Updated : 05 Dec 2021 05:05 IST

Arbitration: ఆర్బిట్రేషన్‌లో కొత్త పంథా

ఈ నెల 18న ప్రారంభం కానున్న ఐఏఎంసీ

అన్ని ప్రయత్నాల తర్వాతే కోర్టులకు రావాలి

పరిచయ కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ

హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం సంతోషకరం: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో ఐఏఎంసీ లోగోను ఆవిష్కరిస్తున్న సీజేఐ జస్టిస్‌
ఎన్‌వీ రమణ, సీఎం కేసీఆర్‌, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, తెలంగాణ
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ, రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి


మహాభారతంలోనూ మధ్యవర్తిత్వం ఉంది.శ్రీకృష్ణుడి మధ్యవర్తిత్వం విఫలం కావడంతో దుష్పరిణామాలు సంభవించాయి. వ్యాపారంలో అభిప్రాయభేదాలు వస్తే చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు.

-సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ


వ్యాపార నిర్వహణ, ఆర్థికాభివృద్ధిలో కాంట్రాక్టుల అమలు కీలకం.. దురదృష్టవశాత్తూ దేశం ఇందులో వెనుకబడి ఉంది. ఆలస్యమైనప్పటికీ దేశంలో అదీ హైదరాబాద్‌లో ఇలాంటి సంస్థ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది.

- సీఎం కేసీఆర్‌


ఈనాడు, హైదరాబాద్‌: ప్రస్తుతం హైదరాబాద్‌లో ఏర్పాటవుతున్న ఐఏఎంసీ (ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ అండ్‌ మీడియేషన్‌ సెంటర్‌) ఆర్బిట్రేషన్‌ ప్రక్రియను ఆసాంతం మార్చనుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ పేర్కొన్నారు. సింగపూర్‌, లండన్‌ కేంద్రాల స్థాయిలో హైదరాబాద్‌లో ఈ నెల 18న ఐఏఎంసీ ప్రారంభమవుతోందన్నారు. ఇక్కడి ప్యానల్‌లో అంతర్జాతీయ స్థాయిలో ఆర్బిట్రేటర్లు, పరిపాలనా సిబ్బంది, మౌలిక వసతులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. హెచ్‌ఐసీసీలోని నోవాటెల్‌లో శనివారం ఐఏఎంసీ పరిచయ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌, న్యాయకోవిదులు, న్యాయమూర్తులు, మంత్రులు, ఇతర ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం ప్రత్యామ్నాయ వివాద పరిష్కారాని(ఏడీఆర్‌)కి ప్రాధాన్యం ఇస్తున్నారు. 40 ఏళ్లుగా ఈ రంగంలో ఉన్న అనుభవంతో చెబుతున్నా అన్ని ప్రయత్నాలు పూర్తయ్యాక చివరగా కోర్టును ఎంపిక చేసుకోవాలి. ఏడీఆర్‌, ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌లతో వివాదాలు పరిష్కారం కావడంతోపాటు సంబంధాల పునరుద్ధరణ జరుగుతుంది. ఈ ప్రక్రియలో ఎవరికీ విజయం, ఓటమి ఉండదు. ప్రస్తుత ఆర్బిట్రేషన్‌ కేంద్రాలు అంతర్జాతీయ వాణిజ్య నగరాలైన పారిస్‌, సింగపూర్‌, హాంకాంగ్‌, లండన్‌, న్యూయార్క్‌, స్టాక్‌ హోంలలో ఉన్నాయి. హైదరాబాద్‌ కేంద్రాన్ని అంతర్జాతీయస్థాయిలో నిలపడానికి సింగపూర్‌ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మేనన్‌తోపాటు లండన్‌లో ప్రముఖ ఆర్బిట్రేటర్లతో మాట్లాడా. వారు సహకారం అందిస్తామన్నారు. వసతుల అందుబాటుతోపాటు తెలంగాణ ప్రజల సహృదయం కారణంగా హైదరాబాద్‌లో ఈ కేంద్రం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాం. జూన్‌లో నా ఆలోచనలను సీఎంతో పంచుకున్నా.. ఆయన సహకారంతో అనతి కాలంలోనే అవి వాస్తవ రూపం దాల్చాయి. జస్టిస్‌ రవీంద్రన్‌ ఈ సంస్థ నిబంధనలు, మార్గదర్శకాలు రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ, మంత్రులు కేటీఆర్‌, ఇంద్రకరణ్‌రెడ్డిలకు కృతజ్ఞతలు.

మంత్రి కేటీఆర్‌, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ

కేసీఆర్‌ది పెద్దమనసు

కేసీఆర్‌ది పెద్దమనసు. ఆయన ఏది చేసినా పెద్ద ఆర్భాటంగానే చేస్తారు. అది పెద్దలు, తీర్చిదిద్దిన గురువులు ఆయనకిచ్చిన వరం అనుకుంటా. ఇంత పెద్ద అంతర్జాతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, భూమిని ఇవ్వడం ఆయన పెద్దమనసుకు నిదర్శనం.

సీజేఐ మానసపుత్రిక ఇది:  జస్టిస్‌ నాగేశ్వరరావు

ఐఏఎంసీ సీజేఐ మానస పుత్రిక అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఐఏఎంసీ ట్రస్టీ జస్టిస్‌ లావు నాగేశ్వరరావు తెలిపారు. ప్రభుత్వ సాయం లేకుండా దీన్ని ఏర్పాటు చేయడం సాధ్యంకాదని.. ఇందులో మంత్రులు కేటీఆర్‌, ఇంద్రకరణ్‌రెడ్డి కీలకపాత్ర పోషించారన్నారు. సివిల్‌ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా ఉన్న వివిధ దశలతో కేసుల పరిష్కారంలో జరుగుతున్న జాప్యం ఏడీఆర్‌ ఆవిష్కరణకు కారణమైందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు. మీడియేషన్‌ డ్రాఫ్ట్‌ బిల్లును పార్లమెంటు ఆమోదించాల్సిన తరుణమిదేనని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిలు ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ అవసరాలను వివరించారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ స్వాగతం పలకగా, రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, రాష్ట్ర మంత్రి మహమూద్‌ అలీ, తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తులు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.

ఐఏఎంసీ పరిచయ కార్యక్రమానికి హాజరైన న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఇతర ప్రతినిధులు

‘రచ్చబండ’ నుంచే ఏడీఆర్‌ విధానం: కేసీఆర్‌

వివాదాల పరిష్కారంలో ఆర్బిట్రేషన్‌ అత్యున్నతమైనదిగా గుర్తింపు పొందిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. ఐఏఎంసీ పరిచయ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘‘పూర్వకాలం వివాదాలను గ్రామ పెద్దలు పరిష్కరించేవారు.. కొత్తగా వచ్చిన ఏడీఆర్‌ విధానం ‘రచ్చబండ’ నుంచి వచ్చిందే. హైదరాబాద్‌లో ఇలాంటి సంస్థ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. అభివృద్ధి చెందుతున్న ఐటీ రంగంతోపాటు విమానాశ్రయం, హోటళ్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ప్రపంచస్థాయి కంపెనీలు నగరంలో ఉన్నాయి. హైదరాబాద్‌లో ఇలాంటి కేంద్రం ఏర్పాటు చేస్తున్నందుకు తెలంగాణ ప్రభుత్వం, ప్రజల తరఫున సీజేఐకి హృదయపూర్వక కృతజ్ఞతలు. తక్షణం 25 వేల చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించాం. శాశ్వత భవనం కోసం పుప్పాలగూడలో భూమి కేటాయించాం. సీజేఐ నేతృత్వంలో ట్రస్టీలు జస్టిస్‌ నాగేశ్వరరావు, జస్టిస్‌ రవీంద్రన్‌ల సహకారంతో ఈ కేంద్రం రాష్ట్రం, దేశం, ఏషియాలోనే మంచి గుర్తింపు పొంది, ప్రపంచస్థాయిలో నిలుస్తుంది’’ అని వెల్లడించారు.

అత్యుత్తమ పారిశ్రామిక విధానం: కేటీఆర్‌

దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని అత్యుత్తమ పారిశ్రామిక విధానం తెలంగాణలో సీఎం కేసీఆర్‌ మార్గదర్శకత్వంలో రూపొందిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. అన్ని దేశాల్లోనూ అధ్యయనం చేసి టీఎస్‌ఐపాస్‌ను తీసుకొచ్చామన్నారు. ఐఏఎంసీ పరిచయ సదస్సు ముగింపు కార్యక్రమంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఐఏఎంసీకి ప్రభుత్వపరంగా అన్ని రకాలుగా సహకరిస్తామన్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల వివాదాల పరిష్కారం కోసం ఫెసిలిటేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. జీవితకాల ట్రస్టీ జస్టిస్‌ ఆర్‌.వి.రవీంద్రన్‌ మాట్లాడుతూ.. ఈ కేంద్రానికి న్యాయవాదులు, పరిశ్రమల నుంచి సహకారం అవసరమన్నారు.


తెలుగులో మాట్లాడితేనే సంతోషం

ఎలాగైతే తెలుగువాళ్లు భోజనంలో పెరుగన్నం తినకపోతే సంతృప్తి చెందరో రెండు ముక్కలు తెలుగులో చెప్పకపోతే నేనూ సంతోషపడను. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా తెలుగు భాషాభిమాని. భాషా సంస్కృతుల కోసం ఎంతో కష్టపడి పనిచేస్తున్న మనిషి. తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తెచ్చిన ఆర్థిక సంస్కరణల ఫలితంగా ఈ దేశంలోని చట్టాల్లో మార్పులు చేయాల్సి వచ్చింది. ఆ మార్పుల్లో భాగంగా మరో తెలుగుబిడ్డ డాక్టర్‌ పీసీ రావు ఆర్బిట్రేషన్‌, కన్సిలియేషన్‌ యాక్ట్‌ 1996ను రాశారు. కోర్టులే కాదు.. ప్రభుత్వాలు, అధికారులు కూడా న్యాయం చేయవచ్చని, సమాజంలో గుర్తింపు ఉండి, గౌరవం ఉన్న ఏ వ్యక్తి అయినా తీర్పు చెప్పడానికి అర్హుడేనని రాష్ట్రపతి, ప్రధానమంత్రి సమక్షంలో నేను చెప్పాను. మీడియేషన్‌ కేంద్రంలో సమాజం గౌరవించిన బిడ్డలు ప్యానల్‌ సభ్యులుగా ఉంటారు. గరికపాటి, నాగఫణి శర్మ వంటి సమాజంలో గుర్తింపు పొందినవారి మాటకు విలువ ఉంటుంది.. అలాంటి వారు ప్యానెల్‌లో చేరాలని విజ్ఞప్తి చేస్తున్నా.

- జస్టిస్‌ ఎన్‌వీ రమణRead latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని