Bhatti Vikramarka: జనాభా ప్రాతిపదికన నిధులివ్వండి

‘కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల విడుదలకు ఒక నిర్దిష్ట విధానాన్ని పాటించడంలేదు. రాష్ట్రాలకు న్యాయం జరగాలంటే ఆ నిధులను జనాభా నిష్పత్తి ప్రకారం దామాషా పద్ధతిలో విడుదల చేయాలి’ అని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

Published : 23 Jun 2024 05:23 IST

సెస్సులు, సర్‌ఛార్జీలు 10 శాతానికే పరిమితం చేయండి
రాష్ట్రాల నికర రుణ పరిమితి ఎంతో బడ్జెట్‌కు ముందే చెప్పండి
కేంద్ర ఆర్థిక మంత్రికి ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విజ్ఞప్తి

ఈనాడు, దిల్లీ: ‘కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల విడుదలకు ఒక నిర్దిష్ట విధానాన్ని పాటించడంలేదు. రాష్ట్రాలకు న్యాయం జరగాలంటే ఆ నిధులను జనాభా నిష్పత్తి ప్రకారం దామాషా పద్ధతిలో విడుదల చేయాలి’ అని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. శనివారం ఇక్కడి భారత మండపంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ నేతృత్వంలో జరిగిన కేంద్ర బడ్జెట్‌ సన్నద్ధత సమావేశంలో, ఆ తర్వాత జీఎస్టీ మండలి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.  తెలంగాణ తరఫున డిమాండ్లను వినిపించారు.

వివరాలు ఇవీ... ‘‘కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు తగ్గుతున్న వాటాను భర్తీ చేయాలంటే సెస్సులు, సర్‌ఛార్జీల గరిష్ఠ పరిమితిని 10శాతానికి పరిమితం చేయండి. రాష్ట్రాలకు ఏటా అనుమతి ఇచ్చే నికర రుణ పరిమితి వివరాలను బడ్జెట్‌కు ముందే స్పష్టంగా తెలియజేయండి. దానివల్ల రాష్ట్రాలు బడ్జెట్‌ను కచ్చితంగా రూపొందించుకోవడానికి వీలవుతుంది. 

తెలంగాణకు వచ్చే నిధులు తగ్గాయి...

కేంద్ర ప్రాయోజిత పథకాల కింద తెలంగాణకు వచ్చే నిధులు తగ్గాయి. ఈ పథకాలకు జనాభా దామాషా ప్రకారం నిధులు ఇవ్వాలి. ఈ విషయంలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో సూత్రం వర్తింపజేయకుండా అన్నింటికీ జనాభా ప్రాతిపదికగానే నిధులు విడుదల చేయాలి. 2023-24లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.4.60 లక్షల కోట్లలో తెలంగాణకు రూ.6,577 కోట్లు మాత్రమే (1.4%) వచ్చాయి. జనాభా నిష్పత్తి ప్రకారం చూస్తే ఆ మొత్తం చాలా తక్కువ. కేంద్ర ప్రాయోజిత పథకాలను పునఃసమీక్షించాలి. లక్ష్యాలను చేరుకోవడానికి వీలుగా లేని పథకాల స్థానంలో కొత్తవి ప్రవేశపెట్టాలి. వాటికి బ్రాండింగ్‌ వంటి షరతులు లేకుండా రాష్ట్రాలు స్థానిక అవసరాలకు తగ్గట్టు మార్పులు, చేర్పులు చేసుకొని అమలుచేసే వెసులుబాటు కల్పించాలి.

ఆదాయ పంపిణీలో పెరిగిపోతున్న అసమానతలు 

దేశం నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటోంది. నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని ఉద్యోగావకాశాలు కల్పించే నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. ఆదాయ పంపిణీలో అసమానతలు పెరిగిపోతున్నాయి. ఇది చాలా ప్రమాదకరం కాబట్టి ఆదాయాన్ని న్యాయబద్ధంగా పంపిణీచేసి సమ్మిళిత అభివృద్ధికి దోహదం చేసేలా బడ్జెట్‌లో చర్యలు తీసుకోవాలి. 

  • పన్నుల ఆదాయం పంపిణీలో రాష్ట్రాల వాటా తగ్గుతోంది. కేంద్రం సెస్సులు, సర్‌ఛార్జీల రూపంలో పన్నులు వసూలు చేయడమే ఇందుకు కారణం. వాటిలో రాష్ట్రాలకు వాటా రావడంలేదు. అందువల్ల సెస్సులు, సర్‌ఛార్జీలు 10శాతానికి మించి ఉండకుండా చూడాలి.
  • ఏపీ విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాలకు ఏటా రూ.450 కోట్ల గ్రాంట్‌ ఇవ్వాల్సి ఉంది. ఇందులో ఇంకా రూ.2,250 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఈ మొత్తాన్ని విడుదల చేయడంతోపాటు, ఈ గ్రాంట్‌ వ్యవధిని మరో ఐదేళ్లు పొడిగించాలి.
  • రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరంలో తెలంగాణకు రావాల్సిన రూ.491 కోట్ల కేంద్ర ప్రాయోజిత నిధులను కేంద్ర ఆర్థిక శాఖ ఆంధ్రప్రదేశ్‌కు విడుదల చేసింది. ఆ మొత్తాన్ని తిరిగి తెలంగాణకు ఇప్పించాలి.
  • ఉపాధి హామీ కింద రాష్ట్రాలపై విధించిన పరిమితులను తొలగించాలి. ఆస్తులను సృష్టించే పనులకు అనుమతులు ఇవ్వాలి. 
  • పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలి. మూసీ నది అభివృద్ధి పనులకు, ఆర్‌ఆర్‌ఆర్‌ పూర్తికి  కేంద్రం నిధులు ఇవ్వాలి. తెలంగాణకు మరిన్ని నవోదయ పాఠశాలలు కేటాయించాలి. 
  • మూలధన వ్యయ ప్రత్యేక ఆర్థిక సాయం పథకాన్ని రూ.2.50 లక్షల కోట్లకు పెంచాలి.

జీఎస్‌టీకి సంబంధించి...

  • రాష్ట్ర ప్రభుత్వం సమీకృత రెసిడెన్షియల్‌ స్కూళ్లకు పెద్ద ఎత్తున పక్కా భవనాలు నిర్మించాలని నిర్ణయించింది. ఇది సంక్షేమ కార్యక్రమం కిందికి వస్తుంది కాబట్టి ఈ భవనాల నిర్మాణంపై జీఎస్‌టీ తొలగించడమో, తగ్గించడమో చేయాలి. 
  • ఎరువులపై జీఎస్‌టీ 18% నుంచి 5%కి తగ్గించాలి (దీన్ని మంత్రివర్గ ఉపసంఘానికి నివేదించారు)
  • ఏపీ విభజన చట్టం కింద రావాల్సిన బకాయిలతోపాటు ఐజీఎస్‌టీ సమస్యలు పరిష్కరించాలి. 
  • బీడీ ఆకులు, నూలుపై జీఎస్‌టీ రద్దు చేయాలి’’ అని ఉపముఖ్యమంత్రి భట్టి కోరారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని