CM KCR: కలసి పోరాడదాం

సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల హక్కులను హరించేలా.. ఏకపక్ష ధోరణిని అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై పోరాడాలని, దక్షిణాది వాణిని బలంగా వినిపించాలని తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ...

Updated : 15 Dec 2021 16:48 IST

రాష్ట్రాల హక్కులపై దక్షిణాదివాణిని బలంగా వినిపిద్దాం
కేసీఆర్‌, స్టాలిన్‌ ఏకాభిప్రాయం
గంటసేపు ఏకాంత చర్చ
తమిళనాడు సీఎం ఇంటికి కుటుంబ సమేతంగా కేసీఆర్‌

ఈనాడు- హైదరాబాద్‌, చెన్నై: సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల హక్కులను హరించేలా.. ఏకపక్ష ధోరణిని అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై పోరాడాలని, దక్షిణాది వాణిని బలంగా వినిపించాలని తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, స్టాలిన్‌లు నిర్ణయించారని తెలిసింది. భాజపా వ్యతిరేక కూటమి, రూపకల్పనలో క్రియాశీలకంగా వ్యవహరించాలని ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. తమిళనాడు పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, తన తనయుడు, మంత్రి కేటీఆర్‌తో కుటుంబ సమేతంగా మంగళవారం సాయంత్రం చెన్నై ఆళ్వారుపేటలోని స్టాలిన్‌ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్‌, కేటీఆర్‌లను సత్కరించారు. కేసీఆర్‌ సతీమణి శోభ, కేటీఆర్‌ సతీమణి శైలిమ, పిల్లలు హిమాన్ష్‌, అలేఖ్య, ఎంపీ సంతోష్‌కుమార్‌లు... స్టాలిన్‌ భార్య, ఇతర కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. కేసీఆర్‌ కుమారుడు కేటీఆర్‌, స్టాలిన్‌ కుమారుడు ఉదయనిధి ఆప్యాయంగా పలకరించుకున్నారు. సీఎంల భేటీలో తమిళనాడు పరిశ్రమల శాఖామంత్రి తంగం తెన్నరసు కూడా ఉన్నారు. అనంతరం ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏకాంతంగా భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం సంబంధాలు, దాని వైఖరి, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. దక్షిణాది అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి.

రాష్ట్రాలను విస్మరిస్తున్న కేంద్రం!
భాజపా ప్రభుత్వం రాష్ట్రాలను విస్మరిస్తోందని, పన్నుల వాటాల తగ్గింపు, రాష్ట్రాల ప్రయోజనాలకు విరుద్ధంగా సెస్సుల విధింపు, నీతి ఆయోగ్‌ సిఫారసులను పట్టించుకోకపోవడం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల విక్రయాలను ఇద్దరూ తప్పుబట్టినట్లు తెలుస్తోంది. కరోనా టీకాల విషయంలో వైఫల్యం, పెట్రో ఉత్పత్తులు, గ్యాస్‌ ధరల పెంపు వంటి వాటిని విమర్శించారు. కేంద్ర ఉద్యోగాలకు పోటీ పరీక్షలను హిందీ, ఆంగ్లంలో నిర్వహిస్తూ, దక్షిణాది భాషలను విస్మరించడం, నీట్‌పై ధోరణి, సీబీఎస్‌ఈ సిలబస్‌లో మార్పులను స్టాలిన్‌ తప్పుబట్టగా... వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని కేసీఆర్‌ వెల్లడించారు. ‘‘విభజన చట్టంలో హామీలను నెరవేర్చలేదు. ఒక్క ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇవ్వలేదు. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి వంటి బకాయిలు చెల్లించలేదు. ఉప్పుడు బియ్యం కొనేది లేదని తెలిపి, అన్నదాతలకు ఇబ్బందులు తెచ్చింది. సీఎంగా నేను లేఖ రాసినా.. కేంద్ర మంత్రులను కలిసినా స్పందనలేదు’’ అని కేసీఆర్‌ వివరించారు. భాజపాను ఎదుర్కొనేందుకు బలమైన కూటమి అవసరమనే అభిప్రాయానికి ఇద్దరు సీఎంలు వచ్చారు. దీనిపై జాతీయస్థాయిలో కార్యాచరణ గురించి మాట్లాడారని తెలుస్తోంది.

రిజర్వేషన్లపై తీర్మానం చేసినా స్పందన లేదు
తమిళనాడులో అమలు చేస్తున్న 69 శాతం రిజర్వేషన్ల ప్రక్రియ గురించి కేసీఆర్‌ చెబుతూ, తాము రిజర్వేషన్లను పెంచాలనే ఉద్దేశంతో శాసనసభలో తీర్మానం చేసి పంపినా కేంద్రం స్పందించడం లేదన్నారు. గోదావరి, కావేరి నదుల అనుసంధానం అంశం సైతం ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.  తమిళనాడులో డీఎంకే సంస్థాగత నిర్మాణం గురించి కేసీఆర్‌ తెలుసుకున్నారు. త్వరలోనే తెరాస ప్రతినిధి బృందం తమిళనాడుకు వచ్చి డీఎంకే నేతలతో భేటీ అవుతుందని తెలిపారు. యాదాద్రి ఆలయ పునఃప్రారంభ వేడుకలకు రావాల్సిందిగా స్టాలిన్‌ను.. సీఎం కేసీఆర్‌ ఆహ్వానించారు. ఇరురాష్ట్రాల్లో అమలవుతున్న పథకాల గురించి చర్చించారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌, రైతుబంధు, రైతు బీమా తదితర పథకాలను స్టాలిన్‌ ప్రశంసించగా... తమిళనాడు పాలనలో తనదైన ముద్రను చాటుతున్నారని ఆయనకు కేసీఆర్‌ కితాబు ఇచ్చినట్లు తెలుస్తోంది.


కేసీఆర్‌తో అద్భుత సమావేశం: స్టాలిన్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో అద్భుత సమావేశం జరిగిందని స్టాలిన్‌ మంగళవారం ట్వీట్‌ చేశారు. ఆయన కేటీఆర్‌తో కలసి తమ ఇంటికి రావడం ఆనందాన్నిచ్చిందన్నారు. దీనిపై కేటీఆర్‌ ట్విటర్‌లో స్పందిస్తూ ఇద్దరు యోధుల సమావేశంలో తాను భాగస్వామి కావడం ఆనందంగా ఉందని చెప్పారు. ఆయన ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని