Rythu Bharosa: ఎకరాల పరిమితిపై అభిప్రాయ సేకరణ

పంటలు సాగయ్యే భూముల్లో ఎన్ని ఎకరాలకు రైతు భరోసా అందించాలనే దానిపై రైతులతో సమావేశాలు నిర్వహించి నిర్ణయించాలని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం స్పష్టం చేసింది.

Published : 06 Jul 2024 03:08 IST

మంత్రుల ఆధ్వర్యంలో 11 నుంచి రైతులతో సమావేశాలు
రైతు భరోసాపై మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం


రైతు భరోసా సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి, మంత్రులు పొంగులేటి, తుమ్మల, శ్రీధర్‌బాబు  

ఈనాడు, హైదరాబాద్‌: పంటలు సాగయ్యే భూముల్లో ఎన్ని ఎకరాలకు రైతు భరోసా అందించాలనే దానిపై రైతులతో సమావేశాలు నిర్వహించి నిర్ణయించాలని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం స్పష్టం చేసింది. ఈనెల 11 నుంచి 16 వరకు జిల్లా మంత్రుల ఆధ్వర్యంలో రోజుకు 3 సమావేశాల చొప్పున రైతులతో నిర్వహించాలంది. స్థిరాస్తి, బంజరు, ఇతర సేద్య యోగ్యం గాని భూములకు సాయం ఇవ్వరాదని పేర్కొంది. రైతుల అభిప్రాయాలతో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన శుక్రవారం రైతుభరోసా మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో సమావేశమైంది. సభ్యులైన రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ముఖ్యకార్యదర్శి సందీప్‌ సుల్తానియా, వ్యవసాయ కార్యదర్శి రఘునందన్‌రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు ఇప్పటివరకు అమల్లో ఉన్న రైతుబంధు పథకం తీరుపై దృశ్యరూపక ప్రదర్శన ఇచ్చారు. 

 93 శాతం మంది అయిదెకరాల లోపువారు 

రైతుబంధు సాయం 68 శాతం సాగు భూములకు దక్కగా.., 32 శాతం సాగేతర భూముల వారు పొందుతున్నారని అధికారులు తెలిపారు. 12 విడతలలో దాదాపు రూ.25,670 కోట్ల నిధులు వారికి దక్కాయన్నారు. రాష్ట్రంలో 93 శాతం మంది అయిదెకరాల్లోపు చిన్న, సన్నకారు రైతులున్నారని తెలిపారు. భూముల సాగుదారుల్లో 17.5 శాతం కౌలు రైతులని వెల్లడించారు. ఇప్పటికే రైతు వేదికల ద్వారా రైతుల నుంచి వచ్చిన అభిప్రాయాలను వివరించారు. కొందరు అయిదెకరాలు, మరికొందరు పదెకరాలు, ఇంకొందరు అంతకంటే ఎక్కువ పరిమితి ఉండాలన్నారని తెలిపారు. కౌలుదారులకు రైతు భరోసా వర్తింపుపైనా కొంత సానుకూలత, మరికొంత వ్యతిరేకత వచ్చిందన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ, డీసీసీబీ ఛైర్మన్లు ఇతర ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ ఉద్యోగులకు రైతు భరోసాను మినహాయించాలని కోరారని వెల్లడించారు. ఆదాయ పరిమితిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని అధికారులు ఉపసంఘానికి తెలిపారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడుతూ, ఇకపై సాగు భూములకే సాయం అందాలని స్పష్టం చేశారు. ఎకరాల పరిమితిపై రైతుల సూచనల మేరకు నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఈనెల 16న మరో దఫా మంత్రివర్గ ఉపసంఘం సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని