సాయంత్రం వరకూ కొనసాగింది. నిందితుని సమాధానాలతో సంతృప్తి చెందని సిట్‌ అధికారులు... 11 గంటల విచారణ తరువాత ఆయన్ను అరెస్టు చేశారు. ఆదివారం న్యాయస్థానాలకు సెలవు కావడంతో, నిందితునికి వైద్య పరీక్షలు పూర్తిచేసి ప్రత్యేక న్యాయస్థానం మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచే అవకాశముందని చెబుతున్నారు. గత ఆదివారం ఘటన జరిగిన సమయంలో తాను ఎక్కడున్నదీ ఆశిష్‌ చెప్పలేకపోయారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. విచారణ నిమిత్తం ఆయన మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపాయి.

సీజేఐ విచారణ నేపథ్యంలో...
హింసాత్మక ఘటనలో నిందితుడిని ఇంతవరకూ ఎందుకు అరెస్టు చేయలేదని, దయచేసి విచారణకు రండి అని ఆయనకు నోటీసులు ఇవ్వడమేంటని శుక్రవారం ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మిగతా కేసుల్లోని నిందితులతోనూ ఇలాగే వ్యవహరిస్తారా అంటూ యూపీ పోలీసులను ఉద్దేశించి ప్రశ్నించారు. ఈ క్రమంలో సిట్‌ ఎదుట ఆశిష్‌ హాజరుకావడం గమనార్హం. విచారణ జరుగుతున్న సమయంలో నిందితుడి తండ్రి అజయ్‌ మిశ్ర తన స్థానిక కార్యాలయంలో న్యాయవాదులతో మంతనాలు సాగించారు. ఘటన జరిగిన సమయంలో తాను, తన కుమారుడు అక్కడ లేమని ఆయన చెబుతున్నా, రైతులు మాత్రం దీన్ని ఖండిస్తున్నారు. సహాయమంత్రి కుమారుడు, అనుచరులు గత ఆదివారం స్వయంగా వాహనాలను నడుపుతూ తమపైకి దూసుకొచ్చినట్టు చెబుతున్నారు.

కాంగ్రెస్‌ యువజన విభాగం నిరసన..
లఖింపుర్‌ ఘటనకు నిరసనగా దిల్లీలో కాంగ్రెస్‌ యువజన విభాగం కార్యకర్తలు నిరసనకు దిగారు. బారికేడ్లను తోసుకుంటూ ముందుకెళ్లడం ఉద్రిక్తతకు దారితీసింది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఆదివారం వారణాసిలో జరిగే ‘కిసాన్‌ న్యాయర్యాలీ’లో పాల్గొంటారు. అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆశిష్‌ను అరెస్టు చేయాలంటూ రెండు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ శనివారం విరమించారు.


వారికి అండగా ఉంటాం: అఖిలేశ్‌

యూపీలో శాంతిభద్రతలు క్షీణించాయని, లఖింపుర్‌ ఖేరి ఘటనతో రైతులతో పాటు రాజ్యాంగం కూడా భాజపా చక్రాల కింద నలిగిపోతోందని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ విమర్శించారు. బాధిత రైతు కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.


Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts