CM KCR: డిమాండ్‌ ఉన్న పంటల్ని పండించాలి

రైతులు పంట మార్పిడిపై దృష్టిసారించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. వరికి ప్రత్యామ్నాయంగా మార్కెట్లో డిమాండ్‌ ఉన్న మినుములు, వేరుశనగ, పెసర, శనగ, పత్తి వంటి పంటలు పండించాలని సూచించారు.

Updated : 03 Dec 2021 05:52 IST

రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచన

విత్తనాలు, ఎరువుల కొరత రానీయబోమని వెల్లడి

వనపర్తి జిల్లా రంగాపూర్‌ సమీప పొలంలో వేరుశనగ పంటను పరిశీలించి రైతుతో 

మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌. పక్కన మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌

ఈనాడు డిజిటల్‌, మహబూబ్‌నగర్‌: రైతులు పంట మార్పిడిపై దృష్టిసారించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. వరికి ప్రత్యామ్నాయంగా మార్కెట్లో డిమాండ్‌ ఉన్న మినుములు, వేరుశనగ, పెసర, శనగ, పత్తి వంటి పంటలు పండించాలని సూచించారు. విత్తనాలు, ఎరువుల సరఫరాలో ఇబ్బందులు తలెత్తనీయబోమని హామీ ఇచ్చారు. వరి వేసి రైతులు ఇబ్బందులు పడొద్దన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆరుతడి పంటలపై దృష్టి సారించిందన్నారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి ఇటీవల మృతి చెందగా.. ఎమ్మెల్యేను, కుటుంబసభ్యులను పరామర్శించడానికి సీఎం గురువారం రోడ్డు మార్గంలో ఈ పట్టణానికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో ఆకస్మికంగా వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్‌, కొత్తకోట మండలం విలియంకొండ వద్ద ఆగారు. రంగాపూర్‌ వద్ద జాతీయ రహదారికి దగ్గర్లో సాగుచేసిన మినుము, వేరుశెనగ పంట పొలాలను పరిశీలించారు. అక్కడ ఉన్న రైతు మహేశ్వర్‌రెడ్డితో మాట్లాడారు. ఏ పంట సాగు చేశారు? ధర ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. ప్రత్యామ్నాయ పంటల్లో భాగంగా మినుము వేశానని, ఎకరాకు 8-12 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందని, ఈ పంటతో భూమి కూడా సారవంతమవుతుందని రైతు చెప్పారు. మద్దతు ధర రూ.6,300 ఉండగా.. బయట క్వింటా రూ.7 వేలు పలుకుతుందని తెలిపారు. అనంతరం వేరుశెనగ పంటను సీఎం పరిశీలించి రైతు రాములుతో మాట్లాడారు. క్వింటా ధర ఎంత ఉందని రైతును ప్రశ్నించగా.. మద్దతు ధర క్వింటాకు రూ.5,550 ఉండగా, మార్కెట్లో రూ.7 వేల వరకూ ఉందన్నారు. అనంతరం కొత్తకోట మండలం విలియంకొండ వద్ద ఆగి కల్లాల్లో ఆరబోసిన వరి ధాన్యాన్ని సీఎం పరిశీలించారు. పక్కనే సాగు చేసిన వేరుశెనగ పంటను పరిశీలించారు. మొక్కల్ని పెరికి వేరుశెనగ కాయలను పరిశీలించారు. పంట వివరాల్ని రైతు వెంకటయ్యని అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక తండావాసులు కేసీఆర్‌తో ఫొటోలు దిగారు.

గద్వాలలో వెంకట్రామిరెడ్డి చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న సీఎం కేసీఆర్‌. పక్కన ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి

అంతకుముందు గద్వాలలో ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి చిత్రపటానికి సీఎం పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఎమ్మెల్యే తల్లి రేవతిదేవిని ఓదార్చారు. సీఎం వెంట మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, అబ్రహాం, జైపాల్‌యాదవ్‌, రాజేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి ఉన్నారు. 

కాన్వాయ్‌ను అడ్డుకొనేందుకు బీజేవైఎం ప్రయత్నం.. 

సీఎం హైదరాబాద్‌ నుంచి గద్వాల వెళుతున్న సమయంలో మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల వద్ద కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు బీజేవైఎం కార్యకర్తలు ప్రయత్నించారు. పోలీసులు వారిని రోడ్డుపైకి రాకుండా అడ్డుకోగా.. ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని కార్యకర్తలు నినాదాలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని