Telangana News: ఛత్తీస్‌గఢ్‌ కరెంటుతో నష్టం రూ.6 వేల కోట్లు

ఛత్తీస్‌గఢ్‌ నుంచి కరెంటు కొనుగోలు వల్ల భారీ నష్టం వాటిల్లిందని జ్యుడిషియల్‌ కమిషన్‌కు తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు తెలిపాయి. బహిరంగ మార్కెట్‌లో చౌకగా కరెంటు లభిస్తుండగా.. అంతకుమించి సొమ్మును ఛత్తీస్‌గఢ్‌కు చెల్లించాల్సి వచ్చిందని పేర్కొన్నాయి.

Updated : 18 Jun 2024 07:22 IST

 

రూ.3.90కే ఒక్కో యూనిట్‌ కొనుగోలుకు ఒప్పందం
అయిన ఖర్చు రూ.5.64
రూ.1,715 కోట్ల బకాయిలు కట్టాలని ఛత్తీస్‌గఢ్‌ డిమాండ్‌
జ్యుడిషియల్‌ కమిషన్‌కు ఇచ్చిన నివేదికలో డిస్కంల వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: ఛత్తీస్‌గఢ్‌ నుంచి కరెంటు కొనుగోలు వల్ల భారీ నష్టం వాటిల్లిందని జ్యుడిషియల్‌ కమిషన్‌కు తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు తెలిపాయి. బహిరంగ మార్కెట్‌లో చౌకగా కరెంటు లభిస్తుండగా.. అంతకుమించి సొమ్మును ఛత్తీస్‌గఢ్‌కు చెల్లించాల్సి వచ్చిందని పేర్కొన్నాయి. ఒక్కో యూనిట్‌ను రూ.3.90లకే కొనేందుకు ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వంతో తెలంగాణ సర్కారు ‘విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం’(పీపీఏ) చేసుకుందని మాజీ సీఎం కేసీఆర్‌ ఇటీవల జ్యుడిషియల్‌ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ నరసింహారెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు. పైగా ఈఆర్‌సీ ఆమోదం తెలిపిన తర్వాత దానిపై అభ్యంతరాలుంటే ‘విద్యుత్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌’కు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు మాత్రమే వెళ్లాల్సి ఉంటుందని.. విచారణ జరిపే అధికారం జ్యుడిషియల్‌ కమిషన్‌కు ఉండదంటూ అభ్యంతరం తెలిపారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన పీపీఏ, తదనంతర పరిణామాలపై అటు ప్రభుత్వానికి, ఇటు జ్యుడిషియల్‌ కమిషన్‌కు డిస్కంలు తాజాగా సమగ్ర సమాచారం అందజేశాయి. ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఒక్కో యూనిట్‌ కరెంటు రావడానికి అయిన ఖర్చు రూ.5.64లకు చేరడంతో నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నాయి.

నష్టం ఎలాగంటే..: ఒప్పందం ప్రకారం ఒక్కో యూనిట్‌ కొనుగోలు ధర రూ.3.90 మాత్రమే అని కేసీఆర్‌ తెలిపారు. కానీ, 2017 నుంచి 2022 వరకు కొన్న 17,996 మిలియన్‌ యూనిట్లకు ఛత్తీస్‌గఢ్‌కు తెలంగాణ డిస్కంలు రూ.7,719 కోట్లు చెల్లించాయి. ఇంకా రూ.1,081 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని డిస్కంలు చెబుతున్నాయి. కరెంటు సరఫరా(ట్రాన్స్‌మిషన్‌) లైన్‌ ఛార్జీలు రూ.1,362 కోట్లు దీనికి అదనం. ఇవన్నీ లెక్కిస్తే ఒక్కో యూనిట్‌ ఖర్చు రూ.5.64 అయిందని డిస్కంలు వెల్లడించాయి. ఒప్పందం ప్రకారం రూ.3.90 చొప్పున చెల్లించాల్సిన ధరతో పోలిస్తే దాదాపు రూ.3,110 కోట్ల అదనపు భారం పడిందని తెలిపాయి. బకాయిలపై రెండు రాష్ట్రాల విద్యుత్‌ సంస్థల మధ్య వివాదం ఇంకా తేలలేదు. రూ.1,081 కోట్ల బకాయిలున్నట్లు తెలంగాణ డిస్కంలు చెపుతుండగా..రూ.1,715 కోట్లు ఇవ్వాలని ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్తు సంస్థలు చెబుతున్నాయి. ఈ సొమ్మును తెలంగాణ డిస్కంల నుంచి ఇప్పించాలని ‘విద్యుత్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌’లో పిటిషన్‌ కూడా దాఖలు చేశాయి.

2017 ఆఖర్లో ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణకు కరెంటు సరఫరా ప్రారంభమైంది. పీపీఏలో పేర్కొన్న వెయ్యి మెగావాట్లు ఎన్నడూ పూర్తిగా సరఫరా కాలేదు. బకాయిల చెల్లింపులపై వివాదంతో 2022 ఏప్రిల్‌ నుంచి సరఫరా నిలిచిపోయింది. ఒప్పందం ప్రకారం 2017 నుంచి 2022 మధ్యకాలంలో సైతం పూర్తిస్థాయిలో కరెంటు రాకపోవడంవల్ల రూ.2,083 కోట్లు చెల్లించి బహిరంగ మార్కెట్లో కొనాల్సి వచ్చిందని తెలంగాణ డిస్కంలు తెలిపాయి. 

రూ.261 కోట్లు కట్టాలని నోటీసు ఇచ్చిన పీజీసీఐఎల్‌ 

‘ఛత్తీస్‌గఢ్‌ నుంచి కరెంటు తెచ్చుకునేందుకు పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ (పీజీసీఐఎల్‌)తో 1,000 మెగావాట్ల సరఫరాకు లైన్‌ కారిడార్‌ను అద్దెకు తీసుకునేందుకు తెలంగాణ డిస్కంలు రిజర్వు చేసుకోవాల్సి వచ్చింది. ఈ అద్దె భారం కూడా విద్యుత్తు సంస్థలపై పడింది. లైన్‌ బుకింగ్‌ ఒప్పందం ప్రకారం కరెంటు తెచ్చుకున్నా.. తెచ్చుకోకపోయినా పీజీసీఐఎల్‌కు ఛార్జీలు కట్టాల్సిందే. ఈ లెక్కన కరెంటు రాకున్నా రూ.638 కోట్ల అదనపు ఛార్జీలు కట్టారు. దీనికితోడు మరో 1000 మెగావాట్ల సరఫరాకు అడ్వాన్సుగా కారిడార్‌ను గత ప్రభుత్వం రిజర్వు చేసింది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి అదనంగా మరో వెయ్యి మెగావాట్ల కరెంటు లభించే అవకాశం లేకపోవడంతో ఈ కారిడార్‌ను ఆ తర్వాత రద్దు చేసుకుంది. ఈలోగా జరగాల్సినంత నష్టం జరిగింది. ముందుగా రిజర్వు చేసుకున్నందువల్ల పరిహారం కింద రూ.261 కోట్లు కట్టాలని డిస్కంలకు పీజీసీఐఎల్‌ నోటీసులు జారీ చేసింది. కారిడార్‌ రిజర్వు ఒప్పందం హడావుడిగా చేసుకోవటం వల్లే ఈ అదనపు చెల్లింపుల సమస్య తలెత్తింది’ అని జ్యుడిషియల్‌ కమిషన్‌కు డిస్కంలు తెలిపాయి.


ఈఆర్‌సీ తుది ఆమోదం లేదు..

ఛత్తీస్‌గఢ్‌ కరెంటు కొనుగోలులో ఎలాంటి లొసుగులు లేవని, అంతా పారదర్శకంగా జరిగిందని, పైగా ఆ పీపీఏను ‘రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి’(ఈఆర్‌సీ) ఆమోదించిందని కేసీఆర్‌ తన లేఖలో పేర్కొన్నారు. అయితే ఛత్తీస్‌గఢ్‌ కరెంటు కొనుగోలు ఒప్పందానికి ఇంతవరకూ తెలంగాణ ఈఆర్‌సీ తుది ఆమోదముద్ర వేయలేదని విద్యుత్‌ పంపిణీ సంస్థలు తెలిపాయి. ‘తొలుత చేసుకున్న పీపీఏపై తెలంగాణ ఈఆర్‌సీ ‘మధ్యంతర ఉత్తర్వు’(ఇంటరిమ్‌ ఆర్డర్‌) మాత్రమే జారీ చేసింది. దీనిపై డిస్కంలు మళ్లీ పిటిషన్‌ వేసి.. తుది ఆమోదం పొందాలి. కానీ, 2017 నుంచి ఇప్పటివరకూ డిస్కంలు ఆ పని చేయలేదు. తుది ఆమోదం తెలుపుతూ తెలంగాణ ఈఆర్‌సీ ఉత్తర్వులు జారీ చేయనందువల్ల ఛత్తీస్‌గఢ్‌ కరెంటు కొనుగోలుకు చేసిన చెల్లింపులన్నీ అడ్డదారిలో జరిగినట్లుగానే పరిగణించాలి. పైగా ఈ చెల్లింపులతో డిస్కంలకు రూ.6 వేల కోట్ల నష్టం వాటిల్లింది’ అని డిస్కంలు పేర్కొన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని