TG News: సీఎం, మంత్రులకు ప్రభుత్వం ఐటీ చెల్లింపు నిబంధన రద్దు చేయండి

ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు పొందే వేతనానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను (ఐటీ) చెల్లింపు నిబంధనను రద్దు చేయాలంటూ హైకోర్టులో శుక్రవారం ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

Published : 06 Jul 2024 03:23 IST

హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు

ఈనాడు, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు పొందే వేతనానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను (ఐటీ) చెల్లింపు నిబంధనను రద్దు చేయాలంటూ హైకోర్టులో శుక్రవారం ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. వేతనాలు, పెన్షన్, అనర్హతపై తొలగింపు చట్టం 1953లోని సెక్షన్‌ 3(4) కింద ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రుల వేతనాలకు సంబంధించిన ఆదాయపు పన్నును రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ తరఫున కార్యదర్శి సోమ శ్రీనివాసరెడ్డి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ‘ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే ప్రజల మాదిరిగానే మంత్రులు కూడా ఐటీ చెల్లించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పలు సవరణల కారణంగా ముఖ్యమంత్రి, మంత్రులతోపాటు క్యాబినెట్‌ ర్యాంకు ఉన్న సలహాదారులు, ఛైర్‌పర్సన్లు, పార్లమెంట్‌ కార్యదర్శులు తదితరులకూ ప్రభుత్వమే చెల్లించేలా 2015లో జీవో917 విడుదల అయింది. పన్ను చెల్లింపులకు సంబంధించిన వివరాలను సమాచార హక్కు చట్టం కింద కోరగా వ్యక్తిగత గోప్యతకు భంగమంటూ నిరాకరించారు. ప్రజలు పన్నుల నుంచి ప్రభుత్వం చెల్లిస్తున్న ఆదాయపు పన్ను వివరాలను వెల్లడించడంలో రహస్యం పాటించాల్సిన అవసరం లేదు. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం సేవలకు వేతనాలు పొందేవారంతా పన్ను చెల్లించాల్సిందే. అంతేగానీ ప్రభుత్వం పన్ను చెల్లించరాదు. పన్ను చెల్లించడానికి వెసులుబాటు కల్పించే నిబంధనలను రద్దు చేయాలి’ అని వ్యాజ్యంలో కోరారు. ఇందులో ప్రతివాదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శిని పేర్కొన్నారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం త్వరలో విచారణ చేపట్టనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని