Yadadri: మహా సంప్రోక్షణకు సిద్ధమవుతున్న యాదాద్రి

పునర్నిర్మితమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ మహాకుంభ సంప్రోక్షణకు రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 21 నుంచి 28 వరకు వేడుకలు జరిపేందుకు అధికార యంత్రాగం సన్నాహాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా కొండపైన బాలాలయంలో పంచకుండాత్మక మహాయాగం చేపట్టనున్నారు

Updated : 18 Mar 2022 05:04 IST

 21న పంచకుండాత్మక యాగంతో ప్రారంభం

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: పునర్నిర్మితమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ మహాకుంభ సంప్రోక్షణకు రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 21 నుంచి 28 వరకు వేడుకలు జరిపేందుకు అధికార యంత్రాగం సన్నాహాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా కొండపైన బాలాలయంలో పంచకుండాత్మక మహాయాగం చేపట్టనున్నారు. యాదాద్రి ప్రధానాలయం, విమానం, ప్రతిష్ఠామూర్తులు, కలశాలు, శ్రీ సుదర్శన చక్రం సహా ఉపాలయాల సంప్రోక్షణకు తొలుత విశ్వశాంతి, జగత్‌కల్యాణార్థమై యాగం నిర్వహించడం సంప్రదాయం. ఆ మేరకు వచ్చే సోమవారం (ఈ నెల 21న) పాంచరాత్ర ఆగమ విధానంలో క్రతువు మొదలవుతుంది. ఇందుకు పండితులు, రుత్వికులు 150 మంది అవసరమని, అనుభవమున్న వారిని రెండు రోజుల్లో ఎంపిక చేయనున్నట్లు యజ్ఞ ఆచార్యులు కాండూరి వెంకటాచార్య చెప్పారు. మంగళవారం అగ్ని మధనంతో యాగం మొదలవుతుందని ఆలయ ప్రధాన పూజారి నల్లంథిగల్‌ లక్ష్మీనరసింహాచార్య చెప్పారు. యాగశాలలో తూర్పున చతురస్రాకార కుండం, దక్షిణాన ధనుస్సు ఆకారం, పడమర దిశలో వృత్తాకారం, ఉత్తరాన త్రికోణాకారం, ఈశాన్యంలో శ్రీమన్నారాయణుడితో పద్మ కుండం ఏర్పాటు చేస్తున్నారు.

రాజగోపురాలపై స్వర్ణకలశాలు
గోపురాలపై స్వర్ణకలశాల స్థాపన కొనసాగుతోంది. పంచతల రాజగోపురాలపై 9, మహారాజగోపురంపై 11 స్వర్ణ కలశాలు, అష్టభుజి మండప ప్రాకారాలపై గల 28 విమానాలపై రాగి కలశాలు స్థాపించారు. గర్భాలయ దివ్యవిమానంపై శ్రీ సుదర్శన చక్రం స్థాపనకు సన్నాహాలు జరుగుతున్నాయి.

27న సీఎం కేసీఆర్‌ రాక?
మహాకుంభ సంప్రోక్షణలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక రోజు ముందే ఈ నెల 27న రాత్రి యాదాద్రికి విచ్చేయనున్నట్లు సమాచారం. 28న మహాసంప్రోక్షణలో పాల్గొని, ప్రధానాలయంలోని స్వయంభువులను దర్శించుకోనున్నట్లు తెలుస్తోంది.

సన్నాహాల్లో అధికార యంత్రాంగం
మహాకుంభ సంప్రోక్షణ ఉత్సవాల నిర్వహణపై కలెక్టర్‌ పమేలా సత్పతి గురువారం కలెక్టరేట్‌లో డీసీపీ నారాయణరెడ్డి, ఆలయ ఈవో గీత, ఆర్డీవో భూపాల్‌రెడ్డి తదితరులతో సమీక్షించారు.  

ఏ రోజు ఏ క్రతువు?
* 21వ తేదీ ఉదయం (9 గంటల నుంచి): స్వస్తివచనంలో విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, పంచగవ్య ప్రాశనం, అఖండ జ్యోతి ప్రజ్వలన, వాస్తు పూజ, హోమం, పర్వగ్నకరణం.
 సాయంత్రం(6 గంటల నుంచి): మృత్స్యంగ్రహణం, అంకురార్పణ, యాగశాల ప్రవేశం, కుంభస్థాపన.
22 ఉదయం: శాంతిపాఠం, యాగశాలలో చతుస్థానాచార్చన, ద్వారతోరణ ధ్వజకుంభారాధనలు, అగ్నిమధనం, అగ్నిప్రతిష్ఠ, యజ్ఞ ప్రారంభం, విశేష హవనం, మూలమంత్ర హవనం, నిత్య లఘుపూర్ణాహుతి.
 సాయంత్రం: హోమం, శాంతి హోమం, నవకలశ స్నపనం, సామూహిక విష్ణుసహస్రనామ పారాయణం.
23 ఉదయం: మూలమంత్ర హవనం, షోడశ కలశాభిషేకం
 సాయంత్రం: పంచగవ్యాధివాసం
24 ఉదయం: పంచవింశతి కలశ స్నపనం
 సాయంత్రం: జలాధివాసం
25 ఉదయం: కలశాభిషేకం
సాయంత్రం: పంచామృతాధివాసం

26 ఉదయం: ఏకశతి కలశాభిషేకం
సాయంత్రం: ధాన్యాధివాసం

27 ఉదయం: అష్టోత్తర శతకలశాభిషేకం
సాయంత్రం: షోడశ కళాన్యాసహోమం, పంచశయ్యాధివాసం

28న: మహాకుంభ సంప్రోక్షణ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని