TG News: పేరుకుపోతున్న పరిహారం కేసులు

బహిరంగ మార్కెట్‌లో భూముల విలువకు.. భూ సేకరణ నోటిఫికేషన్‌ ద్వారా ప్రకటించిన ధరకు పొంతన లేదని సిద్దిపేట జిల్లాలో కాలువల కింద భూమిని ఇచ్చేందుకు నిరాకరిస్తూ కొందరు కేసులు వేశారు. 

Published : 09 Jul 2024 04:38 IST

ట్రైబ్యునల్‌ విచారణకు హాజరుకాని బాధితులు
ఫార్మా సిటీ, నిమ్జ్, కాళేశ్వరం కాలువలకు సంబంధించినవే ఎక్కువ..
ఈనాడు - హైదరాబాద్‌

  • బహిరంగ మార్కెట్‌లో భూముల విలువకు.. భూ సేకరణ నోటిఫికేషన్‌ ద్వారా ప్రకటించిన ధరకు పొంతన లేదని సిద్దిపేట జిల్లాలో కాలువల కింద భూమిని ఇచ్చేందుకు నిరాకరిస్తూ కొందరు కేసులు వేశారు. 
  • తమ గ్రామంలోని భూములు తీసుకుని.. ప్రత్యామ్నాయంగా ఇస్తున్న స్థలాలతో ఉపయోగం లేదని డిండి ప్రాజెక్టు కింద రైతులు పిటిషన్‌ దాఖలు చేశారు. 
  • సంగారెడ్డి జిల్లాలో నిమ్జ్, రంగారెడ్డి జిల్లాలో ఫార్మాసిటీ కోసం ప్రభుత్వం సేకరిస్తున్న భూములకు ఇస్తున్న ధరలపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కొన్ని ఉదంతాలే. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, కాలువలు, పరిశ్రమలు, రహదారుల నిర్మాణాల కోసం సేకరిస్తున్న భూములకు చెల్లించాల్సిన పరిహారానికి సంబంధించిన కేసులు పేరుకుపోతున్నాయి. బహిరంగ మార్కెట్‌కు భిన్నంగా ధరలను నిర్ణయించడంతోనే బాధితులు తమ భూములు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదని కేసుల తీరుతో అర్థమవుతోంది. హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఉన్న రాష్ట్ర భూ సేకరణ, పునరావాసం, పునరాశ్రయ ప్రాధికార సంస్థ(ట్రైబ్యునల్‌)లో 2017 నుంచి 2024 వరకు నమోదైన 2,431 కేసులు ఇందుకు సంబంధించినవే కావడం గమనార్హం. ట్రైబ్యునల్‌ వద్ద దాదాపు 30 వేల మందికి సంబంధించిన కేసులు ఉన్నాయి. 

బాధితుల నిరాసక్తత.. 

జిల్లాల్లో భూ సేకరణ అథారిటీ(ఎల్‌ఏ) అధికారులు ప్రాజెక్టులు, ఇతర ప్రయోజనాలకు భూములను సేకరిస్తున్నారు. దీనిలో భాగంగా భూ సేకరణ చట్టం-2013(సవరణ) ప్రకారం స్థానిక మార్కెట్‌ విలువ(రెవెన్యూ రికార్డుల ప్రకారం) ఆధారంగా నోటిఫికేషన్‌ జారీ చేస్తున్నారు. డిక్లరేషన్‌ తీసుకుని అవార్డు ప్రకటిస్తున్నారు. ఇక్కడే బాధితుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బహిరంగ మార్కెట్‌ ధరలకు దూరంగా ప్రభుత్వ మార్కెట్‌ విలువలు ఉంటున్నాయని.. దీంతో తీవ్రంగా నష్టపోతున్నట్లు రైతులు వాపోతున్నారు. ఉదాహరణకు.. ఎకరా వ్యవసాయ భూమికి బహిరంగ మార్కెట్‌లో రూ.50 లక్షలు పలుకుతుంటే ప్రభుత్వ మార్కెట్‌ విలువ రూ.10 లక్షలలోపే ఉంటోంది. దీనివల్ల ప్రభుత్వానికి భూమి ఇచ్చి ఆ పరిహారంతో వేరేచోట కొనుగోలు చేయడం భారంగా మారుతోందని చెబుతున్నారు. ఇదే తరహాలో గ్రామాలు కోల్పోతున్న ప్రాంతాల్లోనూ స్థలాల ధరలు చాలా తక్కువగా నిర్ణయిస్తున్నారని బాధితులు పేర్కొంటున్నారు. దీంతో పరిహారం చెక్కుల పంపిణీ నిలిచిపోయి చివరికి ఆ అవార్డుకు సంబంధించిన డబ్బును ల్యాండ్‌ ట్రైబ్యునల్‌ వద్ద జమ చేస్తున్నారు. అనంతరం ట్రైబ్యునల్‌ బాధితులకు నోటీసులు జారీ చేస్తున్నా.. ఫలితం ఉండటం లేదు. పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి, సీతారామ ఎత్తిపోతలు, డిండి, కాళేశ్వరం కింద కాలువలు, జలాశయాల నిర్మాణాలు, హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్‌ జిల్లాల్లో జాతీయ, రాష్ట్ర రహదారుల విస్తరణకు సంబంధించిన కేసులు ఎక్కువగా ఉన్నాయి. 

పెండింగ్‌కు అనేక కారణాలు 

ట్రైబ్యునల్‌ వద్ద కేసులు పెండింగ్‌ పడటానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. భూములు ఇచ్చిన చాలా మందికి ట్రైబ్యునల్‌ వద్ద పరిహారం డిపాజిట్‌ అయి ఉందనే విషయమే తెలియదు. ఒకసారి అవార్డు ప్రకటించాక ఎప్పటికైనా ఆ భూమిని ప్రభుత్వం సేకరిస్తుందనే అవగాహన ఉండటం లేదు. ఎక్కువ మొత్తం పరిహారానికి డిమాండ్‌ చేయాలంటే ట్రైబ్యునల్‌ వద్ద కేసుల్లో వాదనలు వినిపించాలనీ చాలా మందికి తెలియడం లేదు. దీనికితోడు ట్రైబ్యునల్‌ నోటీసులు జారీ చేస్తున్నా.. అవి బాధితులకు పూర్తి స్థాయిలో అందడం లేదని తెలుస్తోంది.

  • సరిహద్దు వివాదాలు, కుటుంబ సభ్యుల మధ్య వివాదాలతోనూ పరిహారం పంపిణీ నిలిచిపోయిన కేసులు ఉన్నాయి.
  • పట్టా పాసుపుస్తకాల్లో భూమి వివరాలు సరిగా లేకపోవడంతో బాధితులు నిర్ధారణ కాక పంపిణీ నిలిచిపోయినవీ ఉన్నాయి. 
  • రికార్డుల్లో భూమి ఒక చోట, వాస్తవ సాగు మరోచోట ఉండటంతో పరిహారం అందని వారూ ఉన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని