Basara RGUKT: ఆర్‌జీయూకేటీలో సీట్లు, పోస్టులు ఖాళీ

బాసర ఆర్‌జీయూకేటీ నుంచి పలువురు విద్యార్థులు బయట కళాశాలలకు వెళ్లిపోతుండగా.. ఖాళీ అయిన ఆ సీట్లను వర్సిటీ అధికారులు భర్తీ చేయటం లేదు.

Published : 24 Jun 2024 03:11 IST

ఇంటర్‌ తరువాత బీటెక్‌లో చేరకుండా వెళ్లిపోతున్న విద్యార్థులు
ఏటా 300 సీట్లు ఖాళీగానే వదిలేస్తున్న అధికారులు
మూడు నెలలైనా శాశ్వత డైరెక్టర్‌ నియామకం లేదు

ఈనాడు, హైదరాబాద్‌: బాసర ఆర్‌జీయూకేటీ నుంచి పలువురు విద్యార్థులు బయట కళాశాలలకు వెళ్లిపోతుండగా.. ఖాళీ అయిన ఆ సీట్లను వర్సిటీ అధికారులు భర్తీ చేయటం లేదు. ఏటా బీటెక్‌లో 200 నుంచి 300 సీట్లు ఖాళీగా ఉంటున్నా పట్టించుకోవడం లేదు. వర్సిటీ ప్రారంభించిన 2008, 2009 సంవత్సరాల్లో బాసర ప్రాంగణంలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌లో 2 వేల సీట్లు ఉండేవి. తొలి రెండేళ్లపాటు ఇంటర్, ఆ తర్వాత నాలుగేళ్లు బీటెక్‌ చదువుతారు. మౌలిక వసతుల కొరత కారణంగా 2010లో సీట్లను వెయ్యికి కుదించారు. 2017-18 వరకు ఆ సంఖ్యే ఉండేది. 2018-19 విద్యాసంవత్సరం నుంచి 1500 వరకు ప్రవేశాలు పెంచారు.  

మాటలకే పరిమితమైన లేటరల్‌ ఎంట్రీ విధానం 

ఇక్కడ ఇంటర్‌ ఉత్తీర్ణులైన వారందరికీ బీటెక్‌లో సీఎస్‌ఈ, ఐటీ గ్రూపుల్లో సీట్లు దొరక్కపోవడంతో ఎప్‌సెట్‌ రాసి ఇతర ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చేరుతున్నారు. ఇలా ఏటా 200 నుంచి 300 మంది వెళ్లిపోతున్నారు. ఖాళీ సీట్లను లేటరల్‌ ఎంట్రీ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌ పూర్తిచేసిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు తీసుకొని మెరిట్‌ ఆధారంగా భర్తీ చేస్తామని, అవసరమైతే కొంత ఫీజు అధికంగా వసూలు చేస్తామని గత ఏడాది ఇన్‌ఛార్జి వీసీ వెంకటరమణ చెప్పారు. అది ఈ ఏడాది కూడా అమల్లోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. బీటెక్‌ తొలి ఏడాదిలో చేరిన తర్వాత కొందరు విద్యార్థులు బయటకు వెళుతున్నారని వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి.

ఖాళీ అయితే ఇక భర్తీ లేదు

తెలంగాణ ఏర్పాటు నుంచీ ఈ విశ్వవిద్యాలయానికి కులపతి, శాశ్వత ఉపకులపతి లేరు. ఇన్‌ఛార్జులే ఉన్నారు. చిన్నచిన్న సమస్యలు కూడా పరిష్కరించే వారు లేక 2022 మే నెలలో విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. దీంతో ప్రభుత్వం ఓయూ ఆచార్యుడు సతీష్‌కుమార్‌ను డైరెక్టర్‌గా నియమించింది. ఆ తర్వాత ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడిగా ఉన్న వెంకటరమణను ఇన్‌ఛార్జి వీసీగా నియమించింది. రెండేళ్లు గడవక ముందే గత మార్చిలో సతీష్‌కుమార్‌ను తొలగించారు. మూడు నెలలైనా ఆ పోస్టులో మరొకరిని నియమించలేదు. వర్సిటీలో శాశ్వత బోధన సిబ్బందే 19 మంది ఉండగా.. సీఎస్‌ఈ విభాగం సహాయ ఆచార్యురాలు సృజనను ప్రత్యేక అధికారిణి(ఎస్‌ఓ)గా నియమించి డైరెక్టర్‌గా ప్రత్యామ్నాయమని చెబుతున్నారు. పరిపాలన అధికారి(ఓఏ) పోస్టు కూడా ఖాళీగా ఉంది. కీలక పోస్టుల్లో విశ్రాంత ఉద్యోగులను నియమించడం గమనార్హం. ఫలితంగా విద్య, పరిపాలనపరమైన పర్యవేక్షణ దిగజారుతోందన్న విమర్శలు వస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని