YS Viveka Murder Case: వారు నా కళ్లలాంటి వాళ్లు

‘వైఎస్‌ అవినాష్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి (భారతి చిన్నాన్న కుమారుడు) నా కళ్లలాంటివారు’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. వారు ముగ్గుర్ని తన వద్దకు పంపించారంటూ అప్పటి డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తమతో చెప్పారని వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత సీబీఐకి వెల్లడించారు.

Updated : 01 Mar 2022 06:17 IST

అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, సురేంద్రనాథ్‌రెడ్డిల గురించి  జగన్‌ అన్న మాటలివీ..
ఆ విషయం నాకు అప్పటి  డీజీపీ సవాంగే చెప్పారు
సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వివేకా కుమార్తె సునీత వెల్లడి

ఈనాడు,అమరావతి: ‘వైఎస్‌ అవినాష్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి (భారతి చిన్నాన్న కుమారుడు) నా కళ్లలాంటివారు’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. వారు ముగ్గుర్ని తన వద్దకు పంపించారంటూ అప్పటి డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తమతో చెప్పారని వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత సీబీఐకి వెల్లడించారు. ఆ విషయంపై ఇంకేమీ మాట్లాడకుండా ఆ సంభాషణను సవాంగ్‌ అంతటితో ఆపేశారని చెప్పారు. ఈ హత్య కేసులో అనుమానితుడైన ఉదయ్‌కుమార్‌రెడ్డి (తుమ్మలపల్లెలోని యురేనియం కర్మాగారంలో ఉద్యోగి)ని 2019 ఆగస్టు 26, 27, 29 తేదీల్లో పోలీసులు ప్రశ్నించటంతో అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, సురేంద్రనాథ్‌రెడ్డిలు ఆందోళన చెంది అదే నెల 31న విజయవాడ వెళ్లి ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారని సునీత వివరించారు. జగన్‌ వారి ముగ్గుర్ని డీజీపీ వద్దకు పంపించారని చెప్పారు. 2019 సెప్టెంబరు 6న మంగళగిరి పోలీసు ప్రధాన కార్యాలయంలో అప్పటి డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను తాను, తన భర్త కలిసినప్పుడు ఆయనే ఈ విషయం తమతో చెప్పారని వివరించారు. ‘సీఎం జగన్‌ తీవ్రంగా కలత చెందుతున్నారు. అవినాష్‌రెడ్డి, సురేంద్రనాథ్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిలను నా దగ్గరకు పంపించారు. సాక్షుల విచారణ విపరిణామాలకు దారితీస్తోంది. అందుకే ఈ కేసులో క్షేత్రస్థాయి దర్యాప్తును నిలిపేసి కేవలం సాంకేతిక విశ్లేషణ మాత్రమే చేపడతాం. హత్య కేసు దర్యాప్తు ఏకపక్షంగా జరుగుతున్నట్లు అనిపిస్తోంది. తెదేపా నాయకుడు బీటెక్‌ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిలను విచారించట్లేదు’ అని సవాంగ్‌ తమతో చెప్పారని ఆమె తెలిపారు. వివిధ సందర్భాల్లో సీబీఐ అధికారులకు సునీత ఇచ్చిన వాంగ్మూలాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. వాటిలో ప్రధానాంశాలివీ..

ఫోన్లు చేసి ఒత్తిడి.. విచారించకుండానే వెనక్కి..
2019 జూన్‌లో కడప ఎస్పీ అభిషేక్‌ మహంతి ఆధ్వర్యంలో సిట్‌ ఏర్పాటు చేశారు. నేను, నా భర్త తరచూ ఆయన్ను కలుస్తూ మాకు తెలిసిన వివరాలు, సమాచారం చెప్పేవాళ్లం. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలకు సన్నిహిత మిత్రుడైన ఉదయ్‌కుమార్‌రెడ్డి వివేకా హత్యకు గురైన రోజు (2019 మార్చి 15న) వేకువజామున 3.30 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఈ వ్యవహారంపైనే ఉదయ్‌ను పోలీసులు ప్రశ్నించారు. ఆ తర్వాతే అవినాష్‌రెడ్డి, సురేంద్రనాథ్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిలు ముఖ్యమంత్రిని, డీజీపీని కలిశారు. 2019 సెప్టెంబరులో ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి, డా.మధుసూదన్‌రెడ్డిలను విచారించేందుకు ఎస్పీ మహంతి పులివెందుల నుంచి కడప తీసుకెళ్లారు. వారు మార్గమధ్యలో ఉండగానే.. కొంతమంది వ్యక్తులు ఫోన్లు చేసి దర్యాప్తును ప్రభావితం చేయాలని చూశారు. దీంతో వారిని కడప తీసుకెళ్లకుండానే మధ్యలో (నందిమండలం) నుంచే పులివెందులకు పంపించేశారు.

నా కుమారుడి జీవితం కూడా చూసుకోవాలిగా.. అన్న ఏకే మహంతి
వివేకా హత్య కేసు డైరీని చాలా హడావుడిగా సిద్ధం చేశారు. దీనిపై ఎస్పీ అభిషేక్‌ మహంతిని అడిగితే అది సాధారణ విషయమేనన్నారు. ఆయన సెలవులో వెళ్తున్నారని కేసు సీఐడీకి అప్పగిస్తున్నారని ప్రచారం జరగటంతో నేను అప్పటి డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు ఫోన్‌ చేసి.. అది నిజమేనా? అని అడిగాను. అభిషేక్‌ మహంతిని కడప ఎస్పీ పోస్టు నుంచి రిలీవ్‌ చేయాలని ఆయన తండ్రి, మాజీ డీజీపీ ఏకే మహంతి కోరడంతో రిలీవ్‌ చేస్తున్నానని చెప్పారు. దీంతో నేను, నా భర్త హైదరాబాద్‌లో ఏకే మహంతిని కలిశాం. ఆయన మాతో మాట్లాడుతూ.. ‘కేసు దర్యాప్తు స్టాప్‌వాచ్‌ మాదిరిగా, రిమోట్‌ కంట్రోల్‌ మాదిరిగా జరగకూడదు. క్షేత్రస్థాయి దర్యాప్తు, సాంకేతిక విశ్లేషణ సమాంతరంగా జరగాలి. అలా చేయకపోతే దర్యాప్తు ముందుకు కదలదు. నా కుమారుడి వ్యక్తిగత జీవితాన్ని చూసుకోవాల్సిన బాధ్యత కూడా నాపై ఉంది’ అని అన్నారు.

జగన్‌ కెరీర్‌ దెబ్బతింటుందేమోనని ఆలోచించా..
మా నాన్న జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలనుకున్నారు. సీబీఐ విచారణ కోరుతూ నేను హైకోర్టులో పిటిషన్‌ వేస్తే జగన్‌ కెరీర్‌ దెబ్బతింటుందేమో, అతని రాజకీయానికి వ్యతిరేకంగా ఏమైనా పరిణామాలు జరిగితే ఈ సీబీఐ కేసూ అందుకు ఒక కారణమవుతుందేమోనని ఆలోచించాను. రాజకీయంగా అతనికి చిక్కుముళ్లు ఎదురవుతాయనుకున్నా. ఒకదశలో పిటిషన్‌ వేయొద్దని కూడా భావించా. కానీ నాన్నను చంపిన దోషుల్ని పట్టుకోవాలంటే నాకు వేరే దారి కనిపించలేదు.

ఫ్యామిలీ మీటింగ్‌ అంటే జగన్‌ టైం లేదన్నారు  
మా నాన్న హత్య విషయంపై చర్చించేందుకు కుటుంబసభ్యులతో భేటీ (ఫ్యామిలీ మీటింగ్‌) ఏర్పాటు చేయమని జగన్‌కు చెప్పాలని వైఎస్‌ విజయమ్మను కోరాను. విజయమ్మ జగన్‌కు ఫోన్‌ చేసి ఈ విషయం చెబితే ఆయన నవ్వారు. అలాంటి భేటీలకు ఒక్క గంట కూడా తాను సమయం కేటాయించలేనన్నారు. తర్వాత 2019 అక్టోబరు 6న తాడేపల్లిలోని జగన్‌ అధికారిక నివాసంలో భేటీ ఖరారైంది. నేను, నా తరఫున మా పెదనాన్న జార్జిరెడ్డి భార్య భారతీరెడ్డి, మా అమ్మ, నాన్న సోదరి విమల, సోదరులు సుధీకర్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డిలు వెళ్లాం. మేం లోపలికి వెళ్లేసరికి జగన్‌తోపాటు అప్పటి డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, సజ్జల రామకృష్ణారెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, వై.ఎస్‌.అనిల్‌రెడ్డి ఉన్నారు. సుబ్బారెడ్డి పని ఉందంటూ వెంటనే వెళ్లిపోయారు.
* నాన్న హత్యకు సంబంధించిన పరిణామాలన్నింటినీ ఈ భేటీలో జగన్‌తో చెప్పాను. అనుమానితుల పేర్ల జాబితాను జగన్‌, గౌతమ్‌ సవాంగ్‌, సజ్జల రామకృష్ణారెడ్డి సహా అక్కడున్న వారందరికీ అందించాను. అనుమానితుల జాబితాలో ఉదయ్‌కుమార్‌రెడ్డి పేరు చేర్చటంపై జగన్‌ సందేహం వ్యక్తం చేశారు. ఉదయ్‌కుమార్‌రెడ్డికి బదులు నా భర్త పేరు, ఎంవీ కృష్ణారెడ్డి పేరు అనుమానితుల జాబితాలో చేర్చాలని జగన్‌ సలహా ఇచ్చారు. ఆయనతో నేను వాదించాను. అవసరమైతే నా భర్తపై కూడా దర్యాప్తు చేయాలని, స్వతంత్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయించాలని చెప్పాను. సీబీఐకి ఈ కేసు దర్యాప్తు అప్పగిస్తే అవినాష్‌రెడ్డి భాజపాలోకి వెళ్లిపోతారని, అప్పుడు అతనికి ఏమీ కాదంటూ జగన్‌ చెప్పటం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఈ కేసు సీబీఐకి వెళితే తనకు (జగన్‌కి) 12వ కేసు అవుతుందని అన్నారు.

నాన్న మరణవార్త తెలిసీ జగన్‌ పులివెందులకు వెంటనే బయల్దేరలేదు
మా నాన్న మరణవార్త తెలియగానే హైదరాబాద్‌ నుంచి నేను, నా భర్త, మా అమ్మ,  కుటుంబసభ్యులంతా కారులో పులివెందులకు బయల్దేరాం. అంత్యక్రియలు ఎప్పుడనే చర్చ వచ్చినప్పుడు.. జగన్‌తో మాట్లాడాలని మా అమ్మ నాకు సూచించారు. తనతో మాట్లాడితే.. అంత్యక్రియల విషయంపై తాను నిర్ణయం తీసుకుంటానన్నాడు. నేను ఫోన్‌ చేసిన సమయానికి జగన్‌, భారతి ఇంకా హైదరాబాద్‌లోనే ఉన్నారు. మా నాన్న చనిపోయారని తెలిసి కూడా వారు పులివెందులకు ఎందుకు బయల్దేరలేదు? అన్న సందేహం కలిగింది.
ఏడాది పాటు కేసు ముందుకు సాగలేదు
* మా నాన్న హత్యకు గురైన తర్వాత ఏడాది పాటు కేసు ముందుకు కదల్లేదు. నిష్పక్షపాత దర్యాప్తు కొనసాగలేదు. దర్యాప్తు వేగవంతం చేయాలంటూ పోలీసు ఉన్నతాధికారులకు అనేక లేఖలు రాశాను. నా సందేహాలు, అనుమానితుల జాబితా కూడా అందించాను. అయినా ఫలితం లేదు. సీబీఐ దర్యాప్తు కోసం హైకోర్టును ఆశ్రయించాలని అప్పుడే నిర్ణయించుకున్నా.
* అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిల పాత్రపై నేను అనుమానం వ్యక్తం చేస్తుండటంతో.. జగన్‌ సతీమణి భారతికి నాకు మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
* నా తండ్రి హత్య ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకున్నారు. ఎన్నికల్లో సానుభూతి పొందారు. భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి మా నాన్న అనుచరుల్ని ఇప్పుడు ఇంట్లోకి కూడా రానివ్వట్లేదు.
*  వై.ఎస్‌.రాజారెడ్డి, వై.ఎస్‌.చిన్న కొండారెడ్డి కుటుంబాల మధ్య సత్సంబంధాలు లేవు. కానీ బయటకు మాత్రం అంతా బాగున్నట్లు ఉంటారు. ‘వై.ఎస్‌.భాస్కర్‌రెడ్డి, వై.ఎస్‌.మనోహర్‌రెడ్డి, వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలు 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో నా ఓటమికి ప్రయత్నించారు. వారిని వ్యతిరేకించేది నేనొక్కణ్నే కాబట్టి నన్ను ద్వేషిస్తున్నారు’ అని మా నాన్న హత్యకు రెండు, మూడు నెలల ముందు నా భర్తతో చెప్పారు.
కడప టికెట్‌ షర్మిలకు రావాలని భావించారు..
* 2019 ఎన్నికల్లో కడప లోక్‌సభ టికెట్‌ అవినాష్‌రెడ్డికి బదులుగా షర్మిలకు రావాలని మా నాన్న భావించారు. మీరే పోటీ చేయాలని మా నాన్న అనుచరులు అన్నా ఆయన అంగీకరించలేదు. తాను క్రియాశీల రాజకీయాల నుంచి విరమించుకున్నానని వారితో చెప్పారు. కడప టికెట్‌కు విజయమ్మ, షర్మిల పేర్లు ప్రతిపాదించారు.
* జగన్‌కు అవకాశం ఇవ్వటం కోసం రాజకీయాల్ని విడిచిపెట్టేద్దామని మా నాన్న రెండున్నర దశాబ్దాల కిందటే అనుకున్నారు. వివిధ కారణాలతో అది సాధ్యపడలేదు. దీంతో జగన్‌ మా నాన్నను అపార్థం చేసుకున్నారు. 2011లో పులివెందుల ఉప ఎన్నికల్లో విజయమ్మపై పోటీ చేసిన తర్వాత క్రియాశీలక రాజకీయాల నుంచి నాన్న విరమించుకున్నారు. 2017లో జగన్‌ కోరిక మేరకే వైకాపా తరఫున ఎమ్మెల్సీగా పోటీ చేశారు.
* అవినాష్‌ చిన్న పిల్లోడు. లోక్‌సభకు సరైన అభ్యర్థి కాడని మా నాన్న భావించి ఉండొచ్చు.
* రాజకీయాల వరకూ నా తండ్రికి భాస్కర్‌రెడ్డితో ఒత్తిడితో కూడిన సంబంధాలే  ఉండేవి.

శివశంకర్‌రెడ్డిపై అనుమానపడినప్పుడల్లా..నా భర్త పేరు తెచ్చేవారు
మా నాన్న హత్యలో దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డే కీలకమంటూ జగన్‌ వద్ద అనుమానాలు వ్యక్తం చేశాను. అలా అన్న ప్రతిసారీ ‘నీ భర్తను కూడా అనుమానితుడిగా భావించాలి’ అంటూ జగన్‌ నుంచి నాకు సమాధానం వచ్చేది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ఎందుకు కోరాల్సి వచ్చిందో వై.వి.సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిల ద్వారా జగన్‌కు అనేక సందర్భాల్లో తెలియజేశాను. 2019 డిసెంబరు 29న సజ్జలతో మాట్లాడాను. ‘ఈ కేసును రాష్ట్ర పోలీసుల దర్యాప్తు చేసి.. బీటెక్‌ రవి, ఆదినారాయణరెడ్డిల పాత్ర ఉందని తేలితే దాన్ని అందరూ రాజకీయ నిందగానే పరిగణిస్తారు. ఎవరూ నమ్మరు. దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి పాత్ర ఉందని తేలితే దర్యాప్తు సరిగ్గా జరగలేదని వైకాపా నాయకత్వమే ఆరోపిస్తుంది. నా భర్త పాత్ర ఉందని తేలితే వైకాపా హయాంలో సరిగ్గా దర్యాప్తు జరగలేదని నేను అనుకుంటా. అందుకే స్వతంత్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయించాలని కోరుతున్నా’ అని సజ్జలకు వివరించాను. శివశంకర్‌రెడ్డి దోషి అని తేలి, ఆయన అరెస్టయితే ఆ నిజాన్ని వైకాపా నాయకత్వం అంగీకరిస్తుందని హామీ ఇవ్వగలరా అని సజ్జలను అడిగితే ఇవ్వలేనన్నారు.


నా తండ్రి హత్య వెనుక అవినాష్‌ హస్తం
రాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్‌, పీఎంవోకి లేఖలు రాసిన వివేకా కుమార్తె సునీత

ఈనాడు-అమరావతి: ‘నా తండ్రి హత్య వెనుక కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి హస్తం ఉంది. ఆయన్ను విచారించాలి. ఆయనపై చర్యలు తీసుకోవాలి. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న కుట్రదారుల్ని బయటపెట్టాలి’’ అని పేర్కొంటూ.. మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి కుమార్తె ఎన్‌.సునీత రాష్ట్రపతికి, లోక్‌సభ స్పీకర్‌కి, ప్రధానమంత్రి కార్యాలయానికి, కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు లేఖలు రాశారు. ఈ హత్య ఘటనలో అవినాష్‌ ప్రమేయం ఎలా ఉందనే అంశాల్ని ఆ లేఖలో వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని