CM Revanth Reddy: ఓఆర్‌ఆర్‌ యూనిట్‌గా విపత్తు నిర్వహణ

ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు లోపల ఉన్న నగరాన్ని ఓ యూనిట్‌గా తీసుకొని విపత్తు నిర్వహణ వ్యవస్థను పటిష్ఠంగా రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Updated : 16 Jun 2024 07:09 IST

అక్కడి సీసీ కెమెరాలన్నీ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం
ఎఫ్‌ఎం ద్వారా ట్రాఫిక్‌ అలర్ట్‌లు
వర్షాకాలంలో చేపట్టాల్సిన చర్యలపై పోలీసు అధికారులకు సీఎం రేవంత్‌ ఆదేశం

సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పొన్నం, శ్రీధర్‌బాబు, పొంగులేటి, ఉత్తమ్‌లకు కమాండ్‌
కంట్రోల్‌ సెంటర్‌  పనితీరును వివరిస్తున్న హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాసరెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు లోపల ఉన్న నగరాన్ని ఓ యూనిట్‌గా తీసుకొని విపత్తు నిర్వహణ వ్యవస్థను పటిష్ఠంగా రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. శనివారం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌తో కలిసి హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లోని పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను సీఎం సందర్శించారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు. ఓఆర్‌ఆర్‌పై ఉన్న సీసీ కెమెరాలన్నింటినీ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానించాలని ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఇక్కట్లు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎఫ్‌ఎం రేడియో ద్వారా ట్రాఫిక్‌ అలర్ట్‌లు చెబుతూ ప్రజలను అప్రమత్తం చేసే ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన మేరకు హోంగార్డుల నియామకాలు చేపట్టాలని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో వరద తీవ్రత ఎక్కువగా ఉండే 141 ప్రాంతాలను ఇప్పటికే గుర్తించామని పోలీసు అధికారులు వెల్లడించారు. వరద నివారణకు పటిష్ఠ చర్యలు చేపట్టినట్లు వివరించారు. రోడ్లపై నీరు నిలవకుండా వాటర్‌ హార్వెస్ట్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎంకు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాసరెడ్డి, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ ఉన్నారు.


కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ గురించి సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి,
ఉత్తమ్‌లకు వివరిస్తున్న పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ చౌహాన్‌. చిత్రంలో సీఎస్‌ శాంతికుమారి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని