Yadadri: శోభాయమానంగా మహాక్రతువు

యాదాద్రి పుణ్యక్షేత్రంలో మహాకుంభ సంప్రోక్షణ పర్వాల్లో కీలకమైన ఘట్టాల్ని బుధవారం కొనసాగించారు. ప్రధాన ఆలయంలో మూలమంత్ర, మూర్తిమంత్ర హవనం, షోడష కలశాభిషేకం నిర్వహించారు. 108 మంది రుత్వికులతో సామూహిక విష్ణు సహస్ర నామ పారాయణం

Updated : 24 Mar 2022 05:24 IST

యాదాద్రిలో కొనసాగుతున్న పంచకుండాత్మక యాగం

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే - ఈనాడు, నల్గొండ: యాదాద్రి పుణ్యక్షేత్రంలో మహాకుంభ సంప్రోక్షణ పర్వాల్లో కీలకమైన ఘట్టాల్ని బుధవారం కొనసాగించారు. ప్రధాన ఆలయంలో మూలమంత్ర, మూర్తిమంత్ర హవనం, షోడష కలశాభిషేకం నిర్వహించారు. 108 మంది రుత్వికులతో సామూహిక విష్ణు సహస్ర నామ పారాయణం, మహామంత్ర హవనం జరిపారు. రాత్రి ప్రతిష్ఠామూర్తులకు పంచగవ్యాధివాసం కైంకర్యాన్ని చేపట్టారు. ధ్వజస్తంభం, బలిపీఠం, ఆళ్వారుల శిలారూపాలకు ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు.  ఒకవైపు ప్రధానాలయంలో జపం.. మరోవైపు బాలాలయంలో యాగాన్ని దర్శించుకొని భక్తులు పులకించిపోయారు. మహాకుంభ సంప్రోక్షణ నాటికి ఐదు కోట్ల మూల, మూర్తి మంత్ర జపం పూర్తిచేసి పంచనారసింహుల గర్భాలయ ద్వారాలను తెరిచి భక్తులకు మూలవరులను దర్శించుకునే అవకాశాన్ని కల్పించేందుకు పూజారులు సంసిద్ధమయ్యారు. బాలాలయంలోని యాగశాలలో ధ్వజ కుంభారాధన, చతుస్థానార్చనలు, మంత్ర హవనం పర్వాలతో పంచకుండాత్మక మహాయాగం కొనసాగినట్లు ఆలయ ప్రధాన పూజారి నల్లంథిగల్‌ లక్ష్మీనరసింహాచార్య తెలిపారు.

ప్రతిష్ఠామూర్తుల శోభాయాత్ర..
పంచకుండాత్మక మహాయాగం ముగిశాక, మహాకుంభ సంప్రోక్షణ పర్వం నిర్వహించే సోమవారం నాడు కొండపైన బాలాలయం నుంచి ప్రధానాలయం వరకు ప్రతిష్ఠామూర్తుల శోభాయాత్ర ఉంటుందని ఆలయ ఈవో గీత, ప్రధాన పూజారి లక్ష్మీనరసింహాచార్య తెలిపారు. ఆ రోజు ఉ. 11.55 గంటలకు స్వయంభువు మినహా ప్రతిష్ఠామూర్తులు, కలశాలకు ఏకకాలంలో మహాకుంభ సంప్రోక్షణ నిర్వహిస్తామని వివరించారు. కొండ కింద ఉత్తర దిశలో నిర్మితమైన పైవంతెనను 26న ప్రారంభించనున్నారు.

లక్ష్మి పుష్కరిణి సిద్ధం
గండి చెరువు వద్ద నిర్మించిన లక్ష్మి పుష్కరిణిని నీటితో నింపి సిద్ధం చేశారు. గోదావరి జలాలతో పుష్కరిణిని నింపాలని ప్రణాళిక రూపొందించినా ట్యాంకుల నిర్మాణం పూర్తికాకపోవడంతో ప్రస్తుతానికి బోరు నీటితో నింపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని