Gurukula Teachers: 317 జీవో ప్రకారం ఉద్యోగులు, ఉపాధ్యాయుల తుది కేటాయింపులు

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 317 జీవో ప్రకారం తుది కేటాయింపులు పూర్తి చేయాలని ఆ సొసైటీలు నిర్ణయించాయి.

Published : 14 Jun 2024 05:43 IST

వారం రోజుల్లో ప్రక్రియ పూర్తి!
ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీల నిర్ణయం

ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమైన ఎస్సీ, ఎస్టీ సంక్షేమ గురుకుల సొసైటీల కార్యదర్శి కె.సీతాలక్ష్మి. చిత్రంలో అదనపు కార్యదర్శి హన్మంతనాయక్‌ 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 317 జీవో ప్రకారం తుది కేటాయింపులు పూర్తి చేయాలని ఆ సొసైటీలు నిర్ణయించాయి. గతంలోనే కేటాయింపులపై ఎస్‌ఎంఎస్‌లు పంపించిన సొసైటీలు.. తాజాగా బదిలీ ఉత్తర్వులు జారీ చేయనున్నాయి. వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీల పరిధిలో ఉద్యోగుల సమస్యలు, బదిలీలు, పదోన్నతులపై ఉద్యోగ సంఘాల నేతలతో సొసైటీల కార్యదర్శి కె.సీతాలక్ష్మి, అదనపు కార్యదర్శి హన్మంతనాయక్‌ గురువారం సమావేశమయ్యారు. సొసైటీలు గతంలోనే జీవో నం.317 ప్రకారం ఉద్యోగుల కేటాయింపు పూర్తి చేశాయని, దీనిపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. న్యాయస్థానం నుంచి ఆదేశాలు తెచ్చుకున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు మినహా మిగతావారికి తుది కేటాయింపులు చేస్తామన్నారు. తుది కేటాయింపులు పూర్తయిన తర్వాత జీవో నం.317 అమలు వల్ల ఎవరికైనా ఇబ్బందులు ఉంటే.. మంత్రివర్గ ఉపసంఘం వద్ద తమ అభ్యంతరాలు నమోదు చేయాలని సూచించారు. 

ప్రభుత్వ ఆదేశాలు వస్తేనే బదిలీలు..

ఏడాదిన్నర క్రితమే జీవో నం.317 ప్రకారం తుది కేటాయింపులు చేయాలని సొసైటీలు భావించినప్పటికీ విద్యాసంవత్సరం మధ్యలో దీన్ని చేపడితే ఇబ్బందులు వస్తాయని భావించి ప్రభుత్వం ముందడుగు వేయలేదు. గత విద్యాసంవత్సరంలో చేపట్టాలని అనుకున్నప్పటికీ.. గురుకులాల్లో కొత్త నియామకాలు పూర్తయ్యేవరకు నిలిపివేయాలని సొసైటీలు నిర్ణయించాయి. తాజాగా గురుకుల ఫలితాలు వెల్లడి కాగా.. కొత్త ఉపాధ్యాయులకు   పోస్టింగులు ఇవ్వాల్సి ఉంది. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులపై నిర్ణయం తీసుకోవాలని గురువారం జరిగిన సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. బదిలీలపై ప్రభుత్వం నుంచి విధివిధానాలు వస్తే నిర్ణయం తీసుకుంటామని కార్యదర్శి సీతాలక్ష్మి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల తరఫున కె.యాదయ్య, బాలరాజు, దయాకర్, ప్రభుదాస్,  వై.బసవయ్య, మధుసూదన్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని