Maha Padayatra: ఏపీలో మహాపాదయాత్రపై లాఠీ

అమరావతి రైతుల మహాపాదయాత్ర గురువారం పోలీసు నిర్బంధాలతో రణరంగంగా మారింది. సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ప్రజలపై లాఠీలు ఝుళిపించడం, జనం ఎదురుతిరగడంతో ఉద్రిక్తంగా మారింది.   ప్రకాశం జిల్లా

Updated : 12 Nov 2021 05:14 IST

రోప్‌పార్టీలతో అడ్డగింత.. ఎదురుతిరిగిన ప్రజలు
పోలీసుల లాఠీఛార్జితో రణరంగం
పలువురికి గాయాలు..

చదలవాడ వద్ద పోలీసుల వలయాన్ని ఛేదించుకొని ముందుకు వెళుతున్న ప్రజలు, రైతులు

ఈనాడు డిజిటల్‌, ఒంగోలు: అమరావతి రైతుల మహాపాదయాత్ర గురువారం పోలీసు నిర్బంధాలతో రణరంగంగా మారింది. సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ప్రజలపై లాఠీలు ఝుళిపించడం, జనం ఎదురుతిరగడంతో ఉద్రిక్తంగా మారింది.   ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు నుంచి గురువారం ఉదయం యాత్ర మొదలయ్యేసరికే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వందల సంఖ్యలో బలగాల్ని మోహరించిన పోలీసులు.. అక్కడికి వచ్చే మార్గాలన్నీ దిగ్బంధించారు.   వందల మంది పోలీసులు రోప్‌పార్టీలతో ఎక్కడికక్కడ దిగ్బంధించినా ప్రజలు ఎదురుతిరిగి రైతుల దగ్గరకు చేరుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఒక్కసారిగా లాఠీలు ఝళిపించారు. లాఠీఛార్జిలో పలువురు గాయపడ్డారు.  

పాదయాత్ర చేస్తున్న రైతులు బుధవారం రాత్రి నాగులుప్పలపాడులో ఒక శీతలగిడ్డంగి ఆవరణలో బస చేశారు. అర్ధరాత్రి నుంచి వర్షం కురవడంతో టెంట్లలోకి నీళ్లు చేరి వారికి కంటిమీద కునుకు కరవైంది. ఓవైపు ఆగకుండా వర్షం పడుతున్నా రెయిన్‌కోట్లు ధరించి, గొడుగులు పట్టుకుని ఉదయం 9.30కి రైతులు పాదయాత్ర ప్రారంభించారు. ఉదయం నుంచే నాగులుప్పలపాడు చుట్టుపక్కల ప్రాంతాల్లో వందల సంఖ్యలో పోలీసులు మోహరించారు. నాగులుప్పలపాడు, కేశినేనివారిపాలెం, చదలవాడ, చీర్వానుప్పలపాడు కూడళ్లకు చేరుకున్న ప్రజల్ని వెనక్కు వెళ్లిపొమ్మని హెచ్చరించారు. చదలవాడ వద్ద  వాగ్వాదానికి దిగిన రైతులపై లాఠీఛార్జి చేశారు. ఈ ఘటనలో చీర్వానుప్పలపాడుకు చెందిన ఆళ్ల నాగార్జునకు చెయ్యి విరిగింది. మరికొందరికీ దెబ్బలు తగిలాయి. పోలీసుల దాష్టీకంతో ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. పోలీసులు అడ్డుగా పట్టుకున్న తాడును తోసుకుని ఒక్కసారిగా పరుగులు తీశారు. పాదయాత్రకు ఎదురేగి, రైతులతో కలసి జై అమరావతి అంటూ నినదించారు. లాఠీఛార్జి విషయం తెలుసుకుని సమీప గ్రామాల ప్రజలూ ఉవ్వెత్తున తరలిరావడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. తర్వాత యాత్ర ప్రశాంతంగా జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉందన్న కారణం చూపించి ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్‌ తదితరులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పాదయాత్రలో గురువారం హైకోర్టు న్యాయవాదులు పాల్గొని సంఘీభావం తెలిపారు.

లాఠీఛార్జి చేస్తున్న పోలీసులు

పాదయాత్రకు ఎదురుగా మాజీ మంత్రి, తెదేపా నాయకుడు ఆలపాటి రాజా నేతృత్వంలో సుమారు 300 మంది ప్రదర్శన నిర్వహించడం, దానిని పోలీసులు నిలువరించే ప్రయత్నంలోనే నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద అలజడి రేగిందని ప్రకాశం జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌ అన్నారు.


పాదయాత్రను చూసి జగన్‌ భయపడుతున్నారు: చంద్రబాబు

‘అమరావతి రైతులు శాంతియుతంగా పాదయాత్ర చేసుకొని వారి బాధలను ప్రజలకు వివరించుకుంటే ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏంటి? పోలీసులు ఎందుకు విధ్వంసం సృష్టిస్తున్నారు. రాజశేఖర్‌రెడ్డి, జగన్‌ పాదయాత్రలు చేసినప్పుడు శాంతిభద్రతల సమస్యలు లేవా? మేము ఇలాగే వ్యవహరించి ఉంటే వారు పాదయాత్రలు చేయగలిగే వారా?’ అని చంద్రబాబు ప్రశ్నించారు.  ‘ పాదయాత్రలో రైతులపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేయడాన్ని ఖండిస్తున్నాం. గాయపడిన రైతులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలి. పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి సీఎం జగన్‌ భయపడుతున్నారు’ అని చంద్రబాబు అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని