Prasad Kumar: ఐదారుసార్లు ఫోన్‌ చేసినా ఈఎన్సీ స్పందించలేదు!

వికారాబాద్‌ జిల్లాలోని కోటిపల్లివాగు ప్రాజెక్టు మరమ్మతులు, ఆధునికీకరణ అంచనాల వ్యవహారం మరో మలుపు తిరిగింది.

Updated : 15 Jun 2024 07:51 IST

ప్రొటోకాల్‌ నిబంధనల ప్రకారం ఆయనపై చర్యలు తీసుకోండి
సీఎస్‌ను లేఖ ద్వారా కోరిన శాసనసభాపతి ప్రసాద్‌కుమార్‌

ఈనాడు, హైదరాబాద్‌: వికారాబాద్‌ జిల్లాలోని కోటిపల్లివాగు ప్రాజెక్టు మరమ్మతులు, ఆధునికీకరణ అంచనాల వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి చర్చించేందుకు ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌కు ఫోన్‌ చేస్తే స్పందించలేదంటూ శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌ గత నెలలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి లేఖ రాశారు. ప్రొటోకాల్‌ నిబంధనలు అనుసరించి ఈఎన్సీపై చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. దీనిపై వివరణ కోరుతూ సీఎస్‌ నుంచి నీటిపారుదలశాఖకు తాజాగా లేఖ అందినట్లు సమాచారం. దీంతో ఈ విషయం అటు ప్రభుత్వంలో, ఇటు నీటిపారుదలశాఖలో చర్చనీయాంశంగా మారింది.  

అసలు ఏం జరిగిందంటే..

  • వికారాబాద్‌ జిల్లాలో కోటిపల్లివాగును 1967లో నిర్మించారు. దీని కింద 10 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇప్పటి వరకు పూర్తిస్థాయి మరమ్మతులు లేవు. కట్ట, కాలువలు, తూములు, డిస్ట్రిబ్యూటరీలు దెబ్బతిన్నాయి. 
  • 2023లో అప్పటి తాండూరు ఎమ్మెల్యే ఈ ప్రాజెక్టుకు ఆధునికీకరణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరగా.. రూ.100 కోట్లతో నీటిపారుదలశాఖకు ప్రతిపాదనలు అందాయి. 
  • దీనిపై నాటి ఈఎన్సీ మురళీధర్‌ మరోమారు పరిశీలన(ప్రభుత్వ సలహాదారుతో) చేయించి రూ.37.50 కోట్లకు ప్రతిపాదనలు ఖరారు చేసి ప్రభుత్వానికి పంపారు. ఆ దస్త్రం ఆర్థికశాఖ వద్ద పెండింగ్‌లో ఉండగా ప్రభుత్వం మారింది. 
  • ఈ క్రమంలో ప్రాజెక్టు ఆధునికీకరణలో భాగంగా కాలువల సీసీ లైనింగ్, పూడికతీత, ఇతర పనులు కలిపి మొత్తం రూ.110 కోట్లు మంజూరు చేయాలంటూ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ ప్రభుత్వానికి లేఖ రాశారు. 
  • హైదరాబాద్‌ సీఈ అంతే మొత్తానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపగా దస్త్రాన్ని పరిశీలించిన ఈఎన్సీ అనిల్‌కుమార్‌ పూడిక తొలగింపు, సీసీ లైనింగ్‌ పనులను తొలగించి రూ.64.20 కోట్లకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించారు. క్షేత్రస్థాయి, సాంకేతిక పరిశీలనలు లేకుండానే ప్రతిపాదనలు రూపొందించారని ఇంజినీర్లకు మెమో ఇచ్చారు.  
  • పనుల తొలగింపుపై స్పీకర్‌ సీఎస్‌కు లేఖ రాశారు. ‘హైడ్రోగ్రాఫిక్‌ సర్వే నివేదిక(ఏపీఈఆర్‌ఎల్‌)- 2009 ప్రకారం ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 1.50 టీఎంసీల నుంచి ఒక టీఎంసీకి పడిపోయింది. దీనివల్ల ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. సీసీ లైనింగ్‌ దెబ్బతింది. ప్రతిపాదిత పనులు ఎందుకు తొలగించారని తెలుసుకునేందుకు ఈఎన్సీకి ఐదారుసార్లు ఫోన్‌ చేసినా స్పందించలేదు. ఈ నేపథ్యంలో ప్రొటోకాల్‌ నిబంధనలు అనుసరించి ఈఎన్సీపై చర్యలు తీసుకోవాలి’ అని ఆయన కోరారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని