EPF higher pension: లాభమా? నష్టమా?

ఒక సంస్థలో పనిచేసి, పదవీ విరమణ చేసిన ఉద్యోగి ఒకరు అధిక పింఛను కోసం ఏడాది క్రితం దరఖాస్తు చేశారు. దాన్ని పరిశీలించిన ఈపీఎఫ్‌వో ఆయనకు డిమాండ్‌ నోటీసు జారీ చేసింది. ఈపీఎస్‌కు బకాయిల కింద రూ.21 లక్షలు కట్టాలని అందులో పేర్కొంది.

Updated : 05 Jul 2024 06:48 IST

పింఛను ఎంతొస్తుందో చెప్పకుండానే డిమాండ్‌ నోటీసులు 
ఈపీఎఫ్‌ అధిక పింఛను దరఖాస్తుదారుల్లో ఆందోళన

ఒక సంస్థలో పనిచేసి, పదవీ విరమణ చేసిన ఉద్యోగి ఒకరు అధిక పింఛను కోసం ఏడాది క్రితం దరఖాస్తు చేశారు. దాన్ని పరిశీలించిన ఈపీఎఫ్‌వో ఆయనకు డిమాండ్‌ నోటీసు జారీ చేసింది. ఈపీఎస్‌కు బకాయిల కింద రూ.21 లక్షలు కట్టాలని అందులో పేర్కొంది. అయితే, నోటీసులో పేర్కొన్న మొత్తం చెల్లిస్తే ఎంత పింఛను వస్తుంది? పింఛనును ఏవిధంగా లెక్కిస్తారన్న వివరాలేమీ అందులో లేవు. దాంతో ‘అధిక పింఛను’ వల్ల లాభమా? నష్టమా? అనే స్పష్టత రాక ఆందోళనకు గురవుతున్నారు.

ఈనాడు, హైదరాబాద్‌: అధిక పింఛను దరఖాస్తుల పరిష్కారంలో ఈపీఎఫ్‌వో తీసుకుంటున్న నిర్ణయాలు చందాదారులు, విశ్రాంత ఉద్యోగుల్లో గందరగోళం సృష్టిస్తున్నాయి. డిమాండ్‌ నోటీసుల మేరకు ఉద్యోగుల పింఛను పథకం (ఈపీఎస్‌)కు బకాయిలు చెల్లించాలా? వద్దా? నిర్ణయించుకోలేకపోతున్నారు. బకాయిల నోటీసులు జారీ చేస్తున్న ఈపీఎఫ్‌వో.. పింఛను లెక్కింపు ఫార్ములా, ప్రతినెలా ఎంత మొత్తం పింఛను వస్తుందో స్పష్టత ఇవ్వకపోవడంతో పథకంలో చేరేందుకు సగానికిపైగా చందాదారులు ఆసక్తి చూపడం లేదు. 

నోటీసుల జారీలో జాప్యం

హైదరాబాద్‌ ప్రాంతీయ కార్యాలయం పరిధిలో వివిధ సంస్థల పరిధిలోని 12,700 మంది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఒక్కో దరఖాస్తును పరిశీలించి.. డిమాండ్‌ నోటీసు జారీ చేసేందుకు ఒక్కో ఉద్యోగికి రెండు రోజుల సమయం పడుతోంది. అధిక పింఛను కోసం ఏర్పాటు చేసిన సెక్షన్‌లో నలుగురు ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. వివరాలన్నీ చూసి నోటీసులు జారీ చేయడం.. వారికి తలకు మించిన భారంగా మారింది. ఈ నేపథ్యంలో అదనంగా 20 మంది అసిస్టెంట్లు, ఇద్దరు సహాయ పీఎఫ్‌ కమిషనర్లను నియమించాలని ఉన్నతాధికారులను కోరారు. కానీ, దీనిపై ఇప్పటివరకు సానుకూల నిర్ణయం వెలువడలేదు. తక్కువ మంది సిబ్బందితో ఈ ప్రక్రియను కొనసాగిస్తే అందరికీ డిమాండ్‌ నోటీసులు జారీ కావడానికి ఏళ్లకొద్దీ సమయం పట్టే అవకాశముందని ఈపీఎఫ్‌వో వర్గాలు చెబుతున్నాయి. 

అంగీకరించిన వారికి స్పష్టత ఏదీ?

తమకు వచ్చిన డిమాండ్‌ నోటీసుల మేరకు పింఛను పథకం(ఈపీఎస్‌) బకాయిలను కొందరు చెల్లిస్తున్నారు. తమ భవిష్య నిధి ఖాతాలోని నిల్వ నుంచి ఉపసంహరించుకునేందుకు అంగీకారం తెలుపుతున్నారు. ఆ మేరకు నిల్వలు లేని ఉద్యోగులు, పింఛనుదారులు.. డిమాండ్‌ మొత్తానికి సమానమైన చెక్కులు అందిస్తున్నారు. అయితే, చెక్కుల చెల్లుబాటు అనంతరం అధిక పింఛను దరఖాస్తు ఆమోదించిన సమాచారాన్ని చందాదారులకు ఈపీఎఫ్‌వో తెలియజేయడం లేదు. ఆరు నెలల క్రితం డిమాండ్‌ నోటీసులు అందుకున్న చందాదారులు, పింఛనుదారులు కొందరు.. అప్పులు చేసి మరీ బకాయిలు చెల్లించేందుకు చెక్కులు ఇచ్చారు. ఈ చెక్కులు చెల్లుబాటైనా ఇప్పటివరకు సవరణ పింఛను చెల్లింపు పత్రా (పీపీఓ)లు జారీ చేయకపోవడంతో వడ్డీలు చెల్లించలేక, అధిక పింఛను అందక ఇబ్బందులు పడుతున్నారు. డిమాండ్‌ నోటీసుల మేరకు భవిష్యనిధి ఖాతాల్లోని నిల్వల నుంచి నిధులు తీసుకునేందుకు అంగీకారపత్రాలు ఇచ్చి నెలలు గడుస్తున్నా ఈపీఎస్‌ నిబంధనల మేరకు పింఛను నిధికి యాజమాన్యం వాటా కింద 9.49 శాతం చందా జమ కావడం లేదు. యాజమాన్యాల నుంచి పాత పద్ధతిలోనే చలాన్లు స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంగీకార పత్రాలు ఇచ్చినవారికి మరోసారి డిమాండ్‌ నోటీసులు జారీ అవుతాయా? లేక ఆటోమెటిక్‌గా నిధులు సర్దుబాటు చేస్తారా? అన్న అంశంపై గందరగోళం నెలకొంది.

ఆర్టీసీ పరిధిలో ఇలా.. 

హైదరాబాద్‌ ఈపీఎఫ్‌వో పరిధిలో 81 వేల మంది ఆర్టీసీ కార్మికులు అధిక పింఛనుకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కేవలం 30 వేల మందికే డిమాండ్‌ నోటీసుల మేరకు బకాయిలు చెల్లించేందుకు ముందుకు వచ్చారు. రూ.లక్షలు చెల్లించాలంటూ నోటీసులు ఇస్తున్న ఈపీఎఫ్‌వో అధికారులు.. కనీసం పదవీ విరమణ చేసిన కార్మికులు, ఉద్యోగులకు సైతం అధిక పింఛను లెక్కింపు ఫార్ములా, పింఛను ఎంత వస్తుందో చెప్పకపోవడంతో చాలామంది వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం. ఆర్టీసీలో ఇప్పటివరకు కేవలం ఒక్కరికి మాత్రమే పింఛను చెల్లింపు పత్రం(పీపీవో) జారీ అయినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని