Consumer Commission: డబ్బులు తీసుకుని ఫ్లాట్‌ నిర్మించకపోవడం సేవాలోపమే

ప్రీలాంచ్‌ పేరుతో సకాలంలో ఫ్లాట్‌ నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చి సొమ్ము వసూలు చేశాక నిర్మాణం చేపట్టకపోవడం.. దీనిపై నోటీసు ఇచ్చినా స్పందించని సాహితీ ఇన్‌ఫ్రాది సేవాలోపం, అనైతిక వ్యాపారమేనని రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ స్పష్టంచేసింది.

Updated : 13 Jun 2024 05:36 IST

ఇది అనైతిక వ్యాపారం
పరిహారంతోపాటు కట్టిన సొమ్మును వడ్డీతో చెల్లించాలి
సాహితీ ఇన్‌ఫ్రాకు రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: ప్రీలాంచ్‌ పేరుతో సకాలంలో ఫ్లాట్‌ నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చి సొమ్ము వసూలు చేశాక నిర్మాణం చేపట్టకపోవడం.. దీనిపై నోటీసు ఇచ్చినా స్పందించని సాహితీ ఇన్‌ఫ్రాది సేవాలోపం, అనైతిక వ్యాపారమేనని రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ స్పష్టంచేసింది. సాహితీ ఇన్‌ఫ్రా చేపట్టిన వెంచర్‌లో ఫ్లాట్లు కొనుగోలు చేసినవారి నుంచి కష్టార్జితాన్ని వసూలు చేసి వారి నోటీసులపై స్పందించకపోవడాన్ని తప్పుబట్టింది. ఇది కొనుగోలుదారులకు ఆర్థిక నష్టమే కాకుండా సొంతింటి కలను చెరిపివేయడమేనని.. మానసిక వేదనకు గురి చేయడమేనని పేర్కొంది. ఫ్లాట్‌ కొనుగోలుదారులకు వారు చెల్లించిన సొమ్మును వడ్డీతో కలిపి ఇవ్వాలని.. అలాగే పరిహారం, ఖర్చులు చెల్లించాలంటూ రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ మూడు వేర్వేరు పిటిషన్లకు సంబంధించి తీర్పును వెలువరించింది. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి మండలం ప్రగతినగర్‌లో సాహితీ ఇన్‌ఫ్రాటెక్‌ వెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ చేపట్టిన సాహితీస్‌ ఆనంద్‌ ఫార్చ్యూన్‌లో ప్రీ లాంచ్‌ కింద రూ.57.42 లక్షలకు 2020లో ఫ్లాట్‌ను కొనుగోలు చేయగా నిర్మాణం చేపట్టడం గానీ, సొమ్ము వాపసు ఇవ్వడం గానీ చేయకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన జి.వెంకటసత్య సునీల్‌కుమార్‌ రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ సభ్యులు కె.రంగారావు, ఆర్‌.ఎస్‌.రాజశ్రీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి ఇటీవల తీర్పును వెలువరించింది. 

గడువులోగా నిర్మాణం చేపట్టకపోవడంతోపాటు లీగల్‌ నోటీసుకు సమాధానం ఇవ్వకపోవడం అనైతిక వ్యాపారమేనని పేర్కొంది. పిటిషనర్‌ చెల్లించిన మొత్తం రూ.52.42 లక్షలను 12 శాతం వడ్డీతో వాపసు ఇవ్వాలని సాహితీ ఇన్‌ఫ్రాను ఆదేశించింది. అంతేకాకుండా మానసిక వేదనకు గురి చేసినందున రూ.లక్ష పరిహారం, కోర్టు ఖర్చుల కింద మరో రూ.50 వేలు చెల్లించాలని ఆదేశించింది. అలాగే హైదరాబాద్‌కు చెందిన తిరువీధి పుష్పలత ఫ్లాట్‌ కొనుగోలు నిమిత్తం చెల్లించిన రూ.60.61 లక్షలను 12 శాతం వడ్డీతోపాటు రూ.లక్ష పరిహారం, రూ.50 వేలు ఖర్చుల కింద చెల్లించాలని ఆదేశించింది. మౌలాలికి చెందిన సీవీవీఎస్‌ మూర్తి ఫ్లాట్‌ కొనుగోలు నిమిత్తం చెల్లించిన రూ.63.66 లక్షలను 9 శాతం వడ్డీతోపాటు పరిహారంగా రూ.2 లక్షలు, ఖర్చుల కింద రూ.25 వేలు చెల్లించాలని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని