Congress: మీరే నడిపించాలి

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలైనా.. సోనియాగాంధీ నాయకత్వంపైనే కాంగ్రెస్‌ అత్యున్నత విధాన నిర్ణాయక మండలి.. సీడబ్ల్యూసీ సంపూర్ణ విశ్వాసం వ్యక్తంచేసింది. పార్టీని బలోపేతం చేసే అధికారాన్ని ఆమెకే అప్పగిస్తూ

Updated : 14 Mar 2022 05:56 IST

సోనియాగాంధీ నాయకత్వంపైనే సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేసిన సీడబ్ల్యూసీ

మా వల్లే పార్టీకి నష్టమంటే ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమన్న గాంధీ కుటుంబం

ఆగస్టు 20న పార్టీ అధ్యక్ష ఎన్నిక: సూర్జేవాలా

ఈనాడు, దిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలైనా.. సోనియాగాంధీ నాయకత్వంపైనే కాంగ్రెస్‌ అత్యున్నత విధాన నిర్ణాయక మండలి.. సీడబ్ల్యూసీ సంపూర్ణ విశ్వాసం వ్యక్తంచేసింది. పార్టీని బలోపేతం చేసే అధికారాన్ని ఆమెకే అప్పగిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించింది. సంస్థాగత ఎన్నికల ద్వారా కొత్త అధ్యక్షుడి ఎన్నిక పూర్తయ్యేవరకు పార్టీకి మార్గనిర్దేశం చేయాలని నేతలంతా సోనియాను కోరారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికలు ఆగస్టు 20న నిర్వహిస్తామని పార్టీ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్‌సింగ్‌ సూర్జేవాలా తెలిపారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు దారుణమైన ఫలితాలు ఎదురైన నేపథ్యంలో ఆదివారం సోనియా నేతృత్వంలో సీడబ్ల్యూసీ భేటీ దాదాపు నాలుగు గంటలకు పైగా సాగింది. సోనియా  ప్రారంభోపన్యాసం చేస్తూ.. ‘‘గాంధీ కుటుంబం కారణంగానే పార్టీ బలహీనపడుతోందని కొందరు అంటున్నారు. సభ్యులు కూడా అదే అభిప్రాయంతో ఉంటే పార్టీ కోసం మేం ఎలాంటి త్యాగానికైనా సిద్ధం’’ అని పేర్కొన్నారు. పరోక్షంగా రాజీనామాలకు సిద్ధమన్న సంకేతాలిచ్చారు. దీనికి సీడబ్ల్యూసీ సభ్యులు అంగీకరించలేదు. పార్టీని సంస్థాగతంగా సోనియానే బలోపేతం చేయాలని కోరారు. సాధారణంగా సీడబ్ల్యూసీ భేటీలో ముఖ్యమైన 20 నేతలు మాత్రమే పాల్గొంటారు. ఈసారి మాత్రం శాశ్వత, ప్రత్యేక ఆహ్వానితుల పేరుతో మొత్తం 57 మందికి ఆహ్వానం పలికారు. ఇందులో ఎక్కువ మంది గాంధీ కుటుంబ విధేయులైన సభ్యులే అత్యధికులు ఉండడం విశేషం. అనారోగ్య కారణాలతో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కొవిడ్‌తో మాజీ రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోనీ హాజరు కాలేదు. పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, కె.సి.వేణుగోపాల్‌, పి.చిదంబరం, జీ-23 కూటమిలోని నేతలైన గులాంనబీ ఆజాద్‌, ఆనంద్‌ శర్మ, ముకుల్‌ వాస్నిక్‌లతో పాటు ప్రముఖ కాంగ్రెస్‌ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతల చెప్పిన విషయాలను సోనియా శ్రద్ధగా ఆలకించారు. వారు కోరినట్లు సంస్థాగతంగా పార్టీని పటిష్ఠం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదివరకు ఉత్తర్‌ప్రదేశ్‌ ఇన్‌ఛార్జిలుగా పనిచేసిన సీనియర్‌ నేతలు ఆజాద్‌, దిగ్విజయ్‌సింగ్‌లు తమ అనుభవాలను పంచుకున్నట్లు పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌ఛార్జి కె.సి. వేణుగోపాల్‌ వెల్లడించారు. చర్చలు ఆరోగ్యకరంగా, నిర్మొహమాటంగా జరిగాయని పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం గురించి విలేకర్లు అడిగిన ప్రశ్నకు పార్టీ ప్రధాన కార్యదర్శి సూర్జేవాలా బదులిస్తూ.. ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్తా రాహుల్‌గాంధీని అధ్యక్ష బాధ్యతలు చేపట్టమని కోరుతున్నారని, ముందు సంస్థాగత ఎన్నికలు జరుగుతాయని, తర్వాత అధ్యక్ష ఎన్నిక ఆగస్టు 20న జరుగుతుందని తెలిపారు.

అందుకే ఓడిపోయాం

భాజపా ప్రజావ్యతిరేక పాలనను ప్రజల్లో సరిగా ప్రచారం చేయకపోవడం వల్లే ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ దారుణమైన ఫలితాలు చవిచూసిందని వర్కింగ్‌ కమిటీ సమావేశానంతరం కె.సి.వేణుగోపాల్‌ తెలిపారు. ‘‘ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీకి తీవ్ర ఆందోళనకరంగా ఉన్నాయి. వ్యూహలోపం కారణంగా నాలుగు రాష్ట్రాల్లోని భాజపా ప్రజావ్యతిరేక పాలనను ప్రజల్లో ఎండగట్టలేకపోయామని, పంజాబ్‌లో నాయకత్వ మార్పిడి చేసినా, ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించలేకపోయామని పార్టీ అంగీకరించింది. తాజా ఎన్నికల ఫలితాలను సవినయంగా అంగీకరిస్తూనే ప్రభావశీలమైన ప్రతిపక్షపాత్రను ఇకముందు కూడా బలంగా పోషిస్తామని పార్టీ కార్యకర్తలు, దేశ ప్రజలకు హామీ ఇస్తోంది. 2022, 2023 అసెంబ్లీ ఎన్నికలతోపాటు, 2024 లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కోవడానికి పార్టీ పూర్తిస్థాయిలో సమాయత్తమవుతుంది. సోనియాగాంధీ నాయకత్వంపై పూర్తిస్థాయి విశ్వాసాన్ని సీడబ్ల్యూసీ వ్యక్తం చేస్తూనే పార్టీని ముందుండి నడిపించాలని ఆమెను అడగడంతో పాటు, సంస్థాగత బలహీనతలను పరిష్కరించాలని కోరింది. రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన విధంగా సంస్థాగతంగా సమగ్ర మార్పులు చేయాలి’’ అని సీడబ్ల్యూసీ ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు వేణుగోపాల్‌ వెల్లడించారు.

వారే ఆ పార్టీలోకి వెళ్లిపోయారు: ఆజాద్‌

కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలని మాట్లాడితే కొందరు తమను భాజపా ఏజెంట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని సీడబ్ల్యూసీ సమావేశంలో సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ ఆవేదనగా మాట్లాడారు. ‘మేం మాత్రం ఇప్పటికీ కాంగ్రెస్‌లోనే ఉన్నాం, మమ్మల్ని భాజపా ఏజెంట్లని చెప్పినవారే ముందుగా ఆ పార్టీలోకివెళ్లిపోయారు’ అని ఆయన అన్నట్లు సమాచారం.


రాజస్థాన్‌లో చింతన్‌ శిబిరం!

తాజా ఐదు రాష్రాల ఎన్నికల వైఫల్యంపై, పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించడానికి పార్లమెంటు సమావేశాలు అయిన వెంటనే విస్తృతస్థాయి చింతన్‌ శిబిరం నిర్వహించనున్నట్లు వేణుగోపాల్‌ తెలిపారు. ఇది రాజస్థాన్‌లో జరిగే అవకాశం ఉంది. అలాగే ఈనెలాఖరులోగా మరోసారి సమావేశం కావాలని సీడబ్ల్యూసీ నిర్ణయించింది.


రాహుల్‌కే పగ్గాలివ్వాలి: నేతల డిమాండ్‌ 

ఈనాడు, దిల్లీ: సీడబ్ల్యూసీ సమావేశానికి ముందు రాహుల్‌ గాంధీకి పార్టీ అధ్యక్ష పగ్గాలు అప్పగించాలన్న డిమాండ్లు జోరందుకున్నాయి. రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌.. గాంధీ కుటుంబానికి తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రధాని మోదీపై రాహుల్‌ గాంధీ సాగిస్తున్న పోరాటం అద్భుతమని కితాబిచ్చారు. ప్రధాని తన ప్రసంగాల్లో రాహుల్‌నే లక్ష్యంగా చేసుకుంటున్నారని, దీన్ని బట్టి నాయకుడిగా అతని సత్తాను అర్థం చేసుకోవచ్చని అన్నారు. ‘‘నాయకత్వ పగ్గాలు రాహులే చేపట్టాలని పార్టీలో మేమందరం భావిస్తున్నాం’’ అని గహ్లోత్‌ తెలిపారు. కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు డి.కె.శివకుమార్‌ కూడా పార్టీ పూర్తిస్థాయి పగ్గాలను రాహుల్‌ చేపట్టాలని అన్నారు. మరోవైపు సీడబ్ల్యూసీ సమావేశం జరుగుతున్న ఏఐసీసీ కేంద్ర కార్యాలయం ముందు భారీస్థాయిలో దిల్లీకి చెందిన కాంగ్రెస్‌ కార్యకర్తలు చేరుకొని రాహుల్, గాంధీ కుటుంబానికి మద్దతుగా నినాదాలు చేశారు. ప్రస్తుతం దేశంలోని విపక్షాల్లో కాంగ్రెస్సే అత్యంత విశ్వసనీయ పక్షమని అని ఆ పార్టీ ఎంపీ శశిథరూర్‌ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా భాజపాకు 1400కు పైగా ఎమ్మెల్యేలుంటే, కాంగ్రెస్‌కు 753 మంది శాసనసభ్యులు ఉన్నారని పేర్కొన్నారు. కాబట్టి పార్టీని సంస్కరించుకొని, పునరుజ్జీవం చేసుకోవచ్చంటూ ట్వీట్‌ చేశారు. 


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని