Bhatti Vikramarka: గనుల వేలంతో సింగరేణి కుదేలు

బొగ్గు గనుల వేలం విధానం అంటే సింగరేణిని కుదేలు చేయడమేనని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. గనుల వేలం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

Published : 22 Jun 2024 04:10 IST

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడి

సభలో ప్రసంగిస్తున్న భట్టి

ఈనాడు, హైదరాబాద్‌: బొగ్గు గనుల వేలం విధానం అంటే సింగరేణిని కుదేలు చేయడమేనని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. గనుల వేలం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘బొగ్గు గనుల వేలం కోసం కేంద్రం తెచ్చిన చట్టంలోని 17ఏ (2) నిబంధన ప్రకారం రిజర్వేషన్‌ పద్ధతిలో సింగరేణికి గనులు కేటాయించే అవకాశం ఉంది. అలా చేయకుండా.. తెలంగాణలోని గనులను వేలంలో పెట్టి ప్రైవేటు కంపెనీలకు అవకాశం కలిగించడం వల్ల ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణికి నష్టం కలుగుతోంది. ప్రస్తుతం 39 గనులు, 40 వేల మంది కార్మికులున్న సింగరేణి మరో 15 ఏళ్లలో 8 గనులు, 800 మంది కార్మికుల స్థాయికి తగ్గిపోయి.. మూతపడే ప్రమాదం ఉంది. తెలంగాణ ప్రాంత నాయకులుగా ఈ పరిణామాన్ని ఊహించలేం. గోదావరి పరీవాహక ప్రాంతంలో మిగిలి ఉన్న 1400 మిలియన్‌ టన్నుల బొగ్గును తీసేందుకు రిజర్వేషన్‌ కోటాలో సింగరేణికి గనులు కేటాయించాలి. ప్రధానమంత్రి మోదీతో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడి ఒప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధాని అపాయింట్‌మెంట్‌ ఇప్పిస్తే సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష నేతలతో కలిసి వెళ్లి విన్నవిస్తాం. 

విద్యుత్కేంద్రాలకు మరింత బొగ్గు అవసరం

త్వరలో ప్రారంభించనున్న 4000 మెగావాట్ల యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌తో పాటు, ఎన్టీపీసీ, సింగరేణి సంస్థలు కొత్తగా నిర్మించే థర్మల్‌ విద్యుత్కేంద్రాలకు మరింత బొగ్గు అవసరం. సత్తుపల్లి బ్లాక్‌-3, కోయగూడెం బ్లాక్‌-3 గనులను గతంలో వేలం ద్వారా పొందిన ప్రైవేటు కంపెనీలు ఇప్పటివరకు తవ్వకాలు ప్రారంభించలేదు. ఆ కేటాయింపులు రద్దుచేసి వాటిని సింగరేణికే కేటాయించాలని కోరుతున్నాం. 2015 ముందువరకు తెలంగాణ ప్రాంతంలోని బొగ్గు నిల్వలపై ఈ సంస్థకే పూర్తి అధికారం ఉండేది. కానీ 2015లో వచ్చిన ఎంఎండీఆర్‌ చట్టం ప్రకారం ఇప్పుడు గోదావరి-ప్రాణహిత ప్రాంతంలో సింగరేణి తన లీజు హక్కును కోల్పోయింది. ఈ చట్టంలోని రిజర్వేషన్‌ పద్ధతి ప్రకారం నాలుగు బొగ్గు గనులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సింగరేణి కోరింది. కానీ ఈ నాలుగు గనులను వేలం ద్వారా విక్రయించాలని కేంద్రం నిర్ణయించడం బాధాకరం. ప్రభుత్వరంగ సంస్థకు ప్రభుత్వాలే సహకరించకపోవడం విచారకరం’ అని భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని