CM Revanth Reddy: నేడు ప్రధానితో రేవంత్‌ భేటీ!

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నట్లు తెలిసింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను సైతం సీఎం కలిసే అవకాశమున్నట్లు సమాచారం.

Published : 04 Jul 2024 02:54 IST

హోం మంత్రి అమిత్‌ షాతోనూ..
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా పాల్గొనే అవకాశం

ఈనాడు, దిల్లీ: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నట్లు తెలిసింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను సైతం సీఎం కలిసే అవకాశమున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌పై కసరత్తు చేస్తున్న తరుణంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి, నిధులను కేటాయించాలని కోరారు. ఇక ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షాలను కలవడం ఒక్కటే మిగిలిందని, వారు ఎప్పుడు సమయమిస్తే అప్పుడు కలుస్తానని ఇటీవల మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ తెలిపారు. గురువారం జరిగే భేటీలో రాష్ట్రానికి ఇప్పటివరకు కేంద్రం అందించిన సాయానికి ధన్యవాదాలు తెలిపి, వచ్చే బడ్జెట్‌లో పొందుపరచాల్సిన అంశాలపై ఆయన ఇద్దరు నేతల దృష్టికి తీసుకెళ్లే అవకాశముంది. ఈ సమావేశంలో పాల్గొనడానికి ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క కూడా దిల్లీకి వస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు కూడా గురువారమే మోదీ, అమిత్‌షాలతో భేటీ అవుతున్నారు. విభజన సమస్యలపై ఇరురాష్ట్రాల సీఎంలు 6వ తేదీన హైదరాబాద్‌లో సమావేశం కావడానికి ముందు ఇద్దరూ దిల్లీలో ప్రధాని, హోంమంత్రులను కలవనుండటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అయితే... దిల్లీలోని సీఎం రేవంత్‌రెడ్డి కార్యాలయం ఈ భేటీ సమయాలను ఇంకా ధ్రువీకరించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని