Ashadha bonalu: వైభవంగా ఆషాఢ బోనాలు ప్రారంభం

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన హైదరాబాద్‌ గోల్కొండ బోనాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.

Published : 08 Jul 2024 03:28 IST

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని జగదాంబికను వేడుకున్న స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌
ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌

హైదరాబాద్‌ లంగర్‌హౌస్‌ చౌరస్తాలో ప్రభుత్వం తరఫున జగదాంబిక మాతకు పట్టువస్త్రాలు సమర్పించిన స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌. చిత్రంలో  శ్రీలతారెడ్డి, గద్వాల విజయలక్ష్మి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, జోగిని శ్యామల, దానం నాగేందర్‌ తదితరులు

మెహిదీపట్నం, గోల్కొండ- న్యూస్‌టుడే: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన హైదరాబాద్‌ గోల్కొండ బోనాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పోతరాజుల నృత్యాలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనల మధ్య లంగర్‌హౌస్‌ చౌరస్తాలో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్‌ గద్వాల విజయలక్ష్మి అమ్మవారి తొట్టెలు, పలహారం బండికి పూజలు చేశారు. ఇక్కడే గోల్కొండ ఖిల్లా జగదాంబిక మాతకు పట్టువస్త్రాలు సమర్పించారు. కల్లు సాక పెట్టి ఉత్సవాలను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పీకర్, మంత్రులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ సంస్కృతిని చాటి చెబుతూ సాంస్కృతిక బృందాలు, పోతరాజులు నృత్యాలతో అమ్మవారి తొట్టెల ఊరేగింపు గోల్కొండకు బయలుదేరింది. దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్, కమిషనర్‌ హనుమంతరావు, ఉప మేయర్‌ శ్రీలతారెడ్డి, ప్లానింగ్‌ బోర్డు వైస్‌ ఛైర్మన్‌ చిన్నారెడ్డి, కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి, కొత్వాల్‌ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. గత ప్రభుత్వం తెలంగాణను ఆర్థిక సంక్షోభంలోకి తీసుకెళ్లిందని, జగదాంబిక మాత ఆశీస్సులతో రాష్ట్రం ఈసంక్షోభం నుంచి బయటపడాలని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అన్నారు. లంగర్‌హౌస్‌లో గోల్కొండ బోనాల వేడుకలను ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సీఎం రేవంత్‌రెడ్డికి మాత దీవెనలు అందించాలని వేడుకున్నామని అన్నారు. దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. బోనాలకు గతంతో పోల్చితే 10శాతం నిధులు అధికంగా కేటాయించామన్నారు. ఈ వేడుకలకు ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ చెప్పారు. 

కుండల్లో బోనం ఆరోగ్యపరంగా మేలు

ఈనాడు, హైదరాబాద్‌: కుమ్మరి కులవృత్తి పరిరక్షణ, ప్రోత్సాహం కోసం తెలంగాణలో బోనాల ఉత్సవాల్లో కుండల్లోనే బోనాలు చేయాలని ప్రభుత్వపరంగా ఉత్తర్వులు ఇస్తామని మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌లు తెలిపారు. కుండల్లో బోనం ఆరోగ్యపరంగా మేలైనదన్నారు. ఆదివారం వారు రాష్ట్ర కుమ్మరశాలివాహన సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్‌ లోయర్‌ట్యాంక్‌బండ్‌ వద్ద కనకాల కట్ట మైసమ్మ దేవాలయం వద్ద జరిగిన తెలంగాణ కుమ్మర్ల తొలి బోనాల జాతరలో మంత్రులతో పాటు ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠాగోపాల్, రాష్ట్ర కుమ్మర శాలివాహన సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జయంతరావు, దయానంద్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని