Ramoji Rao: రామోజీరావు.. నవతరానికి స్ఫూర్తి

రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావును నవతరం స్ఫూర్తిగా తీసుకోవాలని సినీ నటి జయసుధ అన్నారు. మంగళవారం రామోజీ ఫిల్మ్‌ సిటీలో రామోజీరావుకు ఆమె నివాళులు అర్పించారు.

Published : 19 Jun 2024 04:13 IST

మంగళవారం రామోజీ ఫిల్మ్‌ సిటీలో రామోజీరావుకు నివాళులర్పిస్తున్న సినీ నటి జయసుధ

ఈనాడు, హైదరాబాద్‌: రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావును నవతరం స్ఫూర్తిగా తీసుకోవాలని సినీ నటి జయసుధ అన్నారు. మంగళవారం రామోజీ ఫిల్మ్‌ సిటీలో రామోజీరావుకు ఆమె నివాళులు అర్పించారు. ఈనాడు ఎండీ సీహెచ్‌ కిరణ్, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, రామోజీ ఫిల్మ్‌ సిటీ ఎండీ విజయేశ్వరి సహా కుటుంబ సభ్యులను పరామర్శించి.. ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమకే కాకుండా.. భారతీయ చలనచిత్ర రంగానికి రామోజీరావు గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారని జయసుధ కొనియాడారు. 

పలువురి నివాళి..

రామోజీ ఫిల్మ్‌ సిటీలో రామోజీరావుకు మంగళవారం పలువురు నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, సీపీఐ ఆంధ్రప్రదేశ్‌ కార్యదర్శి రామకృష్ణ, పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్, తెదేపా నేతలు బుద్ధా వెంకన్న, ప్రభాకర్‌ చౌదరి, బీసీసీఐ మాజీ చీఫ్‌ సెలెక్టర్‌ ఎం.ఎస్‌.కె.ప్రసాద్, సినీ దర్శకులు ముళ్లపూడి వర, చంద్రసిద్ధార్థ, రెడ్డి సంక్షేమ సంఘం గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు భుజంగరెడ్డి, రెడ్‌క్రాస్‌ సొసైటీ చిత్తూరు జిల్లా ఛైర్మన్‌ ఉప్పలపాటి రమేశ్‌బాబు నివాళులు అర్పించినవారిలో ఉన్నారు.

బీసీసీఐ మాజీ చీఫ్‌ సెలెక్టర్‌ ఎం.ఎస్‌.కె.ప్రసాద్,

కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ


రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలి
ఒడిశా సంతాప సభలో బ్రహ్మపుర ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌

సంతాప సభలో ‘ఈనాడు’ దినపత్రికలను ప్రదర్శిస్తున్న బ్రహ్మపుర ఎమ్మెల్యే అనిల్‌ కుమార్, ఒడిశాలోని తెలుగువారు 

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: ‘ఈటీవీ’, ‘ఈనాడు’ ద్వారా యువత ప్రతిభను వెలికితీసి, ఎంతో మంది ఉపాధికి బాటలు వేసిన మహనీయుడు రామోజీరావు. ఆయన మరణం దేశానికి తీరని లోటు’ అని ఒడిశాలోని గంజాం జిల్లా బ్రహ్మపుర ఎమ్మెల్యే కె.అనిల్‌ కుమార్‌ అన్నారు. మంగళవారం బ్రహ్మపురలో రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు సంతాప సభ నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రామోజీరావు వేల మందికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. భారతరత్న ఇవ్వడమే ఆయనకు నిజమైన నివాళి అని అక్కడి తెలుగు సంఘాల సభ్యులు, ప్రముఖులు సభలో పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్రపతి, ప్రధాని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాయాలని తీర్మానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని