TG News: ఆరు జిల్లాల్లో లోటు వర్షపాతం

రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో గత నెలలో అడపాదడపా ఓ మోస్తరు వర్షాలు మాత్రమే కురిశాయి. జూన్‌లో సాధారణ వర్షపాతం 131.4 మి.మీ. కాగా.. సగటున 17 శాతం అధిక వర్షపాతం (153.5 మి.మీ.) నమోదైనప్పటికీ 6 జిల్లాల్లో తీవ్రమైన లోటు నెలకొంది.

Published : 07 Jul 2024 03:16 IST

మరో 8 జిల్లాల్లో సాధారణ వర్షాలు
19 జిల్లాల్లో 20 శాతానికిపైగా అధికం.. 
జులై ఆశాజనకంగానే ఉంటుందన్న ఐఎండీ 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో గత నెలలో అడపాదడపా ఓ మోస్తరు వర్షాలు మాత్రమే కురిశాయి. జూన్‌లో సాధారణ వర్షపాతం 131.4 మి.మీ. కాగా.. సగటున 17 శాతం అధిక వర్షపాతం (153.5 మి.మీ.) నమోదైనప్పటికీ 6 జిల్లాల్లో తీవ్రమైన లోటు నెలకొంది. మరో 8 జిల్లాల్లో సాధారణ స్థాయిలోనే వానలు కురిశాయి. ఈ క్రమంలో తొలకరిలోనే విత్తిన పత్తి, మొక్కజొన్న వంటి పంటలకు లోటు వర్షపాతం శరాఘాతంలా మారింది. నాటిన విత్తనాలు మొలకెత్తకపోవడంతో.. వాటిస్థానంలో మరోసారి నాటిన రైతులు వానల రాకకోసం ఎదురుచూస్తున్నారు.

143 మండలాల్లో తీవ్రమైన లోటు

రాష్ట్రంలో ఆరు జిల్లాల్లోని 143 మండలాల్లో తీవ్రమైన వర్షాల లోటు ఏర్పడింది. మంచిర్యాల జిల్లాలోని 18 మండలాలు, నిజామాబాద్‌లో 29, రంగారెడ్డిలో 27, సంగారెడ్డిలో 27, కామారెడ్డిలో 23, వికారాబాద్‌ జిల్లాలోని 19 మండలాలు లోటును ఎదుర్కొంటున్నాయి.  

  • ఎనిమిది జిల్లాల పరిధిలోని 138 మండలాల్లో సాధారణ స్థాయిలో (సాధారణ వర్షపాతానికి 19 శాతం అటూ ఇటూ) వర్షాలు కురిశాయి. 
  • 6 జిల్లాల్లోని 147 మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం కన్నా 60 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. 
  • మిగిలిన 13 జిల్లాల్లోని మండలాల్లో సాధారణం కన్నా 20 నుంచి 59 శాతం వరకు అధిక వర్షపాతం నమోదయింది.

వాతావరణం చల్లబడనేలేదు 

జూన్‌ రెండోవారం వరకు ఉష్ణోగ్రతలు కొంత అధికంగా కొనసాగడం సాధారణం. ఈసారి జూన్‌ మూడో వారం వరకు ఉష్ణోగ్రతలు పెద్దగా తగ్గలేదు. నైరుతి రుతుపవనాలతో మంచి వర్షాలు కురవాల్సి ఉండగా అడపాదడపా పడడమే దీనికి కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఉత్తర భారతదేశంలో నైరుతి విస్తరణ నెమ్మదిగా జరగడంతో దక్షిణ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు, తుపాన్లు ఏర్పడలేదని పేర్కొంటున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నైరుతి విస్తరణ పూర్తయిన నేపథ్యంలో రాష్ట్రంలో చల్లని  వాతావరణం కనిపిస్తోందని తెలిపారు. 

జులై ఆశాజనకం 

ఈ నెల ఆశాజనకంగానే ఉంటుందని వాతావరణశాఖ సూచిస్తోంది. మొదటి వారం అనంతరం మంచి వర్షాలు ఉంటాయని అంచనా వేస్తున్నట్లు హైదరాబాద్‌ వాతావరణశాఖ అధికారిణి శ్రావణి ‘ఈనాడు’కు తెలిపారు. అరేబియా మహాసముద్రం నుంచి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని, సాధారణం కన్నా అధికంగా వర్షాలు నమోదవుతాయని ఆమె పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని