Damodar Rajanarsimha: ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనం నిర్మిస్తాం

ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవనం నిర్మిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ తెలిపారు. హైదరాబాద్‌ ఉస్మానియా ఆసుపత్రిని ఆయన శుక్రవారం సందర్శించి.. పలు వార్డులు, విభాగాలను పరిశీలించారు.

Published : 22 Jun 2024 04:30 IST

మంత్రి దామోదర్‌ రాజనర్సింహ

ఎంఆర్‌ఐను ప్రారంభించిన మంత్రి దామోదర్‌ రాజనర్సింహ. చిత్రంలో ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్,
ఎమ్మెల్సీ రెహమత్‌ బేగ్, ఆసుపత్రి సూపరిటెండెంట్‌ డా. నాగేందర్‌  

ఉస్మానియా ఆసుపత్రి, న్యూస్‌టుడే: ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవనం నిర్మిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ తెలిపారు. హైదరాబాద్‌ ఉస్మానియా ఆసుపత్రిని ఆయన శుక్రవారం సందర్శించి.. పలు వార్డులు, విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రిలో రూ.14 కోట్ల ఎంఆర్‌ఐ పరికరాన్ని, రూ.2.16 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో రూపొందించిన వంటశాలను, రూ.55 లక్షలతో ఆధునికీకరించిన జనరల్‌ మెడిసిన్‌ ఓపీ బ్లాక్‌లను మంత్రి ప్రారంభించారు. రూ.9.5 కోట్లతో కొనసాగుతున్న ఉస్మానియా మార్చురీ ఆధునికీకరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చారిత్రక ఉస్మానియా ఆసుపత్రికి చికిత్స చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆసుపత్రి భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చర్చిస్తామన్నారు. ఇక్కడ పలు సమస్యలు ఉన్నప్పటికీ వైద్యులు, నర్సింగ్, ఇతర సిబ్బంది మెరుగైన సేవలు అందిస్తుండటం అభినందనీయమన్నారు. మార్చురీ పరిసర ప్రాంతాల్లో దుర్గంధం వ్యాపిస్తున్నట్లు స్థానిక కార్పొరేటర్‌ శంకర్‌యాదవ్‌ తన దృష్టికి తెచ్చారని.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రాథమిక వైద్యాన్ని మరింత బలోపేతం చేయాలని సర్కారు నిర్ణయించిందని ఈ సందర్భంగా తెలిపారు. పేదలకు మెరుగైన ప్రభుత్వ వైద్యసేవలు అందించేందుకు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి విధివిధానాలను రూపొందిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం కొత్త సచివాలయం, పెద్ద విగ్రహాలపై పెట్టిన శ్రద్ధ ఉస్మానియాపై పెట్టలేదని విమర్శించారు. కాళేశ్వరం, కొత్త సచివాలయం అవసరమా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్‌ లోథ్, రాజ్యసభ సభ్యుడు ఎం.అనిల్‌కుమార్‌ యాదవ్, ఎమ్మెల్సీలు ఎం.ఎస్‌.ప్రభాకర్‌రావు, సురభి వాణిదేవి, రెహమత్‌ బేగ్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్, కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి, ఉస్మానియా సూపరింటెండెంట్‌ డా.నాగేందర్, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని