CM KCR: కేంద్రంతో చి‘వరి’గా తేల్చుకుంటాం

అన్ని రాష్ట్రాల నుంచి సేకరించినట్లే తెలంగాణ నుంచి వార్షిక ధాన్యం సేకరణ లక్ష్యం ఎంతో చెప్పాలని ఎన్నిసార్లు అడిగినా కేంద్రం స్పందించడంలేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. ఆలస్యమైతే రైతుల్లో అయోమయం నెలకొంటుందని.

Updated : 21 Nov 2021 04:26 IST

ధాన్యంపై ఎన్నిసార్లు అడిగినా కేంద్రం స్పందించలేదు
మంత్రులు, ఎంపీలు, అధికారులతో నేడు దిల్లీకి....
ప్రధానిని, కేంద్రమంత్రిని కలిసి స్పష్టత కోరతాం
వ్యవసాయ చట్టాల రద్దు రైతుల అద్భుత విజయం
ఆ ఉద్యమ అమరుల కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పున సాయం
కనీస మద్దతు ధర చట్టాన్నీ తీసుకురావాలి
వానాకాలంలో పండిన ప్రతిగింజా కొంటాం: సీఎం కేసీఆర్‌


సాగు చట్టాలపై కేంద్రానికి ఇప్పటికైనా జ్ఞానోదయం కావడం సంతోషం. విద్యుత్‌ చట్టం సవరణ బిల్లు విషయంలోనూ వెనక్కి తగ్గాలి. లేకపోతే ఉద్యమాలు తప్పవు.  

రైతుల విషయంలో కేంద్రం చాలా దుర్మార్గంగా వ్యవహరించింది. వ్యవసాయ చట్టాలు ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్రం ప్రకటించినా.. అయిదు రాష్ట్రాల ఎన్నికల స్టంట్‌ అనుకుంటున్నారు తప్ప దేశంలో ఎవరూ నమ్మడం లేదు. ఉద్యమంలో అమరులైన రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున రూ.3 లక్షల చొప్పున అందజేస్తాం. కేంద్రం రూ.25 లక్షల చొప్పున వారికి సాయం చేయాలి.


ఈనాడు, హైదరాబాద్‌: అన్ని రాష్ట్రాల నుంచి సేకరించినట్లే తెలంగాణ నుంచి వార్షిక ధాన్యం సేకరణ లక్ష్యం ఎంతో చెప్పాలని ఎన్నిసార్లు అడిగినా కేంద్రం స్పందించడంలేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. ఆలస్యమైతే రైతుల్లో అయోమయం నెలకొంటుందని.. చివరి ప్రయత్నంగా ఆదివారం మంత్రులు, ఎంపీలు, అధికారుల బృందంతో తాను దిల్లీకి వెళ్తున్నానని తెలిపారు. కేంద్ర వ్యవసాయ మంత్రిని, ప్రధాని మోదీని కలుస్తామని.. తాను రెండు, మూడు రోజులు దిల్లీలోనే ఉండి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తానని చెప్పారు. కేంద్రం ఉప్పుడు బియ్యం కొనేది లేదని చెప్పినట్లు గాలి వార్త వచ్చిందని.. అది అధికారికమా అనే విషయమూ తేల్చుకుంటామన్నారు. దిల్లీ నుంచి వచ్చిన తర్వాత యాసంగి పంటపై ప్రకటన చేస్తామన్నారు. కేంద్ర వ్యవసాయ చట్టాల రద్దు.. రైతుల అద్భుత విజయంగా సీఎం అభివర్ణించారు. దేశవ్యాప్తంగా పంటలకు కనీస మద్దతు ధర చట్టం తేవాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో వానాకాలంలో పండిన ప్రతి గింజనూ కొంటామని, రైతులు ఆందోళన చెందవద్దన్నారు. శనివారం సీఎం కేసీఆర్‌ తెలంగాణభవన్‌లో తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి సీఎం విలేకరులతో మాట్లాడారు.

‘‘ఒత్తిళ్లు, కేసులు, ప్రకృతి విపత్తులను తట్టుకొని దిల్లీలో ఆందోళనలు చేపట్టిన రైతాంగ పోరాటవీరులకు అభినందనలు. పోరాడిన వారిపై వేల కేసులు పెట్టారు. బెంగళూరుకు చెందిన దిశ అనే అమ్మాయి సంఘీభావంగా ట్వీట్‌ చేస్తే దేశద్రోహం కేసులు పెట్టారు. శషభిషలు లేకుండా ఇలాంటి కేసులు తక్షణమే ఎత్తేయాలని మేం ప్రధానిని డిమాండ్‌ చేస్తున్నాం.

అమరులకు నివాళులు..
ఉద్యమంలో 700 మందికిపైగా రైతులు మరణించారు. వారందరికీ సంఘీభావం ప్రకటిస్తున్నాం. ప్రధాని స్వయంగా క్షమాపణలు చెప్పారు. అలాగని క్షమాపణలతో చేతులు దులుపుకోవద్దు. వారి కుటుంబాలను ఆదుకునే బాధ్యత కేంద్రమే తీసుకోవాలి. మంత్రులు, అవసరమైతే నేనే స్వయంగా వెళ్లి వారి కుటుంబాలకు పరిహారం అందిస్తాం. అవమానాలు, నిర్బంధాలు తట్టుకొని జరిగిన సుదీర్ఘపోరాటంలో ఆత్మార్పణం చేసుకున్న అమరులకు నివాళులర్పిస్తున్నాం.

విద్యుత్తు చట్టం సవరణ బిల్లు విషయంలోనూ వెనక్కి తగ్గాలి
కొత్త విద్యుత్తు చట్టం సవరణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందే దశలో ఉన్నాయి. అదే జరిగితే దేశవ్యాప్తంగా మళ్లీ ఆందోళనలు మొదలవుతాయి. వాటిపైనా కేంద్రం వెనక్కి తగ్గాలి. అమలు చేయని రాష్ట్రాలకు నిధులు నిలిపేస్తామని ఒత్తిడి తెస్తున్నారు. ఇది నియంతృత్వ వైఖరి. అవసరమైతే మీ ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో అమలు చేసుకోండి. అందరిపై రుద్దే ప్రయత్నం చేయొద్దు. జబర్దస్తీగా బావులకు, బోర్లకు మీటర్లు పెట్టాలనడం దుర్మార్గ చర్య. పార్లమెంటులో తెరాస తరఫున వ్యతిరేకిస్తాం. పోరాటం చేస్తాం.

తీర్మానాల ఆమోదానికి ఎందుకీ జాప్యం?
శాసనసభలో ప్రజల ఆకాంక్షలకు సంబంధించి చాలా తీర్మానాలు చేశాం. తెలంగాణ ఏర్పాటయ్యాక గిరిజనుల శాతం పెరిగింది. తమిళనాడులా రిజర్వేషన్ల పెంపునకు అనుమతి ఇవ్వాలని అడిగితే.. కాలరాశారు. 2017 నుంచి ఇప్పటివరకు 50 లేఖలు రాశాం. ఎస్సీ వర్గీకరణపై శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపించాం. దాన్నీ పెండింగ్‌లో పెట్టారు. వీటన్నింటినీ తేల్చకపోతే హక్కుల సాధనకు ఉద్యమం చేస్తాం.

ఆత్మనిర్భర్‌ కృషి అవసరం
గతంలో కరోనాకు సంబంధించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధానికి కుండబద్దలు కొట్టిచెప్పాం. భారత్‌ గురించి మాట్లాడితే ఆత్మనిర్భర్‌ కృషి అవసరమని స్పష్టంచేశాం. అన్నింటికన్నా ముందు తినడానికి తిండి, తాగడానికి నీరు అవసరమని ప్రధానికి చెప్పాను. కనీస మద్దతు ధర చట్టం తేవాలి. దేశంలో ప్రజలకు ఆహార సరఫరా బాధ్యత కేంద్రానిదే. వరిధాన్యం సేకరణ కేంద్రం చేయాల్సిందే. పీడీఎస్‌ కింద తెలంగాణకే 25 లక్షల టన్నుల బియ్యం ఇస్తారు. రాష్ట్రంలో పండే వరిధాన్యంలో 60 లక్షల టన్నులు మనకే అవసరం పడుతుంది. ప్రైవేటులో మరో 10 లక్షల టన్నులు అవసరం. అందుకే వార్షిక లక్ష్యం సరిగా ఇవ్వాలని.. ఆప్రకారం పంటలు వేసుకుంటామని చెప్పాం.

నీటి వాటాలకు ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయండి
సెక్షన్‌ 3 కింద కొత్త రాష్ట్రాలకు అన్ని వాటాలు రావాలి. ఎనిమిది ఏళ్లు కావొస్తున్నా.. కృష్ణ, గోదావరి జలాల్లో తెలంగాణ నీటి వాటా తేల్చడం లేదు. ఈ సారి దిల్లీ వెళ్లినప్పుడు కేంద్ర జల్‌శక్తి మంత్రిని, అవసరమైతే ప్రధానిని దీనిపై కలిసి డిమాండ్‌ చేస్తాం. ట్రైబ్యునల్‌ను ఏర్పాటుచేసి 3-4 నెలల సమయంలోనే వాటాలను తేల్చేలా కాలపరిమితి విధించాలి. లేకపోతే కచ్చితంగా ప్రజాఉద్యమాలు లేవదీస్తాం. పార్లమెంటులో ఇతర రాష్ట్రాలను కలుపుకొని కొట్లాడతాం. 

* బీసీ జనగణన బ్రహ్మపదార్థం కాదు. ఇది సున్నిత సమస్య అని చెప్పడం తెలివి తక్కువతనం. దేశంలో కులాలున్నాయి.. వాటికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తున్నారు.. అలాంటప్పుడు దాచిపెట్టడం ఎందుకు..? రాబోయే జనగణనలో కులగణన చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నాం’’ అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని