CM Revanth Reddy: నిరుద్యోగులకు మేలు జరిగేలా నిర్ణయాలు

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, తప్పకుండా నిరుద్యోగులకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

Published : 06 Jul 2024 03:10 IST

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై కృత నిశ్చయంతో ఉన్నాం
నిబంధనలు ఇష్టమొచ్చినటు మారిస్తే చట్టపరంగా సమస్యలు
రాజకీయ పార్టీలు, స్వార్థపూరిత శక్తుల కుట్రలకు బలి కావొద్దు
శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లోనే జాబ్‌ క్యాలెండర్‌ విడుదల
సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టీకరణ

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, తప్పకుండా నిరుద్యోగులకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు, స్వార్థపూరిత శక్తుల కుట్రలకు నిరుద్యోగులు బలి కావొద్దని నిరుద్యోగులకు సూచించారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో ఇష్టమొచ్చినట్లు నిబంధనలు మారిస్తే చట్టపరమైన సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని, ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలా తప్పు నిర్ణయాలు తీసుకుంటే నిరుద్యోగులకు న్యాయం జరగకపోగా.. ఇప్పుడున్న నోటిఫికేషన్లు కూడా రద్దయ్యే ప్రమాదముందని అన్నారు. నిరుద్యోగుల ఆందోళనల దృష్ట్యా శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో పలువురు నాయకులు, విద్యార్థి సంఘాల నేతలు, అధికారులతో సీఎం సమావేశం నిర్వహించారు.

మూడు గంటల పాటు చర్చ

దాదాపు మూడు గంటల పాటు జరిగిన సమావేశంలో నిరుద్యోగుల డిమాండ్లు, జరుగుతున్న ఆందోళనల గురించి సీఎం అడిగి   తెలుసుకున్నారు.వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు సంబంధిత అధికారులను పిలిపించి మాట్లాడారు. నిరుద్యోగులు లేవనెత్తిన డిమాండ్లను పరిష్కరించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై చర్చించారు. గ్రూప్‌ 1 పరీక్షకు ఒక్కో పోస్టుకు 1:50 నిష్పత్తి చొప్పున కాకుండా 1:100 చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేయాలనే డిమాండ్‌పై ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చ జరిగింది. అధికారులు సీఎంకు పరిస్థితులను వివరించారు. ‘‘గత ప్రభుత్వం 2022లో గ్రూప్‌ 1 పరీక్షకు నోటిఫికేషన్‌ ఇవ్వగా పేపర్ల లీకేజీ, తప్పు నిర్ణయాల కారణంగా రెండు సార్లు వాయిదా పడింది. కొత్త ప్రభుత్వం రాగానే సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి ఉన్న పిటిషన్‌ను వెనక్కి తీసుకుంది. పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసి అదనంగా మరిన్ని పోస్టులతో కొత్త నోటిఫికేషన్‌ జారీ చేసింది.  పన్నెండేళ్ల తర్వాత చేపట్టిన గ్రూప్‌ 1 పరీక్షకు 4 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఇటీవలే ప్రిలిమినరీ పరీక్షను టీజీపీఎస్సీ పకడ్బందీగా నిర్వహించింది. నోటిఫికేషన్‌ ప్రకారం ప్రిలిమ్స్‌లో మెరిట్‌ ఆధారంగా ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్‌కు ఎంపిక జరుగుతుంది. ఇప్పుడు 100 మందిని ఎంపిక చేసేలా నిబంధనలను సవరిస్తే కోర్టులు జోక్యం చేసుకునే ప్రమాదముంది. అదే జరిగితే మొత్తం నోటిఫికేషన్‌ మళ్లీ నిలిచిపోతుంది. నోటిఫికేషన్‌లో ఉన్న నిబంధనలను మారిస్తే న్యాయపరంగా చెల్లుబాటు కావు’’ అని అధికారులు తెలిపారు. గ్రూప్‌ 1 పరీక్ష రెండోసారి రద్దయినప్పుడు హైకోర్టు చేసిన వ్యాఖ్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అప్పటి నోటిఫికేషన్‌లో ఉన్న బయోమెట్రిక్‌ పద్ధతిని ఎందుకు పాటించలేదనే ఏకైక కారణంతో న్యాయస్థానం పరీక్షను రద్దు చేసిందని గుర్తుచేశారు. 1999లో యూపీఎస్సీ వర్సెస్‌ గౌరవ్‌ ద్వివేది కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా అధికారులు ఉదహరించారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న దానికంటే ఎక్కువ మందికి అవకాశమిస్తే.. ముందుగా ఉన్నవాళ్లకు అన్యాయం జరిగినట్లే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. గ్రూప్‌ 2, గ్రూప్‌ 3 పోస్టుల పెంపు మీద కూడా చర్చ జరిగింది. పరీక్షల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో పోస్టులు పెంచడం కూడా నోటిఫికేషన్‌ను ఉల్లంఘించినట్లే అవుతుందని, అప్పుడు కూడా కోర్టులు జోక్యం చేసుకోవచ్చని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ‘‘గ్రూప్‌ 1కు కొత్త నోటిఫికేషన్‌ ఇచ్చినందున పోస్టుల సంఖ్య పెంచడం సాధ్యమైంది. గ్రూప్‌ 2, గ్రూప్‌ 3 నోటిఫికేషన్లకు అలాంటి వెసులుబాటు లేదు’’ అని అధికారులు చెప్పారు. గ్రూప్‌ 2, డీఎస్సీ పరీక్షలు ఒక దాని వెంట ఒకటి ఉండడంతో అభ్యర్థులు నష్టపోతున్నారని విద్యార్థి సంఘం నాయకులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. జులై 17 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు ఉన్నాయని, ఆ వెంటనే 7, 8 తేదీల్లో గ్రూప్‌ 2 ఉండడంతో ప్రిపరేషన్‌కు అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారని వివరించారు. పరీక్షల తేదీల విషయంలో టీజీపీఎస్సీ, విద్యాశాఖతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని సీఎం వారికి హామీ ఇచ్చారు.

కోర్టు చిక్కులన్నింటినీ అధిగమించి...

నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం తమ ప్రభుత్వం ఇప్పటికే 28,942 ఉద్యోగ నియామకాలు చేపట్టిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏళ్లకు ఏళ్లు పెండింగ్‌లో ఉన్న గ్రూప్‌ 1, గ్రూప్‌ 2, గ్రూప్‌ 3 నియామకాలకు ఉన్న కోర్టు చిక్కులన్నింటినీ అధిగమించిందని చెప్పారు. జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం పోటీ పరీక్షలు నిర్వహించి, ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లోనే  చర్చించి జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టే నియామక పరీక్షలు, వివిధ బోర్డులు నిర్వహించే పరీక్షలకు ఆటంకాలు లేకుండా నిరుద్యోగులకు పూర్తి న్యాయం జరిగేలా క్యాలెండర్‌ రూపొందిస్తామన్నారు. ఇంత కీలకంగా తమ ప్రభుత్వం నిరుద్యోగుల విషయంలో కసరత్తు చేస్తుంటే.. కొందరు మాత్రం తమ రాజకీయ ప్రయోజనాల కోసం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని సీఎం మండిపడ్డారు. కొందరు చేసే కుట్రలతో నోటిఫికేషన్లలోని నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగాలు భర్తీ చేసే ప్రక్రియ నిలిచిపోయి, నిరుద్యోగులు మరింత నష్టపోతారని ముఖ్యమంత్రి రేవంత్‌ స్పష్టం చేశారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, టీచర్ల ఐకాస ప్రతినిధి హర్షవర్ధన్‌రెడ్డి, ఓయూ నాయకులు చనగాని దయాకర్, మానవతారాయ్, బాల లక్ష్మి, చారకొండ వెంకటేశ్, కాల్వ సుజాత తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు