TG News: వైద్యుల మధ్య బదిలీల ఘర్షణ

రాష్ట్రంలోని బోధనాసుపత్రుల్లో వైద్యుల బదిలీల అంశం సంఘాల మధ్య ఘర్షణకు దారితీసింది. శుక్రవారం వైద్య విద్య డైరెక్టరేట్‌(డీఎంఈ) కార్యాలయంలోనే జరిగిన దాడి ఘటన వైద్య, ఆరోగ్యశాఖలో కలకలం రేపింది.

Published : 06 Jul 2024 03:22 IST

తనపై దాడి చేశారని నాగర్‌కర్నూల్‌ బోధనాసుపత్రి ప్రొఫెసర్‌ శేఖర్‌ ఫిర్యాదు 
ఆయనపైనా టీజీజీడీఏ ప్రతినిధుల ఫిర్యాదు

తనపై దాడికి పాల్పడిన వైద్యులపై చర్యలు తీసుకోవాలంటూ డీఎంఈ కార్యాలయం ఎదుట బైఠాయించిన వి.శేఖర్‌ (మధ్యలో) 

సుల్తాన్‌బజార్, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని బోధనాసుపత్రుల్లో వైద్యుల బదిలీల అంశం సంఘాల మధ్య ఘర్షణకు దారితీసింది. శుక్రవారం వైద్య విద్య డైరెక్టరేట్‌(డీఎంఈ) కార్యాలయంలోనే జరిగిన దాడి ఘటన వైద్య, ఆరోగ్యశాఖలో కలకలం రేపింది. తనపై తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం(టీజీజీడీఏ) ప్రతినిధులు దాడిచేసి గాయపరిచినట్లు నాగర్‌కర్నూల్‌ బోధనాసుపత్రిలో ఆర్థోపెడిక్‌ విభాగాధిపతి ప్రొఫెసర్‌ వి.శేఖర్‌ హైదరాబాద్‌లోని సుల్తాన్‌బజార్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శేఖర్‌పై టీజీజీడీఏ ప్రతినిధులు కూడా అదే స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

హైదరాబాద్‌లో బోధనాసుపత్రుల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో బోధనాసుపత్రుల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యుల మధ్య వివాదం కొనసాగుతోంది. తమను హైదరాబాద్‌కు బదిలీ కాకుండా అడ్డుకుంటున్నారని జిల్లాల్లోని బోధనాసుపత్రి వైద్యులు ఆరోపిస్తున్నారు. ఈక్రమంలో జిల్లాల్లోని బోధనాసుపత్రుల వైద్యుల ఐకాస ప్రతినిధి శేఖర్‌తో పాటు మరికొందరు వైద్యులు శుక్రవారం డీఎంఈ వాణిని కలిసేందుకు కోఠి డీఎంహెచ్‌ఎస్‌లోని కార్యాలయంలోకి వెళ్తున్నారు. అదే సమయంలో టీజీజీడీఏ వైద్యుల బృంద సభ్యులు డీఎంఈని కలిసి వెలుపలికి వస్తున్నారు. రెండు బృందాలు పరస్పరం ఎదురుపడటంతో వాగ్వాదం జరగ్గా ఘర్షణ చోటుచేసుకుంది. జిల్లాల్లోని బోధనాసుపత్రుల వైద్యుల బృందం డీఎంఈని కలిసేందుకు వెళ్తుండగా టీజీజీడీఏ ప్రతినిధులు అడ్డుకుని తనపై దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ డీఎంఈ కార్యాలయం ఎదుట బైఠాయించి తనపై దాడికి పాల్పడిన వారిని సస్పెండ్‌ చేయాలని శేఖర్‌ డిమాండ్‌ చేశారు. ఆయన మాట్లాడుతూ సాధారణ బదిలీలపై నిషేధం ఎత్తివేయడంతో డీఎంఈని కలిసి కృతజ్ఞతలు తెలిపి, బదిలీలు పారదర్శకంగా నిర్వహించాలని, ఏళ్ల తరబడి జిల్లాల్లో పనిచేస్తున్న వారికి అవకాశం కల్పించాలని కోరేందుకు వెళ్తుండగా టీజీజీడీఏ ఆఫీస్‌ బేరర్లు ప్రొఫెసర్‌ బొంగు రమేశ్, ఇతర వైద్యులు పల్లం ప్రవీణ్‌కుమార్, భూపేందర్‌ రాథోడ్, వినోద్‌కుమార్‌లు తనపై గ్లాసుతో దాడి చేయడంతో మెడపై గాయమైందని పేర్కొన్నారు. వారిపై శాఖాపరంగా చర్యలు తీసుకోవాలని డీఎంఈని కోరారు. అనంతరం సుల్తాన్‌బజార్‌ పోలీసులకు శేఖర్‌ ఫిర్యాదు చేశారు. స్వల్ప ఘర్షణ జరిగింది తప్ప శేఖర్‌పై తాము దాడికి పాల్పడలేదని, తమపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ శేఖర్‌ను సస్పెండ్‌ చేయాలని టీజీజీడీఏ ప్రతినిధులు బొంగు రమేశ్, పల్లం ప్రవీణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. అనంతరం శేఖర్‌పై సుల్తాన్‌బజార్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇరువర్గాల ఫిర్యాదులను స్వీకరించి.. శేఖర్‌ను వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని