NTPC Power: జులై ఆఖరులోగా తేల్చండి

విభజన చట్టం ప్రకారం రామగుండంలో తెలంగాణ కోసం ప్రత్యేకంగా ఎన్టీపీసీ నిర్మించే 2,400 మెగావాట్ల విద్యుత్కేంద్రం కరెంటు కావాలా.. వద్దా.. అనేది జులై ఆఖరులోగా తేల్చిచెప్పాలని కేంద్ర విద్యుత్‌శాఖ కొత్త మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ రాష్ట్ర విద్యుత్‌శాఖకు సూచించారు.

Published : 17 Jun 2024 02:57 IST

ఎన్టీపీసీ నుంచి 2,400 మెగావాట్ల కరెంటు కావాలా వద్దా!
రాష్ట్ర విద్యుత్‌శాఖకు కేంద్ర మంత్రి ఖట్టర్‌ ప్రశ్న

రామగుండంలో తెలంగాణ కోసం ప్రత్యేకంగా నిర్మించిన 1,600 మెగావాట్ల ప్లాంటు. దీని పక్కనే కొత్త ప్లాంటు నిర్మించాల్సి ఉంది

ఈనాడు, హైదరాబాద్‌: విభజన చట్టం ప్రకారం రామగుండంలో తెలంగాణ కోసం ప్రత్యేకంగా ఎన్టీపీసీ నిర్మించే 2,400 మెగావాట్ల విద్యుత్కేంద్రం కరెంటు కావాలా.. వద్దా.. అనేది జులై ఆఖరులోగా తేల్చిచెప్పాలని కేంద్ర విద్యుత్‌శాఖ కొత్త మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ రాష్ట్ర విద్యుత్‌శాఖకు సూచించారు. దేశవ్యాప్తంగా థర్మల్‌ విద్యుత్కేంద్రాల నిర్మాణంపై ఆయన తాజాగా దిల్లీలో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించే కొత్తప్లాంటు గురించి లోతుగా చర్చ జరిగింది. వాస్తవానికి ఈ ప్లాంటు ఎన్టీపీసీ నిర్మించే కొత్తవాటి జాబితాలో తొలుత లేదు. ఉమ్మడి ఏపీ విభజన చట్టం ప్రకారం 4 వేల మెగావాట్ల ప్లాంటును తెలంగాణ కోసం ప్రత్యేకంగా నిర్మించాల్సి ఉంది. ఇప్పటికే 1,600 మెగావాట్ల ప్లాంటును ‘తెలంగాణ విద్యుత్కేంద్రం’ పేరుతో రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించింది. దీన్నుంచి రోజుకు 3 కోట్ల యూనిట్ల కరెంటును తెలంగాణ సరఫరా చేస్తోంది. మిగిలిన 2,400 మెగావాట్ల ప్లాంటును కూడా నిర్మించనున్నామని, దీన్నుంచి ‘విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం (పీపీఏ)’ చేసుకుంటారా.. లేదా.. చెప్పాలని గతంలో ఎన్టీపీసీ తెలంగాణ విద్యుత్‌శాఖకు లేఖ రాసింది. దీనిపై రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్నతాధికారులతో ఇటీవల చర్చించింది. ఎన్టీపీసీ కొత్తగా నిర్మించే ప్లాంటు వ్యయం అధికంగా ఉంటుందని, అక్కడ కరెంటు ఉత్పత్తి ప్రారంభమయ్యే సరికి మరో నాలుగైదేళ్లు పడుతుందని, అప్పటికి తెలంగాణలో దాని అవసరం పెద్దగా ఉండదని రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్‌శాఖ అధికారులు నివేదించారు. 2030-31 నాటికి తెలంగాణకు 14 వేల మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ అవసరమని అప్పటికి 13,800 మెగావాట్లు అందుబాటులో ఉంటుందని వారు వివరించినట్లు తెలుస్తోంది. మిగిలిన 200 మెగావాట్లను బయటి మార్కెట్‌లో కొనుగోలు చేసుకోవచ్చని, లేదా ఇతర మార్గాల్లో ఉత్పత్తి చేసుకోవచ్చని సూచించినట్లు సమాచారం. ఎన్టీపీసీ నిర్మించే 2,400 మెగావాట్ల ప్లాంటు నిర్మాణ వ్యయం సగటున మెగావాట్‌కు ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే నాలుగేళ్ల తర్వాత రూ.11 కోట్లకు మించిపోయే అవకాశాలున్నాయి. ఉత్పత్తి వ్యయం ఒక యూనిట్‌కు రూ.8 నుంచి 9 వరకూ కావచ్చని రాష్ట్ర విద్యుత్‌ ఇంజినీర్ల అంచనా. బహిరంగ మార్కెట్‌లో అంతకన్నా తక్కువ ధరకే కరెంటు లభిస్తుందని, ఈ ధరకు కొంటామని ఎన్టీపీసీతో పీపీఏ చేసుకుంటే రాబోయే పాతికేళ్ల పాటు భారం పడుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీపీసీ ప్లాంటు నుంచి కరెంటు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకూ సుముఖత తెలపలేదు. అలాగని కేంద్ర విద్యుత్‌శాఖకు అధికారికంగా లేఖ ఏమీ రాయలేదు. ఈ నేపథ్యంలో కొత్తగా కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఖట్టర్‌ ఎన్టీపీసీ ప్లాంట్ల నిర్మాణంపై దిశానిర్దేశం చేశారు. తెలంగాణ రాష్ట్రం వద్దంటే రామగుండంలో నిర్మించే 2,400 మెగావాట్ల ప్లాంటు నుంచి కరెంటును ఇతర రాష్ట్రాలకు అమ్మడానికి ఏర్పాట్లు చేయాలని కేంద్ర విద్యుత్‌శాఖ యోచిస్తోంది. సాధారణంగా ఎన్టీపీసీ ఎక్కడైనా విద్యుత్‌ ప్లాంటు నిర్మిస్తే ఆ ప్రాంతం ఉన్న రాష్ట్రానికే అందులో కొంత కరెంటు ఇస్తుంది. ఈ లెక్కన చూసినా 2,400 మెగావాట్ల ప్లాంటులో 1,000 మెగావాట్ల వరకూ తెలంగాణ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. విభజన చట్టం కింద వద్దంటే.. సాధారణ నిబంధన కింద కొంత ఎటూ వస్తుందని, దానిని తీసుకోవచ్చని రాష్ట్ర విద్యుత్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యుత్‌శాఖ కేంద్రానికి ఏం సమాధానం చెబుతుందో వేచి చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని