Telangana News: 1 నుంచి విద్యాసంస్థలన్నీ షురూ

రాష్ట్రంలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఆ వెంటనే విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా

Updated : 30 Jan 2022 05:42 IST

కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలి: మంత్రి సబిత

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఆ వెంటనే విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా శనివారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులను ఈనెల 11వ తేదీకి బదులు 8 నుంచే ఇచ్చిన సంగతి తెలిసిందే. 17వ తేదీ నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభించాల్సి ఉండగా సెలవులను 30వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనిప్రకారం 31వ తేదీ నుంచి (సోమవారం) విద్యాసంస్థలను తెరవాలి. సర్కారు మాత్రం ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పునఃప్రారంభిస్తున్నట్లు ఆదేశాలిచ్చింది. అంటే సెలవులను 31వ తేదీ వరకు పొడిగించినట్లుగా భావించాలి. ఆ విషయాన్ని ఆదేశాల్లో పేర్కొనలేదు. విద్యాసంస్థల్లో కస్తూరిబాగాంధీ బాలికా విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలలు, ఇతర పలు రకాల గురుకులాలు ఉండటంతో వాటిని సన్నద్ధం చేసుకునేందుకు ఈసారి కొంత ముందుగానే ఆదేశాలిచ్చినట్లు భావిస్తున్నారు. విద్యాసంస్థలను ప్రారంభించాలని నిర్ణయించినందుకు ట్రస్మా రాష్ట్ర నేతలు కందాల పాపిరెడ్డి, ఎస్‌ఎన్‌రెడ్డి, యాదగిరి శేఖర్‌రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

జాగ్రత్తలు తీసుకోవాలి
విద్యాసంస్థల్లో కరోనా నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

టీవీ పాఠాలుంటాయా? లేదా?
ఇటీవల సెలవులు పొడిగించిన నేపథ్యంలో 8, 9, 10 తరగతులకు నాలుగు రోజులపాటు టీశాట్‌ విద్యా ఛానెల్‌ ద్వారా టీవీ పాఠాలను ప్రసారం చేశారు. విద్యాసంస్థలను పునఃప్రారంభిస్తున్న నేపథ్యంలో వాటిని కొనసాగిస్తారా? నిలిపివేస్తారా? అనే విషయమై స్పష్టత రాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని