Colonel Santosh Babu:  సంతోష్‌బాబుకు మహావీర్‌చక్ర

తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో గత ఏడాది జూన్‌లో చైనా సైనికులతో పోరులో అమరుడైన కర్నల్‌ బిక్కుమల్ల సంతోష్‌బాబుకు యుద్ధకాలంలో ఇచ్చే రెండో అత్యున్నత శౌర్య పురస్కారం

Updated : 24 Nov 2021 11:02 IST

స్వీకరించిన భార్య సంతోషి, తల్లి మంజుల

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా ‘మహావీర్‌చక్ర’ అందుకొంటున్న కర్నల్‌ బి.సంతోష్‌బాబు భార్య సంతోషి, తల్లి మంజుల

దిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో గత ఏడాది జూన్‌లో చైనా సైనికులతో పోరులో అమరుడైన కర్నల్‌ బిక్కుమల్ల సంతోష్‌బాబుకు యుద్ధకాలంలో ఇచ్చే రెండో అత్యున్నత శౌర్య పురస్కారం మహావీర్‌చక్రను కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసింది. మంగళవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో సంతోష్‌బాబు భార్య సంతోషి, మాతృమూర్తి మంజుల రాష్ట్రపతి నుంచి పురస్కారాన్ని స్వీకరించారు. నల్గొండ జిల్లా సూర్యాపేటకు చెందిన సంతోష్‌బాబు 16 బిహార్‌ రెజిమెంట్‌కు కమాండింగ్‌ అధికారిగా పనిచేసేవారు. సికింద్రాబాద్‌ తిరుమలగిరిలోని మిలిటరీ కాలేజ్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ కళాశాల (ఎంసీఈఎంఈ) కమాండెంట్‌గా వ్యవహరిస్తున్న లెఫ్టినెంట్‌ జనరల్‌ టీఎస్‌ఏ నారాయణన్‌ను కేంద్రం అతి విశిష్ట్‌ సేవా పురస్కారంతో సత్కరించింది. భారత వైమానిక దళాధిపతి (ఐఏఎఫ్‌) ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌదరి, నౌకాదళాధిపతిగా బాధ్యతలు చేపట్టనున్న వైస్‌ అడ్మిరల్‌ ఆర్‌ హరికుమార్‌కు కేంద్రం పరమ్‌ విశిష్ట్‌ సేవా పురస్కారాలను ప్రదానం చేసింది.

రాష్ట్రపతి చేతులమీదుగా అవార్డు అందుకుంటున్న సికింద్రాబాద్‌ ఎంసీఈఎంఈ

కమాండెంట్‌, లెఫ్టినెంట్‌ జనరల్‌ టీఎస్‌ఏ నారాయణన్‌

మా కుటుంబానికి గర్వకారణం: సంతోషి

మహావీర్‌ చక్ర పురస్కారాన్ని స్వీకరించడం తనకు, తన కుటుంబానికి గర్వకారణమని కర్నల్‌ సంతోష్‌బాబు సతీమణి సంతోషి పేర్కొన్నారు.  ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘నా భర్త దేశం కోసం నిస్వార్థమైన త్యాగం చేశారు.  విచారంగా అనిపిస్తే.. ఇదే అంశాన్ని గుర్తుకు తెచ్చుకుని ఆ పరిస్థితిని అధిగమిస్తాను’ అని వ్యాఖ్యానించారు.

సంతోష్‌ త్యాగం అసామాన్యం

సూర్యాపేట, న్యూస్‌టుడే: తమ కుమారుడు చేసిన త్యాగం సామాన్యమైనది కాదని, గల్వాన్‌ లోయ ఘటన భారత రక్షణ వ్యవస్థపై అంతర్జాతీయంగా ఉన్న అభిప్రాయాన్ని మార్చివేసిందని సంతోష్‌బాబు తండ్రి ఉపేందర్‌ పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని