CM Revanth Reddy: 2.70 లక్షల ఇళ్లు మంజూరు చేయండి

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిల్లీలో ఇద్దరు కేంద్రమంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలను విన్నవించారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ను కలిసి రాష్ట్రానికి 2.70 లక్షల పట్టణ ఇళ్లను మంజూరు చేయాలని, స్మార్ట్‌సిటీ పథకం కాలపరిమితిని మరో ఏడాది పొడిగించాలని కోరారు.

Updated : 25 Jun 2024 07:15 IST

2,450 ఎకరాల రక్షణ శాఖ భూములను అప్పగించండి
కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి వినతి

రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

ఈనాడు, దిల్లీ: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిల్లీలో ఇద్దరు కేంద్రమంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలను విన్నవించారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ను కలిసి రాష్ట్రానికి 2.70 లక్షల పట్టణ ఇళ్లను మంజూరు చేయాలని, స్మార్ట్‌సిటీ పథకం కాలపరిమితిని మరో ఏడాది పొడిగించాలని కోరారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తోనూ ఆయన భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో రోడ్ల విస్తరణ కోసం రక్షణ శాఖకు చెందిన 2,450 ఎకరాల భూమిని తెలంగాణకు అప్పగించాలని కోరారు. కాంగ్రెస్‌ ఎంపీల పదవీ ప్రమాణ కార్యక్రమంలో పాల్గొనడానికి దిల్లీకొచ్చిన ఆయన సోమవారం సాయంత్రం ఎంపీలను వెంటబెట్టుకొని ఇద్దరు కేంద్ర మంత్రులతో వేర్వేరుగా భేటీ అయ్యారు. ‘‘రాష్ట్రంలో మేం నిర్మించతలపెట్టిన 25 లక్షల ఇళ్లలో 15 లక్షల ఇళ్లు పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోకి వస్తాయి. వాటిని లబ్ధిదారులు చేపట్టే ఇళ్ల (బెనిఫిషియరీ లెడ్‌ కన్‌స్ట్రక్షన్‌) విధానంలో నిర్మిస్తాం. అందువల్ల ఆ ఇళ్లను ప్రధానమంత్రి ఆవాస యోజన కింద మంజూరు చేయాలి. ఇంటి నిర్మాణ వ్యయం నిధులనూ పెంచాలి. పీఎంఏవై(యూ) కింద ఇప్పటివరకు తెలంగాణకు 1,59,372 ఇళ్లు మంజూరు చేసి, రూ.2,390.58 కోట్లు గ్రాంటుగా ప్రకటించారు. వాటిలో ఇప్పటివరకు రూ.1,605.70 కోట్లు మాత్రమే విడుదల చేశారు. మిగతా నిధులనూ విడుదల చేయాలి. 

స్మార్ట్‌ సిటీ మిషన్‌ గడువు పొడిగించాలి

అలాగే స్మార్ట్‌ సిటీ మిషన్‌ కింద వరంగల్‌లో 45 పనులు పూర్తవగా... రూ.518 కోట్లతో చేపట్టిన 66 పనులు కొనసాగుతున్నాయి. కరీంనగర్‌లో 25 పనులు పూర్తవగా, రూ.287 కోట్ల వ్యయంతో చేపట్టిన 22 పనులు కొనసాగుతున్నాయి. పథకం కాలపరిమితి ఈ ఏడాది జూన్‌ 30తో ముగుస్తోంది. పనులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నందున అవి ముగిసే వరకు(2025 జూన్‌) పొడిగించాలి’’ అని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రి మనోహర్‌లాల్‌ను కోరారు. 

కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌కు జ్ఞాపికను అందజేస్తున్న
సీఎం రేవంత్‌రెడ్డి, చిత్రంలో ఎంపీలు సురేశ్‌ షెట్కార్, మల్లు రవి, బలరాం నాయక్, కడియం కావ్య 

ఆ భూముల బదులు... రక్షణ శాఖవి బదలాయించండి 

అనంతరం  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిశారు. అనేక సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ‘‘హైదరాబాద్‌తోపాటు నగరం చుట్టుపక్కల రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్ల నిర్మాణం తదితరాల కోసం రక్షణ శాఖ భూముల అవసరముంది. రావిర్యాలలో తెలంగాణకు చెందిన 2,462 ఎకరాల భూములను ఇమారత్‌ పరిశోధన కేంద్రం (ఆర్‌సీఐ) ఉపయోగించుకుంటోంది. అందుకు ప్రతిఫలంగా 2,450 ఎకరాల రక్షణ శాఖ భూములను మా రాష్ట్రానికి బదలాయించండి. వరంగల్‌కు సైనిక పాఠశాలను మంజూరు చేయాలి’’ అని కోరారు. ముఖ్యమంత్రి వెంట పార్లమెంటు సభ్యులు మల్లు రవి, రామసహాయం రఘురాంరెడ్డి, బలరాం నాయక్, సురేశ్‌ షెట్కార్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, కుందూరు రఘువీర్‌రెడ్డి, కడియం కావ్య, గడ్డం వంశీ, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌ యాదవ్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్‌రెడ్డి ఉన్నారు.


నీట్‌పై సిటింగ్‌ జడ్జితో దర్యాప్తు జరిపించాలి

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డిమాండ్‌

ఈనాడు, దిల్లీ : నీట్‌ పేపర్‌ లీకేజీ వ్యవహారంపై సుప్రీంకోర్టు సిటింగ్‌ న్యాయమూర్తితో దర్యాప్తు జరిపించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డితో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, పార్టీ నాయకుడు రాహుల్‌గాంధీని కలిసిన తర్వాత ఏఐసీసీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా నీట్‌పై విలేకరులు అడిగిన ప్రశ్నకు పై విధంగా స్పందించారు. ‘‘ఈ ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో ఘోరంగా విఫలమైంది. మరోవైపు దాని తప్పుల గురించి ప్రశ్నించేవారి గొంతు నొక్కాలని చూస్తోంది. పేపర్‌లీక్‌ ఈ ప్రభుత్వ చేతకానితనం. అందుకే దాన్ని సీబీఐకి అప్పగించి కేసును సమాధి చేయాలని చూస్తోంది. దానివల్లే మేం సిటింగ్‌ జడ్జితో దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు తప్పులు చేసి ఇరుక్కుపోయినా ప్రధానమంత్రి మౌనవ్రతంలోకి వెళ్లిపోతుంటారు. ఈసారి పేపర్‌ లీక్‌ కారణంగా కోట్ల మంది యువత రోడ్లపైకి వచ్చారు. వారికి భరోసా ఇవ్వాల్సిన ప్రధాని మోదీ నోరెత్తడంలేదు. కానీ నీట్‌ పరీక్ష పకడ్బందీగా నిర్వహించే గ్యారంటీ ఎక్కడికిపోయిందో ఆయన ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలి. కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న వారికి శిక్షపడేలా చూడాలి’’ అని డిమాండ్‌చేశారు.కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రిని కలిసి హైదరాబాద్‌ అభివృద్ధి, మూసీ రివర్‌ఫ్రంట్, మెట్రో రైల్, పట్టణ పేదలకు ఇళ్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశామన్నారు. వచ్చే బడ్జెట్‌లో తెలంగాణ అభివృద్ధికి నిధులు కేటాయించాలని గుర్తుచేశామన్నారు. ప్రధానమంత్రి పదేపదే 5 ట్రిలియన్‌ ఆర్థిక వ్యవస్థ అని మాట్లాడుతున్నారని, దేశం ఆ స్థితికి చేరాలంటే అయిదు మెట్రోపాలిటన్‌ నగరాల్లో ఒకటైన హైదరాబాద్‌ అభివృద్ధికి, అక్కడి మెట్రోరైల్‌కు నిధులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దేశంలో ప్రతి రాష్ట్రానికీ సైనిక్‌ స్కూళ్లు ఇచ్చారని, యూపీలో 3, ఏపీలో 2 సైనిక్‌స్కూళ్లు ఉన్నాయని, తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదన్నారు. పదేళ్లలో కేసీఆర్‌ దాని గురించి అడగనూలేదు, మోదీ ఇవ్వనూ లేదని ఎద్దేవాచేశారు. అందుకే రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి తెలంగాణ విద్యార్థులకోసం సైనిక్‌స్కూల్‌ ఇవ్వాలని కోరామని, ఆయన ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని