Coal Mines: శ్రావణపల్లి దక్కేనా?

దేశవ్యాప్తంగా కొత్త గనుల వేలానికి కేంద్ర బొగ్గు గనుల శాఖ రంగం సిద్ధం చేస్తోంది. ఈ నెల 21న లేదా ఆ తర్వాత హైదరాబాద్‌లో ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభించింది.

Published : 19 Jun 2024 06:09 IST

హైదరాబాద్‌లో తొలిసారి బొగ్గు గనుల వేలం
21న లేదా ఆ తర్వాత ప్రారంభం..
పాల్గొనేందుకు సింగరేణి సంస్థ సన్నాహాలు

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా కొత్త గనుల వేలానికి కేంద్ర బొగ్గు గనుల శాఖ రంగం సిద్ధం చేస్తోంది. ఈ నెల 21న లేదా ఆ తర్వాత హైదరాబాద్‌లో ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. కేంద్ర బొగ్గుశాఖ మంత్రిగా రాష్ట్రానికి చెందిన కిషన్‌రెడ్డి ఇటీవల పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు బొగ్గు గనుల వేలం పాటలను దేశంలో ఒక్కో నగరంలో నిర్వహిస్తూ వచ్చారు. ఈసారి హైదరాబాద్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈసారి దేశవ్యాప్తంగా వేలం వేయనున్న గనుల్లో సింగరేణి ప్రాంతంలోని శ్రావణపల్లి బొగ్గు గని కూడా ఉంది. ఇందులో 11.99 కోట్ల టన్నుల నిల్వలున్నట్లు, సింగరేణి నిర్వహించిన భూగర్భ సర్వేలో తేలింది. ఇది చేజారితే భవిష్యత్తులో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర విఘాతం కలుగుతుందని ఈ సంస్థ భావిస్తోంది. దీనికోసం తొలిసారి గనుల వేలంలో పాల్గొని, దక్కించుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. సింగరేణి గతంలో ఎన్నడూ వేలంలో పాల్గొనలేదు. తెలంగాణలోని కొత్త గనులను వేలంతో సంబంధం లేకుండా నేరుగా కేటాయించాలని గతంలో పలుమార్లు కేంద్ర బొగ్గుశాఖను సింగరేణి సంస్థ కోరినా స్పందన రాలేదు. వేలానికి దూరంగా ఉండడంతో ఇప్పటికే ఇక్కడి కోయగూడెం, సత్తుపల్లి-3 గనులను ప్రైవేటు బొగ్గు కంపెనీలు దక్కించుకున్నాయి. ఈ రెండింటిలో 20 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు అంచనా. కొత్త గనులు దక్కకుంటే... బొగ్గు ఉత్పత్తి పెరగక అనేక సమస్యలు వస్తాయని సింగరేణి సంస్థ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వేలంలో పాల్గొనడానికి అనుమతి కోరింది. వేలంలో పాల్గొనవద్దని గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఉత్తర్వులిచ్చిందా అని సీఎం కార్యాలయం వాకబు చేసింది. రాతపూర్వకంగా ఉత్తర్వులేమీ జారీచేయలేదని, రాజకీయ కారణాలతో గత ప్రభుత్వం మౌఖిక ఆదేశాలతోనే వేలానికి దూరంగా ఉండాలని సూచించినట్లు తేలింది. వేలంలో పాల్గొంటే రాష్ట్రానికి, సింగరేణికి ఏమైనా నష్టం జరుగుతుందా అని ప్రభుత్వం ఆరాతీసింది. వేలంలో గనులు దక్కితే... అక్కడ తవ్వి అమ్మే బొగ్గు విలువలో కనీసం 4 శాతానికి మించి రాయల్టీని రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఈ సుంకాన్ని అధికంగా చెల్లించడానికి సిద్ధమై, వేలం టెండరులో కోట్‌ చేసిన కంపెనీకే కేంద్ర బొగ్గుశాఖ గనులను కేటాయిస్తుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న కొన్ని గనులను ఇప్పటికే పలు ప్రైవేటు కంపెనీలు 20 నుంచి 30 శాతం రాయల్టీని చెల్లిస్తామని దక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలో వేలంలో పాల్గొనడానికి సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించినట్లు సమాచారం. 

కేంద్ర మంత్రి కరుణించాలని... 

కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా కిషన్‌రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టినందున సింగరేణికి మేలు జరుగుతుందని ఉద్యోగులు, అధికారులు, రాష్ట్ర నేతలు ఎదురుచూస్తున్నారు. వేలంతో సంబంధం లేకుండా నేరుగా గనులు కేటాయించేందుకు మంత్రి సహకరిస్తే బొగ్గు అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో చెల్లించే ఆర్థికభారం సింగరేణిపై పడదు. వేలంలో దక్కిన గనులపై రాయల్టీని చెల్లిస్తే భవిష్యత్తులో బొగ్గు ఉత్పత్తి వ్యయం, విక్రయధరలు పెరుగుతాయి. దీంతో విద్యుదుత్పత్తి వ్యయం పెరుగుతుంది. ఆ భారమంతా అంతిమంగా కరెంటు ఛార్జీలపై పడుతుంది. అందుకే తెలంగాణలోని గనులన్నీ సింగరేణికి నేరుగా కేటాయించేందుకు కేంద్రమంత్రి కరుణించాలని సంస్థ ఉద్యోగులు, కార్మిక సంఘాల వారు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని